పర్యాటకులతో అలరారే కర్నాటక

భారతదేశాన్ని ఎన్నో పేరెన్నికగన్న రాజవంశాలు పాలించాయి. చాళుక్యులు, మౌర్యులు, హోయసాల, విజయనగరం వంటి రాజవంశాలు ఉన్నాయి. వారి కాలంలో నిర్మించిన గొప్ప కట్టడాలు, గోపురాలు, కోటలు, రాజభవనాలు నిర్మాణాలు చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటాయి. వాటి గురించి తెలుసు కోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ఈ దిశగా కర్ణాటకలో కోటలు వివిధ రాజవంశస్థులు నిర్మించినవి చాలా వున్నాయి. వాటిలో కొన్ని దెబ్బతిన్నప్పటికీ పూర్వపు గుర్తులు ఇప్పటికీ మనకి కనిపిస్తున్నాయి. అవి పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రఖ్యాత దర్శనీయ స్థలాలుగా  అలరారుతున్నాయి. […]

భారతదేశాన్ని ఎన్నో పేరెన్నికగన్న రాజవంశాలు పాలించాయి. చాళుక్యులు, మౌర్యులు, హోయసాల, విజయనగరం వంటి రాజవంశాలు ఉన్నాయి. వారి కాలంలో నిర్మించిన గొప్ప కట్టడాలు, గోపురాలు, కోటలు, రాజభవనాలు నిర్మాణాలు చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటాయి. వాటి గురించి తెలుసు కోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ఈ దిశగా కర్ణాటకలో కోటలు వివిధ రాజవంశస్థులు నిర్మించినవి చాలా వున్నాయి. వాటిలో కొన్ని దెబ్బతిన్నప్పటికీ పూర్వపు గుర్తులు ఇప్పటికీ మనకి కనిపిస్తున్నాయి. అవి పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రఖ్యాత దర్శనీయ స్థలాలుగా  అలరారుతున్నాయి.

చిత్రదుర్గ కోట
ఈ కోటను చాళుక్య, రాష్ట్రకూటులు, హోయసాలులు రాజవంశీయులు 17 వ, 18 వ శతాబ్దాల మధ్య నిర్మించారు. చిత్రదుర్గ లేదా చిత్రకళాదుర్గ అని పిలుస్తారు. అంచెలంచెలుగా కట్టబడిన చిత్రదుర్గ కోట, వివిధ రాజవంశాలచే మార్పులు చేయబడిన ఒక అద్భుతమైన కట్టడం. ఈ కోటలో ఏడు వలయాకార గోడలుంటాయి. వీటిలోని మూడు నేలమీద, నాలుగు కొండ మీద ఉంటాయి. అందుకే దీనిని కన్నడంలో ‘ఎలు సుత్తిన కోటే‘ అనగా ‘ఏడు వలయాకార గోడల కోట‘ అంటారు. ఈ కోటలో అత్యద్భుతమైన దుర్గాలు, గిడ్డంగులు మసీదు (హైదర్ ఆలీ సమయంలో నిర్మింపబడినది), అనేక మందిరాలు ఉన్నాయి. ఇది బెంగళూరుకు 200కి.మీ హంపికి 120కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందిన అవశేషాలు కూడా లభించాయి. దాదాపు 20 ఆలయాలు కూడా ఉన్నాయి. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు హిడింబాసురుడు, భీముడు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారని ఆ రాళ్లు ఇక్కడ చిత్రవిచిత్రాలుగా కనిపిస్తున్నాయని అంటారు. అందుకే చిత్రదుర్గ అని పేరు వచ్చిందని అంటారు. దానిమ్మ సాగులో చిత్రదుర్గ మొదటి స్థానంలో ఉంది.

బాదామి కోట
ఈ కోటలో శిల్పసంపద అత్యద్భుతంగా ఉంటుంది. బాదామి చాళుక్య వంశీయుల రాజధానిగా ఉండేది. ఇది 6వ శతాబ్దం నాటిది. పహారా బురుజులు, ధాన్యాగారాలు, నగిషీలు, అద్భుతమైన శిల్పసంపద కలిగిన దేవాలయాలు కోటగోడ లోపల దర్శనమిస్తాయి. ఇది ఎర్రని ఇసుకరాళ్ల మధ్య నిర్మింపబడినది. బాదామిలో ప్రసిద్ధి గాంచిన గుహాలయాలు, బాదామి కోట ఉన్నాయి. గుహాలయాలకు ఎదురుగా అత్యున్నతమైన బాదామి కోట ఉంది. చాళుక్యుల నిర్మాణశైలిలో కట్టబెట్టిన ఈ కోటలో రెండంచెలుగా కోటగోడలు నిర్మింపబడ్డాయి. శత్రువులపై దాడికి యుద్ధాలలో ఉపయోగించిన భారీ ఫిరంగులు ఇప్పటికీ ఈ కోటలో దర్శనమిస్తాయి.

