పెను విపత్తుల ముంపు

Kerala coast is 600 km

ఆరోగ్య సూచికలో ఎప్పుడూ ముందు వరసలో ఉండే కేరళ రాష్ట్రం, ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన సమీకృత జల నిర్వహణ సూచిలో అత్యంత వెనుకబడి ఉందని ప్రకటించింది. స్పష్టమైన జల విధానం కేరళకు లేకపోవటమే ప్రధాన కారణం. కేరళ తీరం 600 కిలోమీటర్ల పడమటి కనుమల్లోని నదులన్నీ అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఈ కనుమల్లోని చిన్న నదులన్నీ అరేబియా సముద్రంలో కలిసేలోపు ఉప్పొంగి, పడమటి కనుమల్లో ఆవాసం చేసుకొని జీవిస్తున్న వారిని ముంచెత్తాయి. దీనికంతటికి కారణం పడమటి కనుమల్లో విధ్వంసం జరగటం, యధేచ్ఛగా క్వారీలు తవ్వటం, నిర్మాణాలు జరగటం. ముఖ్యంగా కేరళలో వరదల హెచ్చరిక కేంద్రం లేకపోవటం ప్రధాన కారణం. 

గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఇవి పంచ మహభూతాలని తరతరాలుగా నమ్ముతున్న జాతి మనది. ఈ పంచ మహభూతాల కలయికే ప్రకృతి. ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ ప్రకృతి వినాశనం మనం అందరూ చూస్తూనే ఉన్నాం. రుద్రుని విలయ తాండవం వలే ప్రకృతి విలయ తాండవం మన దేశంలో ప్రతిచోట ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంది. దీనికి కారణం ఎవరు అని అంతర్మథనం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు సృష్టించిన ప్రకృతిని మనిషి నాశనం చేయడం వల్ల ఇలా జరుగుతుందా లేదా దేవుడే మనిషికి శిక్ష విధిస్తున్నాడా అని అందరూ అనుకునే సమయం ఇది. దానిక కారణం ఎవరో అందరికీ తెలుసు, కాని ఇలా ప్రకృతి ధ్వంసం జరిగినప్పుడు మాత్రమే ప్రకృతి పరిరక్షణ అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తే ఏం లాభం, జరగాల్సిన నష్టం జరిగిపోయాక మళ్లీ అంత నష్టాన్ని పూడ్చుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేము.

దీనికంతటికీ కారణం, మానవుల్లో పెరుగుతున్న సామ్రాజ్యవాదం, పచ్చని చెట్లను నరికి ధ్వంసం చేసి ధనం పోగు చేసుకోవటం, దీనివల్ల నష్టపోతున్నది ఎవరు సామాన్య మానవులు మాత్రమే. భారతదేశంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న ప్రకృతి ధ్వంసంలో జల ప్రళయం అత్యంత హేయం. అందులో ఉత్తరా ఖండ్ వరదల్ని, ముంబై వరదలు, హుద్‌హుద్ తుఫాను, ఇవన్నీ మరచిపోకముందే దక్షిణ భారతదేశమైన కేరళ రాష్ట్రంలో జలప్రళయం ప్రజా వ్యవస్థను అతలాకుతలం చేసింది. కేరళ పేరు వింటే చాలు ప్రకృతి ప్రేమికుడు పులకించిపోతారు. ఎవరైనా సరే కేరళ రాష్ట్రంలోని ప్రకృతి అందాలకు మైమరిచిపోవలసిందే.

