పల్లెలకు ‘కొత్త’ కళ

Hordes, the festive weather that has been seen in any pasture

ఏళ్ల నాటి కల నేరవేరిన వేళ
కొలువుదీరిన కొత్త గ్రామ పంచాయతీలు
తండాలు, ఏగూడెంలలో పండగ వాతావరణ

నిన్నటి వరకు గ్రామ పంచాయతీలకు దూరంగా విసి రేసినట్లుగా ఉన్న పల్లెలు, తండాలు, గిరిజన గూడెంలు, ఒడ్డెర కాలనీలకు కొత్త కళ వచ్చింది. తమ పల్లెలు గ్రామ పంచాయతీలు కావాలని ఎన్నో ఏళ్లుగా కలలు కన్న వారి కల సాకారమైంది. జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ 60 గ్రామ పంచాయతీలను ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారు లు గురువారం ప్రారంభించారు. కొత్త గ్రామ పంచా య తీలు పండగ వాతావరణంలో కొలువు దీరాయి. పంచా యతీ కార్యాలయాల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్ర జాప్రతినిధులు, అధికారులకు డప్పు చప్పుళ్లు, మంగ ళహారతులతో ఘన స్వాగతం పలికారు.

మనతెలంగాణ/జగిత్యాల: జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ 60 గ్రామ పంచాయతీలు గురు వారం కొలువుదీరాయి. గ్రామ పంచాయతీ కార్యాల యాల కోసం అంగన్‌వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ భవనాలు అందు బాటులో లేని ప్రాంతాల్లో అద్దె ఇళ్లల్లో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కొత్త గ్రామ పంచాయతీలను పండగ వాతావరణంలో ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా అధికారులు గత మూడు నాలుగు రోజుల నుంచి ఆయా పనుల మీదే దృష్టి సారించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల కోసం తీసుకున్న భవనాలకు రంగులు వేయడంతో పాటు పంచాయతీ కార్యాయలం బోర్డులను రాయించారు. భవనాలకు మామిడి తోరణాలు కట్టి ఊరు ఊరంతా పంచాయతీ కార్యాలయం వద్దకు తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కొత్త పంచాయతీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు లంబాడీ నృత్యాలు చేయగా గిరిజనులు విచిత్ర వేషధారణలతో గుస్సాడీ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కొన్ని గ్రామాల్లో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.
జిల్లాలో కొత్తగా 60 గ్రామ పంచాయతీలు.. రెండు మున్సిపాలిటీలు
జిల్లాలో 18 మండలాలు ఉండగా 327 గ్రామ పంచాయతీలు ఉండేవి. అయితే 5 గ్రామ పంచాయతీలను మున్సి పాలిటీల్లో విలీనం చేశారు. రెండు గ్రామ పంచాయతీలు ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయ్యా యి. కొత్తగా 60 గ్రామాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 380కి చేరుకుంది. కొత్త గ్రామ పంచాయతీలుగా జగిత్యాల రూరల్ మండలంలోని సంగంపల్లి, ఒడ్డెర కాలనీ, వంజరిపల్లి, చెర్లపల్లి, గొల్లపల్లి, సారంగాపూర్ మండలంలోని మ్యాడారం తండా, భీంరెడ్డి గూడెం, లచ్చ నాయక్ తండా, ధర్మానాయక్ తండా, పోచంపేట, నాయకపు గూడెం గ్రామ పంచాయతీలుగా ఏర్పాడ్డాయి. బీర్ పూర్ మండలంలో చిన్న కొల్వాయి, కందెనకుంట, చిత్రవేణి గూడెం, కోమన్‌పల్లి, ఒడ్డెర కాలనీ, రాయికల్ మండ లంలో లోక్‌నాయక్ తండా, అలీనాయక్ తండా, కైరి గూడెం, ఒడ్డెర కాలనీ, కుర్మపల్లి, శ్రీరాంనగర్‌లు కొత్త పంచా యతీలుగా రూపుదిద్దుకున్నాయి.ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్ మండలంలో సంకెనపల్లి, రాజక్కపల్లి, కోటి లింగాల, తాళ్ల కొత్తపేట, ధర్మపురి మండలంలోని ఆకుసాయిపల్లె, బోదారి నక్కల చెరువు గూడెం, దుబ్బల గూడెం, బుద్దేశ్‌పల్లి, నర్సయ్యపల్లె, మగ్గిడియేదపల్లి, గోవిందుపల్లె, గొల్లపల్లి మండలంలోని దమ్మన్నపేట, గంగాదేవునిపల్లి కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండ లంలో గంగారాం తండా, దమ్మయ్యపేట, కొండాపూర్, చింతపల్లి, అప్పారావుపేట, హిమ్మత్‌రావుపేట, తుర్కకాశీ నగర్, శనివారం పేట, మల్యాల మండలంలో గుడిపేట, గొర్రెగుండం కొత్త పంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయి. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలంలో సంగెం, శ్రీరాంపూర్, హుస్సేన్‌నగర్, ఒగులాపూర్ తండా, వాల్గొండ తండా, కోరుట్ల మండలంలోని తిమ్మయ్యపల్లి, మెట్‌పల్లి మండలంలోని రామారావుపల్లి, ఎఎస్‌ఆర్ తండా, విట్టంపేట, ఇబ్రహీంపట్నం మండలంలో తిమ్మాపూర్ తండా, మేడిపల్లి మండలంలో గుండ్లపల్లి, కథలాపూర్ మండలంలో రాజారం తండాలు గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయి.
పాలన బాధ్యతలు చేపట్టిన ప్రత్యేకాధికారులు
ఈ నెల 1తో సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను తీసుకొచ్చింది. వివిధ శాఖల అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడంతో వారంతా గురువారం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టారు. 380 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల్లో పాలన పగ్గాలను ప్రత్యేకాధికారులు తీసుకున్నారు.

Comments

comments