ప్చ్.. సెల్ఫీ ఎంత పనిచేసిందో…!!

Marriage Cancelled due to Selfie in Karimnagar District

కరీంనగర్: ఒక సెల్ఫీ ఏకంగా పెళ్లిని ఆపేసిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది. దీంతో వరుడి తరఫు వారితో పాటు వధువు తరఫు వారు కూడా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా సూరారం గ్రామానికి చెందిన ఓ యువతి(23) హైదరాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేసే సమయంలో అక్కడే క్యాషియర్ గా పనిచేస్తున్న ప్రశాంత్ అనే యువకుడితో సెల్ఫీలు దిగింది. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన ఆడెపు అనిల్ కుమార్‌తో పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం వీరి వివాహం జరగాల్సి ఉంది. హుజురాబాద్‌లో వీరి పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరిగిపోయాయి. వధువరులు ఇద్దరు పెళ్లిపీటలెక్కేందుకు రెడీగా ఉన్నారు. ఇంతలో వరుడి మొబైల్‌కు వాట్సాప్‌లో కొన్ని ఫోటోలు వచ్చాయి. ఆ ఫోటోల్లో వధువు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఉన్నాయి.

గతంలో తనతో యువతి దిగిన ఫోటోలను ప్రశాంత్ వరుడికి పంపించాడు. అంతటితో ఆగని అతడు ఏకంగా వరుడికి ఫోన్ చేసి తామిద్దరం కొంతకాలంగా ప్రేమలో ఉన్నామని చెప్పాడు. దీంతో వరుడు అనిల్ కుమార్ వధువు ప్రేమ వ్యవహారం దాచిపెట్టి తనను మోసం చేశారని ఆరోపిస్తూ యువతితో పెళ్లికి నిరాకరించాడు. వధువుతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు వధువు కూడా ప్రశాంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎప్పుడో తీసుకున్న సెల్ఫీలను అడ్డుపెట్టుకుని కావాలనే తన పెళ్లి ఆగిపోయేలా చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రశాంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ సంఘటనపై రెండు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Comments

comments