పోతనపై మరో చూపు

పోతన అనగానే మనకు ఒక హాలికుడైన కవి మనఃఫలకములో మెదలుతాడు. ఆయన బమ్మెర వాస్తవ్యుడు. పోతన జన్మతః శైవుడు. సదా శివ ధ్యాన తత్పరమతుడు. పోతన వీరభద్ర విజయము, భోగినీ దండకము, నారాయణ శతకము, భాగవతములను వెలువరించాడు. భాగవతము ఒక్కటే పోతన రచించాడని, ఇతర రచనలు పోతనవి కావని కొందరి వాదన. పోతన కుటుంబము శైవ సంప్రదాయమును పాటించినట్లుగా భాగవతములో 124, 26,2 పద్యాల ద్వారా తెలుస్తుంది. “కౌండిన్య సగోత్రుడనని… శైవ శాస్త్ర మతముగనియె” అని “సదా […]

పోతన అనగానే మనకు ఒక హాలికుడైన కవి మనఃఫలకములో మెదలుతాడు. ఆయన బమ్మెర వాస్తవ్యుడు. పోతన జన్మతః శైవుడు. సదా శివ ధ్యాన తత్పరమతుడు. పోతన వీరభద్ర విజయము, భోగినీ దండకము, నారాయణ శతకము, భాగవతములను వెలువరించాడు. భాగవతము ఒక్కటే పోతన రచించాడని, ఇతర రచనలు పోతనవి కావని కొందరి వాదన. పోతన కుటుంబము శైవ సంప్రదాయమును పాటించినట్లుగా భాగవతములో 124, 26,2 పద్యాల ద్వారా తెలుస్తుంది. “కౌండిన్య సగోత్రుడనని… శైవ శాస్త్ర మతముగనియె” అని “సదా శివ పాదయుగార్చనాను కంపానయ వాగ్భవాణికిని” (26) అని చెప్పుకున్నాడు. శివ తత్పరుడు కావడం వల్లనే తొలి నాళ్లల్లో వీరభద్ర విజయం కావ్యాన్ని రచించినట్టుగా భావించవచ్చు. ఈ కావ్యము నాలుగు ఆశ్వాసముల గ్రంథం. ఇది వీర శైవ మతానికి సంబంధించింది. పోతన జన్మస్థలమైన బమ్మెర పాలకుర్తి పక్కన ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. అప్పటికే పాల్కురికి సోమనాథుడు వీర శైవ మత వ్యాప్తికి పూనుకొని పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం లాంటి అనేక కావ్యాలు అందించడం, ఇంట్లోని వాతావరణం అంతా శైవ సదాచార నిష్టా గరిష్టులు కావడం వలన తొలి కావ్యంగా శ్రీ వీరభద్ర విజయం అందించినాడని అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. పోతన నాటికే పాల్కురికి సోమనాథుడు దేవుడై పూజింపబడుతున్నాడు. సోమన్నను పోతన కొలిచినట్లు తెలిపే
“పాలకుర్తి సోమలింగ నీ పాదములకు శరణు/ ఉడువుగ బమ్మెర పోతరాజునకు నీవు /కోరిన వరములు కృప చేసివావట…’ అనే కీర్తనను ఇప్పటికీ పాలకుర్తి ఉత్సవాలలో గానం చేయడం గమనిస్తాం. వీరభద్ర విజయంలోని ఈ క్రింది పద్యం పోతన శివ తత్పరతను తెలియబరుస్తుంది.
