పంచాయతీల్లో ’ప్రత్యేక‘ పాలన

From August 2 to the Secretaries to the rule reins

సర్పంచ్ పాలనకు చెక్
నెలఖారుతో ముగుస్తున్న గడువు
ఆగస్టు 2 నుంచి కార్యదర్శులకు పాలన పగ్గాలు
గడువు పెంచాలని కోరుతున్న సర్పంచులు
బిసి రిజర్వేషన్‌లు తేలాకే ఎన్నికలు

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ :  ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులైన గ్రామాల సర్పంచులు ఇక వైదొలగనున్నారు. ఐదేళ్ల కాలం పూర్తి చేసుకున్న సర్పంచులు మరి కొంత గడువు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సర్పంచుల పదవి కాలం మరో పక్షం రోజులలో ముగియనుండడంతో సర్పంచుల స్థానంలో గ్రామ పంచాయితీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించే పరిస్ధితి ఉంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ సర్పంచుల స్థానంలో ఆగస్టు 2వ తేదీ నుండి పంచాయితీ కార్యదర్శుల పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు.జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో ముందుగా ఏ ఎన్నికలు వస్తా యో తెలియక ప్రజలు రాజకీయ పార్టీల నాయకులు అయోమయానికి గురయ్యారు. ఏక కాలంలో, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగితే దీని తర్వాత గ్రామ పంచాయితీ ఎన్నికలు వస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికారులు రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై సాధ్యాసాధ్యాలను పరిశీలించిన నేపథ్యంలో ఎన్నికలు ఖాయమంటూ ప్రచా రం జరుగుతోంది. బిసి రిజర్వేషన్ల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉండడంతో ఇది తేలాకే గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగుతాయని ఓ నిర్ణయానికి వచ్చారు. ఈసి ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నది. అందులో బాగంగా ఇవిఎం మిషన్లు, బ్యాలెట్ బాక్సు లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. బ్యాలెట్ పత్రాలు ముద్రణ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో గత వారం రోజులు నుంచి ఏకధాటిగా కొనసాగుతోంది. దీనిని బట్టి చూస్తే గ్రామ పంచాయితీల ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా ఎప్పడు వచ్చినా ఎన్నికలకు సిద్ధంగా ఉం డేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత ఉమ్మడి జిల్లాలో 1330 గ్రామ పంచాయితీలు ఉండగా, జిల్లాల పునర్విభజన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 468 పాత పంచాయితీలు ఉండేవి, కొత్త గ్రామ పంచాయితీలు ఏర్పాటుతో ఆ సంఖ్య 733కు పెరిగింది. అయితే ఇందులో కూడా 12 గ్రామ పంచాయితీలు మున్సిపాల్టీలలోకి విలీనమయ్యాయి. మఖ్తల్,చందాపూర్ కలిపి మున్సిపాల్టీగానూ, భూత్‌పూర్, అమిస్తాపూర్ కలిపి ఒక మున్సిపాల్టీగానూ, జడ్చర్ల, నాగసాల, బూరెడ్డి పల్లె కలిపి ఒక మున్సిపాల్టీగానూ మారనుంది. కేవలం దేవరకద్ర పంచాయితీ మాత్రమే మేజర్ గ్రామ పంచాయితీగా మారింది. దీం తో 721 గ్రామ పంచాయితీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఇందు లో శంకరాయపల్లె తాండ, బండమీద పల్లె గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరగడం లేదు. వీటికి 2015లో ఎన్నికలు జరగడంతో మరో రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. అయితే 721 గ్రామ పంచాయితీల కు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ రిజర్వేషన్ ప్రక్రియ కూడా బిసిలకు బిసి ఓటర్ల ఆదారంగా రిజర్వేషన్లు అమలు కాగా,ఎస్‌సి, ఎస్‌టిలకు మా త్రం 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. రిజర్వేషన్ల ఎంపిక కూడా సర్పంచ్‌లకు ర్రాష్ట్ర స్థాయిలో ఎంపిక అవుతుండగా, వార్డులకు జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలో ఆర్‌డిఓ సమక్షంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 7.25.675 మంది ఉండగా అందు లో పురుష ఓటర్లు 3.63.737 మంది ఉండగా,3.61.889 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పంచాయితీ ఎన్నికల్లో యలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వార ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

107 తండాలకు వారే సర్పంచులు
మా తండా మా పంచాయితీలు అన్న నినాదానికి ముఖ్యమ్రంతి కెసిఆర్ ఆమోదం తెలపడంతో జిల్లాలో కొత్తగా 100 శాతం ఎస్‌టి జనాభాతో ఉన్న 107 తండాల గ్రామ పంచాయితీలకు కొత్తగా ఏర్పాటు జరిగాయి. గతంలో ఇతర గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎస్‌టిలు ఈ సారి జరిగే పంచాయితీ ఎన్నికల్లో తమ గ్రామాల్లోనే తమ ఓటు హక్కను వినియోగించుకోవడమే కాకుండా ఎస్‌టిలే గ్రామ పంచాయితీలుకు సర్పంచులుగా మారనునున్నారు. వంద శాతం ఎస్‌టి పంచాయితీలకు సర్పంచులు వారే కాకుండా ఇతర గ్రామాల్లో జరిగే పంచాయితీల్లో కూడా వారికి రిజర్వేషన్లు అమలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది చారిత్రక విజయమని ఎస్‌టిలు భావిస్తున్నారు. మహిళలకు కూడా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో దాదాపు సగానికి సగంకు పైగా మహిళలు సర్పంచులుగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి.