పాతాళానికి రూపాయి రంగంలోకి దిగిన ఆర్‌బిఐ

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనానికి బ్రేక్ పడడం లేదు. వరుసగా ఆరో రోజు రూపాయి క్షీణించింది. బుధవారం రూపాయి 17 పైసలు పడిపోయి 71.75కు చేరింది. చమురు ధరల పెరుగుదల, వర్ధమాన మార్కెట్ కరెన్సీల్లోనూ బలహీన ట్రెండ్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఓ దశలో డాలర్‌తో పోలిస్తే రూపాయి చారిత్రక కనిష్టం 71.97కు పతనమైంది. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 165 పైసలు నష్టపోయింది. ఈ నేపథ్యంలో రూపాయి పతనానికి బ్రేక్ వేసేందుకు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. గతంలో రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు ఆర్‌బిఐ జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ వాణిజ్య భయాలతో పాటు డాలరుకు డిమాండ్ బాగా పెరగడంతో రూ పాయి విలువ గత కొన్ని రోజులుగా బాగా క్షీణిస్తూ వస్తోంది. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడుతుండగా, మరోవైపు పలు దేశాల కరెన్సీల విలువ తగ్గిపోతోంది. దిగుమతిదారుల నుంచి కూడా డాలరుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.
వర్ధమాన దేశాల కరెన్సీలు కూడా..
ఆరు ప్రధార కరెన్సీలతో మారకంలో డాలరు మరోసారి బలపడుతోంది. డాలరుతో మారకంలో పతనబాటలో సాగుతున్న వర్ధమాన దేశాల కరెన్సీలు మళ్లీ నీరసించాయి. యూరో 0.32 శాతం బలహీనపడి 1.158ను చేరింది. ఇక కెనడియన్ డాలర్ 0.64 శాతం క్షీణించి 1.32కు చేరగా, ఇది ఆరు వారాల కనిష్టంగా నిపుణులు పేర్కొంటున్నారు. దక్షిణాఫ్రికా కరెన్సీ ర్యాండ్ 3.3 శాతం, టర్కీ కరెన్సీ లైరా 1 శాతం క్షీణించాయి. గత వారం అర్జెంటీనా పెసో 12 శాతం కుప్పకూలడం ద్వారా 2018లో 54 శాతం పతనమైంది. ఇప్పటికే దివాళా అంచున చేరిన అర్జెంటీనా మరోసారి సమస్యల్లో చిక్కుకుంది. ప్రెసిడెంట్ మారిషియో మాక్రీ ఎగుమతులపై పన్నులు విధించడంతోపాటు ప్రభుత్వ వ్యయాలలో భారీ కోతలు ప్రకటించారు.