“నిఖిల తంత్రములకు నీలకంఠుడు వేల్పు /భువినగ్రదైవంబు పూజసేయు / భాగ్యంబు కొరతయే భావించుచూడుడు/ కర్మ మానసులార కష్టులార” “పరమేశ తత్వంబు పరికింప దేమిటి/ కీశాను నిజతత్వమెరుగదేల / పరమోపదేశంబు పరమంబు పరమాత్మ/ శివుడౌట ఎరుగరే సృష్టిననుచు” ఈ కావ్యం తదుపరి భోగినీ దండకాన్ని అందించాడు. దండక సాహిత్యములో ఇదొక విశిష్ట దండకంగా నమోదు చేసుకుంది. భోగినీ దండకము 70వ దశాబ్దిలో యువ భారతి వారు ‘భోగినీ లాస్యము’ పేరుతో ప్రచురించారు. ఆ దండకం చివర “పండిత కీర్తనీయుడగు బమ్మెర పోతన యా సుధాంశు మా / ర్తాండ కులాచలంబు నిధి తారకమై విలసిల్లు భోగినీ / దండకమున్ రచించె బహుదాన వివర్తకు రావు సింగ భూ / మండల భర్తకున్ మానవ నాథ మరూపహర్తకున్‌” అను పద్యంవలన ఇది పోతన రచనయే అని తెలుస్తున్నది. భాగవతమును దైవమునకు అంకితం చేసిన వాడు . ఒక వేశ్య యొక్క ప్రేమ కలాపములకు దండకముగా చెప్పి ఉండడని కొందరి వాదన. కానీ వయస్సులో ఉన్నప్పుడు పోతన రాజులను ఆశ్రయించి భోగినీ శృంగారమును వర్ణించినాడని అనుకోవచ్చు. పైగా ఇది భాగవతము రచన కంటే ముందుది. వయస్సుపెరిగిన కొద్దీ అతని మనస్సు చతుర్థ పురుషార్థం వైపు మరలి భాగవతమును రచించాడని భావించవచ్చు కదా! భోగినీ దండకములోని శైలి, భావములు, అనుప్రాసలు భాగవత రచనా శైలికి దగ్గరగా ఉండడం వలన ఇది పోతన కృతి అనుకోవడమే సబబు. భాగవతం దృష్టితో భోగినీ దండకమును పోతన రచన కాదనడం కేవలం హ్రస్వ దృష్టి అవుతుంది. పోతన మూడవ కృతి “నారాయణ శతకం” ఇందులోని ఈ పద్యాన్ని చూద్దాం
“అపరాధమ్ములు నిన్ను నమ్మి వినుమే నాజన్మపర్యంతమున్ / విపరీతమ్ముగ జేసినాడ నిక నీదే దిక్కు నాలోనికిన్ / గపటం బింతయు లేక దండధరునున్ గట్టీకరక్షింపుమో / కృపకున్ బాతృడనయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా!” (98)
మన సాహిత్యవేత్తలందరూ పోతన భాగవతానురక్తులై ఆ ప్రభావంతో పోతన కృతులను అంచనా వేసినారు. ఇది సరికాదు. భాగవతం పోతన చివరి రచన. అంతకు ముందు వచ్చిన వాటిలో భాగవత పరంపరలు ఎలా ఉంటాయనేది ఎవరూ ఆలోచించలేదనిపిస్తుంది. అనూచానంగా వస్తున్న శైవ తత్పరతతో ‘వీర భద్ర విజయం’, యుక్త వయస్సులో ప్రాపంచిక నేపథ్యంతో ‘భోగినీ దండకము’ ను, భాగవతాన్ని రచించుటకు ముందు పోతనలో వస్తున్న రచనా దృక్పథంలోని మార్పు భాగంగా ‘నారాయణ శతకం’ ను రచించాడని చెప్పవచ్చు. నారాయణ శతకంలోని పై పద్యము నందలి ధర్మపురి కరీంనగర్ జిల్లాలోని చారిత్రక ప్రసిద్ధమైన ధర్మపురి క్షేత్రమే అయినచో అచ్చట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉన్నది, కానీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం లేదు. నారాయణ శతకకారుడు నరసింహ స్వామినే నారాయణుడుగా స్తుతించినాడని అనుకోవచ్చుకదా! లేక పోతన ధర్మపురిలోని గోదావరి ఇసుక తిన్నెల మీదనే తపస్సు చేసుకొని భాగవత రచనాద్యుక్తుడు అయినాడని చరిత్ర చెబుతున్నది. ధర్మపురిలో పోతనకు రామ భద్రుడు దర్శనం ఇచ్చినప్పుడు లక్ష్మీనారాయణుడు మనఃఫలకం మీద ఎందుకు నిల్వకూడదు. అందులో భాగవతం తొలి పద్యమే ‘శ్రీకైవల్య పథం’ అని ప్రారంభించినాడు. అందువలన భాగవతము ‘శ్రీ’తో కేవలత్వాన్ని పొందిన స్థానం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నారాయణుడే శ్రీమన్నారాయణుడే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉపాస్యుడు, ఆరాధ్యుడు, కీర్తనీయుడు. ‘శ్రీ’ లక్ష్మీదేవి నారాయణునికే సేవారూపిణి. శేషశాయి అయిన నారాయణుని పాదసేవలో శ్రీదేవి ఉన్నట్టు చూస్తుంటాం. అందువలన భగవత్ పారతంత్య్రం, సేవా స్వరూపిణి అయిన ‘శ్రీ’ తో కేవలత్వం ఏకీభావం పొందిన పదం అని అనుకోవచ్చు. అందుచే నారాయణ శతకంలో ‘లక్ష్మీనారాయణా!’ అనుసంబోధించినాడని అనుకోవచ్చు.
