పత్తిని మింగుతున్న గులాబీ పురుగు

ఈసారి కూడా అదే తరహా దాడి నష్టాల దిశగా దిగుబడి పంట తొలగించేందుకు సిద్ధమవుతున్న రైతులు ఇప్పటికీ ప్రత్యామ్నాయం చూపని అధికారులు మన తెలంగాణ/ఆదిలాబాద్ : మళ్లీ తెల్లబంగారం చుట్టూ గులాబీ దండు దండయాత్ర చేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు 8 మండలాలలో గులాబీ పురుగు పత్తి పంటను పూర్తి స్థాయిలో ఆక్రమించేసింది. ఈ గులాబీ రంగు తెగులుతో పత్తి పంట తీవ్రంగా నష్టాలను చవి చూడబోతుంది. ఈ పురుగు బారి నుంచి బయట పడలేక ప్రత్యామ్నాయం […]

ఈసారి కూడా అదే తరహా దాడి
నష్టాల దిశగా దిగుబడి
పంట తొలగించేందుకు సిద్ధమవుతున్న రైతులు
ఇప్పటికీ ప్రత్యామ్నాయం చూపని అధికారులు

మన తెలంగాణ/ఆదిలాబాద్ : మళ్లీ తెల్లబంగారం చుట్టూ గులాబీ దండు దండయాత్ర చేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు 8 మండలాలలో గులాబీ పురుగు పత్తి పంటను పూర్తి స్థాయిలో ఆక్రమించేసింది. ఈ గులాబీ రంగు తెగులుతో పత్తి పంట తీవ్రంగా నష్టాలను చవి చూడబోతుంది. ఈ పురుగు బారి నుంచి బయట పడలేక ప్రత్యామ్నాయం కనిపించక రైతులు పత్తి పంటను పూర్తిగా తొలగిస్తున్నారు. గత సంవత్సరం కూడా పత్తి పంటను తీవ్రంగా నష్టాల పాలు చేసిన గులాబీ రంగు తెగులు మళ్లీ ఈసారి అన్నదాతకు గుబులు పుట్టిస్తుంది. గత సంవత్సరం పత్తి పంటను నాశనం చేసిన గులాబీ తెగులును అరికట్టేందుకు అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు.

నకిలీ విత్తనాల కారణంగానే ఈ గులాబీ రంగు పురుగు పంటను ఆక్రమిస్తుందని రైతులు వాపోతున్నారు. అయితే రోజురోజుకు గులాబీ రంగు పురుగుల దాడి మరింత ఉధృతమవుతూ ఒక చేను నుంచి మరో చేనుకు విస్తరిస్తుంది. క్రమంగా ఊరు ఊరంతా ఉన్న పంట చేలన్ని గులాబీ పురుగు దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రైతులు గులాబీ పురుగు దాడిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాగు మొదట్లోనే వ్యవసాయాధికారులు ఈ తెగులుపై రైతులకు సరైన అవగాహన కల్పించి ఉన్నట్లయితే ప్రస్తుత పరిస్థితి తలెత్తేది కాదని అంటున్నారు.

నకిలీ విత్తనాలు, పురుగు మందులను అరికట్టలేక పోయిన వ్యవసాయ శాఖ కనీసం రైతులకు గులాబీ తెగులుపై అవగాహన కల్పించి ఉన్నట్లయితే పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదని అంటున్నారు. ఇప్పటికీ కూడా ఉమ్మడి జిల్లాలోని చాలా మండలాలలో గులాబీ రంగు పురుగు కారణంగా పత్తి పంట కకావికలమవుతున్నప్పటికీ వ్యవసాయ శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం ఆ శాఖ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అంటున్నారు. అధికారుల నిర్లక్ష వైఖరి కారణంగా విచ్చలవిడిగా ప్రమాదకరమైన బీజీ 3 రకం విత్తనాలను సాగు చేశారు. అధిక దిగుబడుల ఆశతోబాటు అవగాహన లోపం, అమాయకత్వం కారణంగా రైతులు బీజీ 3 వైపే మొగ్గుచూపారు. ముఖ్యంగా వ్యాపారులు అధిక లాభాల కోసం బీజీ 3 విత్తనాన్ని వ్యూహాత్మకంగా అన్నదాతకు అంటగట్టారు.
బీజీ 3 విత్తనాల అమ్మకం కారణంగా వ్యాపారులకు అధిక లాభాలుంటాయని అంటున్నారు. దీంతోపాటుగా గ్లైఫోసెట్ రసాయనిక మందుకు కూడా గిరాకి ఉంటుందన్న భావనతో వ్యాపారులు రైతులను ఈ దిశగా పక్కదారి పట్టించారన్న ఫిర్యాదులున్నాయి.
అయితే గత సంవత్సరం కూడా ఇలా గులాబీ రంగు పురుగు సోకడంతో పత్తి పంట పూర్తిగా నష్టాల పాలైనప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీనికితోడుగా నకిలీ విత్తన వ్యాపారులపై సైతం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే మళ్లీ ఈ సంవత్సరం కూడా రుచి మరిగిన పులిలాగా గులాబీ రంగు పురుగు పత్తిపై దాడి చేస్తూ పంటను నాశనం చేస్తుంది. ప్రస్తుతం జిల్లాలోని జైనథ్, బేల, తాంసి, తలమడుగు మండలాల్లో గులాబీ పురుగు తీవ్ర స్థాయిలో పత్తిని నాశనం చేస్తుండగా క్రమంగా మరికొన్ని మండలాలకు సైతం విస్తరించే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

Related Stories: