పోలీసు శాఖకు ప్రత్యేక ప్రాధాన్యత

Telangana government is the priority of the police department
మన తెలంగాణ/కరీంనగర్ క్రైం:  తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ది సాధ్యమవుతుందని తెలిపారు. కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలో ఐదుకోట్ల రూపాయలతో నిర్మిస్తున్న జి ప్లస్ టూ కమాండ్ కంట్రోల్‌ను మంగళవారం పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పరిశీలించారు. ఆనంతరం ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుందని అన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పోలీసు స్టేషన్‌ల ఆధునీకరణకు ప్రభుత్వం 9.30 కోట్ల రుపాయలను మంజూరు చేసిందని తెలిపారు. కరీంనగర్ కమీషనరేట్‌లో కరీంనగర్ ట్రాఫిక్, కరీంనగర్‌లోని మహిళా, హుజురాబాద్ పట్టణ, చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర పోలీసు స్టేషన్ల ఆధునీకరణ కోసం 60 లక్షలు కేటాయించడం జరిగిందని చెప్పారు. జగిత్యాల, సిరిసిల్లలలో ఎస్.పి కార్యాలయాలు, రామగుండంలో కమీషనర్ కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం 30 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. గోదావరిఖనిలో పోలీసు గెస్ట్‌హౌజ్ నిర్మాణం కోసం మూడు కోట్ల రుపాయలను మంజూరు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు క్వార్టర్‌లను 1200 ఎస్.ఎఫ్.టితో నిర్మించనున్నామని వివరించారు. జిల్లా పోలీసు కార్యాలయాలు (పరిపాలన) కోసం 1430 కోట్లను కేటాయించి మొదటి విడతగా 350 కోట్లను విడుదల చేసిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొదటి సమావేశం పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించి వివిధ రకాల సౌకర్యాల కల్పన కోసం 570 కోట్ల రుపాయలను కేటాయించిందని తెలిపారు. పోలీసు శాఖలో నిర్మిస్తున్న వివిధ భవనాల పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. కరీంనగర్‌లో నిర్మిస్తున్న జి ప్లస్ టూ కమాండ్ కంట్రోల్‌ను ఆగస్టు నెలలో ప్రారంభోత్వం జరగనున్నదని తెలిపారు. హరితహారంలో భాగంగా ప్రతి పోలీసు కుటుంబసభ్యులు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు. కరీంనగర్ పోలీసు కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ నిర్మాణం చివరి దశలో ఉందన్నారు. నూతన కమీషనరేట్ నిర్మాణం పనులు దసరా వరకు ప్రారంభం కానున్నాయని తెలిపారు. పోలీసు శాఖలో నిర్మించనున్న వివిధ రకాల నిర్మాణాలకు సంబంధించిన ఛాయచిత్రాలను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు ఎస్.శ్రీనివాస్ (పరిపాలన), పి.సంజీవ్‌కుమార్ (లా అండ్ ఆర్డర్), హౌజింగ్ కార్పొరేషన్ ఇఇ శ్రీనివాస్, ఎఇ రాజశేఖర్, ఆర్.ఐ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.