భారతదేశంలోని అత్యంత సుందరమైన ఎకలాజికల్ హ్రచ్‌స్పాటెలో పశ్చిమ కనుమలు ఒకటి, ఈ పశ్చిమ కనుమల్లో ఎన్నో జీవులు తరతరాలుగా నివసిస్తూ జీవ వైవిధ్యం పాటిస్తున్నాయి. లాంగూర్ కోటి (సింహం తోకవంటి కోతి) జాతులను రక్షించుకోవడానికే కేరళలో సైలెంటి వ్యాలీ ఉద్యమం జరిగింది. మరి ఇప్పుడు ఏది ఆ ఉద్యమ స్ఫూర్తి, పశ్చిమ కనుమలను విధ్వంసం చేసి, పర్యావరణ ప్రేమికులు చెపుతున్నా వినకుండా అవసరంలేని చోట ఆనకట్టలు కట్టడమే కేరళలో ఈ జల విలయానికి ప్రధాన కారణం. మాదల్ గాడ్గిల్ ప్రణాళికలు అమలు చేసి ఉంటే కొంతలో కొంతైన కేరళ రాష్ట్రంలో ఇంత విలయం జరిగి ఉండేది కాదేమో. ప్రభుత్వాల రాజకీయ స్వార్థం, ప్రకృతి నాశనం, మనిషి ధనదాహం ఇవన్నీ కేరళలో జలఖడ్డానికి ప్రధాన కారణం. ఈ కేరళ వరదల్లో ఐఐటిలో సీటు వచ్చిన ఒక విద్యార్థి తన ఇంటర్మీడియట్ ధ్రువపత్రం నీళ్లలో తడిసిపోయిందని, తన ఇంటిలోనే ఉరిపోసుకున్నాడు. ఒక విద్యార్థి భవిష్యత్తు నాశనం అయిపోయింది.

మన దేశ భూభాగంలో దాదాపుగా 12% వరదల బారినపడుతున్నది. ఈ వరదల నుండి రక్షణ కోసం భారత ప్రభుత్వం 2005 సం॥లో “జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ”ను ఏర్పాటు చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కేరళలో జరిగిన వరదల విలయాన్ని ఎల్ 3 స్థాయిలో ప్రకటించారు. అంటే దీర్ఘకాలిక విపత్తుల జాబితాలో చేర్చారు. కాని కేరళ ప్రభుత్వం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరగా, రాజ్యాంగంలో జాతీయ విపత్తుగా ప్రకటించే నిబంధన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం కేరళ హైకోర్టుకు తెలపటం శోచనీయం.

కేరళలో ఈ విలయానికి ప్రధాన కారణం: జనాభా, పట్టణీకరణ, ఈ రాష్ట్రం అత్యధిక జన సాంద్రత గల రాష్ట్రం, చెట్లని నరికి నివాస ప్రాంతాలుగా మార్చుకుంటున్నారు. ఇంకా వ్యాపార సముదాయాలు కూడా చేయడం వల్ల కేరళను వరద ముంచేసింది. ఆరోగ్య సూచికలో ఎప్పుడూ ముందు వరసలో ఉండే కేరళ రాష్ట్రం, ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన సమీకృత జల నిర్వహణ సూచిలో అత్యంత వెనుకబడి ఉందని ప్రకటించింది. స్పష్టమైన జల విధానం కేరళకు లేకపోవటమే ప్రధాన కారణం. కేరళ తీరం 600 కిలోమీటర్ల పడమటి కనుమల్లోని నదులన్నీ అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఈ కనుమల్లోని చిన్న నదులన్నీ అరేబియా సముద్రంలో కలిసేలోపు ఉప్పొంగి, పడమటి కనుమల్లో ఆవాసం చేసుకొని జీవిస్తున్న వారిని ముంచెత్తాయి.

