పల్లెకు పట్టం

funding of central and state governments is directly a panchayat

జిల్లాలో కొలువుదీరిన 157 కొత్త పంచాయతీలు
కొత్త పంచాయతీలతో 469కి చేరిన గ్రామ పంచాయతీల సంఖ్య
అభివృద్ధికై నిధుల వాటాల పంపకానికి ఇకనుండి చెల్లుచీటి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు నేరుగా పంచాయతీకే
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పట్టుగొమ్మలుగా మారనున్న పల్లెలు

మన తెలంగాణ/మెదక్ : రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీల చట్టం అమలుతో పల్లెసీమలు పట్టుగొమ్మలుగా మారనున్నాయి. మెదక్ జిల్లాలో యేళ్లతరబడి ఇతర పంచాయతీల్లో మధిర గ్రామాలుగా ఉన్న చిన్న చిన్న గ్రామాలు, తాండలు కొత్త ఒరవడులతో నూతన పంచాయతీలుగా శ్రీకారం చుట్టాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం నాడు 157 కొత్త పంచాయతీలు కొలువుతీరాయి. దీంతో జిల్లాలోని పంచాయతీల సంఖ్య 469కి చేరుకుంది. ఇక నుండి ప్రణాళిక, ప్రణాళికేతర నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు మరియు ప్రత్యేక అభివృద్ధ్ది నిధులు ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి విడుదలయ్యే ప్రతి రూపాయి తమ గ్రామానికే దక్కనుంది.

గ్రామాల్లోని మౌలిక సదుపాయాలకు అవసరమయ్యే నిధులను ఇంతకు ముందులాగా వాటాలు వేసుకొనే పరిస్థితికి చెల్లుచీటి పడింది. గతంలో ఒకే పంచాయతీకి రెండు గ్రామాలు ఉన్నప్పుడు సర్పంచ్ పదవి స్థానిక గ్రామానికి దక్కితే ఉప సర్పంచ్ పదవి మధిర గ్రామాలకు దక్కేది. ఎప్పుడైనా రిజర్వేషన్లు కలిసివస్తే తప్ప సర్పంచ్ పదవి మధిర గ్రామాలకు, తాండలకు లభించేదికాదు. కానీ కొత్త పంచాయతీ ఏర్పాటుతో పల్లెలు రాజకీయంగా ఎదిగి నూతన నాయకులు పుట్టుకొస్తారు. దీంతో పంచాయతీ అభివృద్ధికి అవసరమయ్యే నిధులను తీసుకురావడంతో సఫలీకృతమవుతారు. దీంతో తమ గ్రామానికి వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడి పూర్తిస్థాయిలో అభివృద్ధ్దిని సాధించుకునే గొప్ప అవకాశం వారిముందుంది. ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి తమ పరిస్థితిని వివరించుకునేటప్పుడు ఇతర గ్రామ పంచాయతీకి చెందినవారమని చెప్పుకోవడంతో ఎంతో మోహమాటపడేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో తమ గ్రామానికే పంచాయతీ గౌరవం దక్కడంతో ఇకనుండి గర్వపడే రోజులు వచ్చాయని కొత్త పంచాయతీ గ్రామస్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక నుండి కొత్త పంచాయతీల్లో గ్రామస్తులు కలిసికట్టుగా ఉండి ప్రతి సమస్యను అందరి సమక్షంలో ఉంచి దాని పరిష్కారానికి స్థానికుల సలహాలు, సూచనల మేరకు పరిష్కారించుకుంటామని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కొత్త పంచాయతీల ఒరవడి గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పడనుందని ఆయా గ్రామాల ప్రజలు, తాండల వాసులు అభిప్రాయం వక్తం చేస్తున్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో స్థానికంగా ఉన్నటువంటి సమర్థవంతమైన వ్యక్తిని సర్పంచ్‌గా గెలుపించుకొని అభివృద్ధికి బాటలు వేసుకుంటామని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చిన్న గ్రామాల అభివృద్ధి కొరకై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన పంచాయతీల రూపకల్పన ఆయా గ్రామాలు, తాండల వాసులకు వరంగా మారింది. ఇక నుండి పల్లెసీమలు పట్టుసీమలుగా మార్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలు ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.