భాగవతములో పోతన ఒక చిన్న పద్యాన్ని చెప్పాడు. ఆ పద్యము తెలుగు నేలలో పామరులకు కూడా నోటి యందు నాన్చబడుతున్నది. “చేతులారంగ శివుని పూజింపడేని/ నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని/ దయయు సత్యంబు లోనుగా దలపడేని / గలుగ నేటికి తల్లుల కడుపు చేటు” ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ చేతులారా శివుని పూజించి, నోరారా కేశవుడిని కీర్తించి, దయ సత్యము మొదలయిన గుణాలను అలవర్చుకోవాలి. ఇలా చేయని వాడు తల్లి కడుపున పుట్టడం ఎందుకు? వారి పేరును చెడగొట్టినవాడవుతాడని అంటాడు.
మహాభాగవతం (తను) పోతన రాయలేదని కేవలం ఆ రామభద్రుడే తన నాలుక ద్వారా పలికించాడని అందువల్లనే రాశాను తప్పా తనకేమీ తెలియదని వినమ్రతగా చెప్పుకోవడంలో ఆయన నిశ్చల భక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.
“పలికెడిది భాగవతమట/ పలికించెడివాడు రామభద్రుండట, నే / పలికిన భవహర మగునట/ పలికిన వేరొండు గాథ పలుకగనేలా!”, “భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు / శూలికైన దమ్మి చూలికైన/ విబుధ జనుల వలన విన్నంత కన్నంత / దెలియ వచ్చినంత దేటపరుతు!” (118, 19) భాగవతమును శివుడుకాని, పద్మనాభుడైనా సమగ్రంగా తెలుసుకొని చెప్పలేదు. మరి నా సంగతి ఇక మీకు చెప్పాలా! అయితే నేను పెద్దల ద్వారా విన్నది, వారి దగ్గర నేర్చుకున్నది, నేను తెలుసుకున్నది మీకు తేటతెల్లముగా తెలియజేస్తాను అని తను వినయంగా చెప్పుకున్నాడు. అందువలననే ఇప్పటికీ చాలా మంది నేను రాశాను… రాశాను అంటారు తప్ప ఆ చదువుల తల్లికాని, గురువులు చెప్పిందికాని, పూర్వ జన్మ సంస్కృతిని కూడా మరచిపోయి చెప్పుకుంటుంటారు.