దీనికంతటికి కారణం పడమటి కనుమల్లో విధ్వంసం జరగటం, యధేచ్ఛగా క్వారీలు తవ్వటం, నిర్మాణాలు జరగటం. ముఖ్యంగా కేరళలో వరదల హెచ్చరిక కేంద్రం లేకపోవటం ప్రధాన కారణం. ముఖ్యంగా కేరళలో గత 65 రోజులుగా కురుస్తున్న వర్షాలవల్ల జలాశయాలకు భారీగా వరదనీరు చేరటం వల్ల ఈ వరద నీటిని విద్యుత్పత్తి చేసి వాణిజ్యంగా సొమ్ము చేసుకోవటానికి రాష్ట్ర విద్యుత్ దురశా కూడా ప్రధాన కారణం. ఈ వరదల్లో చిక్కుకున్న అభాగ్యులను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళంతోపాటు, కేరళోని మత్సకారులు కూడా అనేక మంది ప్రాణాలు కాపాడినారు. ఇప్పుడు కేరళ రాష్ట్రానికి ఆర్థిక చేయూత అందించి, ఇక ముందు ఆ రాష్ట్రానికి వరద పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు వేసుకోవాలి. ఇప్పు డు కేరళను ముంచెత్తిన వరదలు తదుపరి కాలంలో ఇతర రాష్ట్రాలను ముంచెత్తవచ్చు. ఈ విపత్తుల నుండి బయటపడటం కోసం ప్రభు త్వం కార్యాచరణ రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ప్రజల్లో విపత్తుల వల్ల జరిగిన నష్టాలపై అవగాహన కలిగించవలసిన బాధ్యత కూడా ప్రజలలో ఉండాలి. వారిని ప్రభుత్వంతో కలిసి నడిచేటట్లు చేయాలి. మన సోదర రాష్ట్రం ఎ.పి. కూడా తరచూ వరదలకు గురవుతుంటుంది. ఇకపోతే మన రాష్ట్రానికి తీర ప్రాంతం లేకున్నా వర్షాల వల్ల చిన్నచిన్న వాగులు పొంగి వరద నష్టాన్ని కలిగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. దీని కోసం ఎప్పుడు సన్నద్ధంగా ఉండాలి ప్రభుత్వం. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో రోడ్లు తెగి జనజీవితం స్తంభించిపోయింది. ఇంకా లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల మన రాష్ట్రంలో 5 గురు చనిపోయినారు. పూర్తిగా కూలిపోయిన ఇళ్ల 83. దాదాపు 2 లక్షల ఎకరాల పంట నీటిలో మునిగినట్లు తెలుస్తున్నది. ఇలా పొంగిపొర్లుతున్న వాగులు అన్నింటిని ఏకం చేసి నది వ్యవస్థలోకి మళ్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఇకపోతే ప్రభుత్వాలు “విపత్తు నిర్వహణ” అనే అంశం గురించి పాఠ్య పుస్తకాల్లో ముద్రిస్తున్నప్పటికీ దీని మీద సరైన అవగాహన విద్యాశాఖలల్లో ఉండటం లేదు. పబ్లిక్ పరీక్షల్లో మార్కుల కోసం మాత్రమే వాటిని చదువుతున్నారు. యంత్ర విద్యలో ప్రవేశపెట్టిన “Disaster Management” అనే Subjectను అందరూ చదివే విధముగా రూపకల్పన చేయాలి కాని విపత్తు నిర్వహణ అనే పాఠ్య అంశాన్ని Open Elective Subjectగా చేర్చటము ద్వారా కొంత మంది మాత్రమే చదివే అవకాశం ఉండటము వల్ల విద్యాశాఖలో అవగాహన ఆ సబ్జెక్టుపై లేకుండా పోయినది.

ఈ సబ్జెక్టును అన్ని బ్రాంచిల వారు ఇంజినీరింగ్‌లో చదవవలసిన బాధ్యత విద్యార్థులలోను, అధ్యాపకులలోనూ మార్పు రావాలి. ఈ సబ్జెక్టు (విపత్తు నిర్వహణ అనే అంశాన్ని) ప్రయోగాలకు సెలవుగా మారాలి. విద్యార్థులను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి ఏ ప్రాంతంలో సరైన రీతిలో ఆనకట్టలు కట్టాలో, వారినే సర్వే చేయమనాలి. ఎంత చేసిన ప్రభుత్వాలు, ప్రజలు మమేకం అయితే కొంతలో కొంతైనా విపత్తులను పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కొవచ్చును.

భవిష్యతును దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికలకు శ్రీకారం చుట్టవలసిన బాధ్యత ప్రభుత్వాలు, ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్లాస్టిక్ నిర్మూలన చేయవలసిన బాధ్యత అందరిపైన ఉంది. ప్లాస్టిక్‌ను మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాలు వాడుకను పూర్తిగా నిషేధం చేశాయి. కానీ మన రాష్ట్రంలో ఎక్కువగా ప్లాస్టిక్‌ను వాడకంలో ఉంచుతున్నారు. నిషేధ బాటలో తెలంగాణ రాష్ట్రం కూడా నడవాలి.

                                                                                                                                           – డా. ముసిని వెంకటేశ్వర్లు