మిర్జన్ కోట
ఈ మిర్జన్ కోట పురావస్తు శాస్త్రవేత్తలకు ఇష్టమైన ప్రదేశం. ఇక్కడ ఇంకా ఎన్నో పురాతన సంపదలు వెలికి తీయాల్సి ఉంది. ఇక్కడ చైనా వారు ఉపయోగించిన పింగాణీ, ఇస్లామిక్ శాసనాలు లభించాయి. ఉత్తర కర్నాటకకు పశ్చిమ తీరంలో కుంతాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిర్జన్ కోట, 16 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ కోట నిర్మాణం జరగటానికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ దీనిని ఎవరు నిర్మించారనే విషయం బయటికి రాలేదు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ) వారు నిర్వహించిన తవ్వకాలలో పోర్చుగీస్ వైస్రాయిలకు ఇవ్వబడిన బంగారు నాణేలు, మరిన్ని ఆసక్తికరమైన వస్తువులు బయటపడ్డాయి.

బెంగళూరు కోట
మొదట ఈ కోటను మట్టితో నిర్మించారు. తరువాత హైదర్ ఆలీ హయాంలో బెంగుళూరు కోటను ఒక రాతికోటగా మార్చారు. తరువాత టిప్పు సుల్తాన్ చేతిలోకి, చివరకు బ్రిటీష్ వారి హయాంలోకి చేరింది. వేసవి విడిదిగా టిప్పు సుల్తాన్ ఈ కోటను ఉపయోగించుకున్నాడు. నగరం యొక్క రణగొణ ధ్వనుల మధ్య ఉన్న ఈ కోట కే.ఆర్ మార్కెట్ కు సమీపంలో ఉంది. 1527 లో బెంగుళూరు స్థాపకుడైన కెంపెగౌడ చేత నిర్మింపబడినది.

బీదర్ కోట
ఈ కోటలో రంగీన్ మహల్, తఖ్త్ మహల్, తార్కాష్ మహల్ మొదలైనవి గొప్ప కట్టడాలు ఉన్నాయి, ఇవి మొగలులకు, బహుమనీలకు చాలా ఉపయోగపడ్డాయి. బాలీవుడ్ చిత్రాలలో ఈ కోటను ఉపయోగించి కొన్ని సన్నివేశాలు నిర్మించారు. ‘ది డర్టీ పిక్చర్’ సినిమాలోని ఇష్క్ సుఫియానా పాట ఈ కోటలోనే చిత్రీకరించారు. చాలా కన్నడ సినిమా చిత్రీకరణలు కూడా ఈ కోటలో జరిగాయి. బీదర్ కోటలో చాలా భాగం గొప్పగా నిర్మించారు. బహుమనీ రాజవంశస్తులు ఈ కట్టడాన్ని నిర్మించారు.

బళ్లారి కోట
కర్నాటకలోని బళ్లారి నగరంలో బళ్లారి కోట ఉంది. ఈ కోటను బళ్లారి గుట్టపై నిర్మించారు. దీనిలో రెండు భాగాలు ఉంటాయి. 607 మీటర్ల ఎత్తులో ఉన్న ఎగువ కోట చతురస్రాకారంలో ఉంటుంది. దీనిని విజయనగర సామ్రాజ్యం యొక్క హనుమప్ప నాయక నిర్మించినట్లు చెబుతారు. దిగువ కోట 18 వ శతాబ్దంలో హైదర్ ఆలీచేత నిర్మింపబడింది.

జలదుర్గ కోట
రాయచూరులోని జలదుర్గ కోట బీజాపూర్ లోని అదిల్ షాహి వంశీయులు నిర్మించారు. ఈ కోటకి ఏడు ముఖ ద్వారాలు ఉంటాయి. కోట చుట్టూ బలమైన ప్రాకారాలు, ఎత్తైన గోడలు ఉన్నాయి. ఈ కోటకి పశ్చిమాన నారాయణపూర్ డామ్ ఉంది. ఇది కృష్ణానదిపై ఒక ద్వీపం యొక్క అంచున ఉన్న కొండపై ఉంది. అందువల్ల, కోట ఒక పక్కాగా, కృష్ణానది ఒడ్డున ఉన్న అగాధం దర్శనమిస్తుంది. కోటలోని ఒక ప్రదేశం నుండి, ప్రత్యర్ధులు, నేరస్తులను నదిలోకి లేదా గుట్టలలోకి విసిరిపారేసే వారని ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు రాజభవనాలు, గుమ్మటాలు, ప్రాసాదాలతో విలసిల్లిన ఈ కోట, ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇప్పటికీ పాలకుల సమాధులను ఈ కోటలో పర్యాటకులు చూడవచ్చు.

బసవకళ్యాణ కోట
బీదర్ జిల్లాలో ఉన్న ఈ కోటను చాళుక్య వంశ రాజైన నలరాజు నిర్మించాడు. ఒకానొకప్పుడు ఈ కోటను కళ్యాణి కోటగా పిలువబడేది. తరువాత 12 వ శతాబ్దంలో గొప్ప ఆధ్యాత్మికవేత్త అయిన బసవేశ్వరుని పేరు పెట్టారు. ఈ కోటలో 7 ద్వారాలు ఉన్నాయి, వాటిలో 5 మంచి ఆకారంలో ఉన్నాయి. కోట ప్రహరీ యొక్క ముఖ్య ద్వారాన్ని అఖండ్ దర్వాజా అంటారు. దీనిని నాలుగు ఎర్ర రాతి పలకలను ఉపయోగించి నిర్మించారు.