పోతన భగవద్భక్తులకు సంబంధించిన ఒక కావ్యమును రచించాలనే కోరికతో పెద్దల అనుమతిని తీసుకొని తన ఇష్టదైవము అయిన మహేశ్వరుడిని ప్రార్థించుటకు నిశ్చయించుకొన్నాడు. నేను ఎన్నో జన్మలెత్తి ఉంటాను. వేల కొలది జన్మలలో కూడ బెట్టుకొనిన నా తపస్సు పండింది. నా హృదయంలో శ్రీమన్నారాయణుడి పుణ్య కథలను విస్తరించి రచించాలనే కోరిక మిక్కుటముగా బలపడింది. ఒక పున్నమి రాత్రి, నిండు జాబిల్లి వెన్నెలలు కురుస్తున్నాడు. ఆనాడు చంద్ర గ్రహణం. పెద్దల అనుజ్ఞ తీసుకున్నాడు. గోదావరిలోస్నానము చేశాడు. (118) అప్పుడు పోతన దర్శనం పొందాడు. పోతన దర్శించిన తీరు ఇలా ఉంది. చంద్రశేఖరుడను కున్నాడు. కాని ప్రత్యక్షమైన వాడు నేను రామ భద్రుడనని చెప్పినాడు. శివకేశవ భేదము లేదని తాను గ్రహించినట్లు చెప్పుకున్నాడు. పోతన మాటలలోనే … “మెఱుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండ నొప్పువాడు … నా కన్నుగవకు నెదుర గానబడియే” (116) ఆ సమయంలో ఒక రాజ శ్రేష్టుడు నా కన్నుల ముందు సాక్షాత్కరించినాడు. మేఘం ప్రక్కన మెరుపులాగ ఆయన చెంగట ఒక అంగన ఉన్నది. చంద్ర మండలం లోనుంచి అమృతంలాగా ఆయన ముఖంలో మందహాసం నిండుతోంది. తమాల వృక్షాన్ని చుట్టుకున్న తీగలాగ ఆయన భుజాగ్రాన ధనుస్సు వ్రేలాడుతున్నది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబం లాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతున్నది. ఈ విధంగా విచ్చిన తెల్ల తామర రేకుల వంటి కనులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో ఆ రాజశేఖరుడు నా కందోయికి విందు చేశాడు. అంతేకాదు, నేను రామభద్రుడను, నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చేయి. ఈ భాగవతమునకు అంకితమివ్వమని, నీ భవబంధాలు పటాపంచలవుతాయి.” అని చెప్పాడని భాగవతంలో చెప్పుకున్నాడు. ఇక్కడ ఒక వంక శివ చిత్ర రూపాన్ని పరోక్షంగా రామ భద్రున్ని దర్శింప చేయడంలో శివ కేశవాన్ని పాటించాడు.
పోతన భాగవతాన్ని ప్రారంభించినప్పుడు అలా చేయలేదు. ముందుగా రామభద్రున్ని స్తుతించలేదు. తన ఇష్టదైవాన్ని స్మరించుకొని పిదప తదితరుల స్మరించడం సంప్రదాయం. ఇది భారతాంధ్రీకరణ నుండి కొనసాగుతూ వస్తున్నదే. కాని పోతన అలా చేయక శ్రీరామ చంద్రున్ని ముందుగా స్మరించక శ్రీకృష్ణున్నే స్మరించాడు. ‘శ్రీకైవల్య పదంబు జేరుటకు నై చింతించెదన్…’ అని ప్రారంభించాడు. అట్ల శ్రీకృష్ణున్నే స్మరించాడు. ఏమైందిలే అని సరిపెట్టుకుందామంటే షష్టంతంలో ‘హారికి నందగోకుల విహారికి…’ అనియు (129). ‘గోపికా నివహ మందిర యాయికి, శేషసాయికిన్’ (132), ‘సమర్పితంబుగా నేనాంధ్రంబున రచియింపబూనిన శ్రీ మహాభాగవత పురాణంబునకు’ (133) అని శ్రీకృష్ణునికే భాగవతమును అంకితం చేసినాడు. రామునకు కాదు. పోతన శివ కేశవు లందువలె రామకృష్ణులందున కూడా ఏమాత్రము భేదము లేదు. కృష్ణ పథమును వాడి రామ పదమును వాడలేదనుకోవద్దు. ‘పలికెడిది భాగవతమట/ పలికించెడి వాడు రామభద్రుండట’ అని చెప్పుకున్నాడు. రాముడన్ననూ, కృష్ణుడన్ననూ మహా విష్ణువనియే పోతన భావం. ఇంకొక రహస్యం. రామాయణం శ్రీరాముడ్ని చెప్పినట్లు భాగవతము శ్రీకృష్ణున్ని చెప్పుతున్నది. కాబట్టి భాగవతములో మొదట పోతన కృష్ణ పదమును సాభిప్రాయంగానే చెప్పి ఉంటాడు. పోతన గురించి చెప్పుకుంటున్న క్రమములో ఈ నాలుగు మాటలు. పోతన అంటే భాగవతమే. ఇక్కడ పోతన గురించి అనుకోవడం భాగవతం గురించి మాత్రమే ‘కృష్ణం వందే జగద్గురుమ్‌”

డా॥ టి.శ్రీరంగస్వామి
9949857955