పంచాయతీలకు గ్రహణం వీడేదెప్పుడో..!

Start at the district but 55 gram panchayat construction works

జిల్లాలో ప్రారంభం కానీ 55గ్రామ పంచాయతీ భవనాల పనులు
125 భవనాలకు గాను పూర్తయినవి కేవలం 19 మాత్రమే
శ్రద్ద చూపని సర్పంచ్‌లు…ప్రారంభానికి నోచుకోని పనులు

పల్లె సీమలు ప్రగతికి పట్టుకొమ్మలని, పల్లెలు అభివృద్ది చెందినప్పుడే దేశం అభివృద్ది చెం దు తుందని భావించి ప్రభుత్వం గ్రామాల అభివృద్ది కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుండగా కొ ంత మంది సర్పంచ్‌ల నిర్లక్షం వల్ల గ్రామాల్లో అభివృద్ది పనులు కుంటుబడిపోతున్నాయి. జి ల్లాకు 125 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరైతే అందులో కేవలం 19 మాత్రమే పూర్తి కాగా 55 గ్రామాల్లో పనులు ప్రారంభానికే నోచుకోలేదు. ఆరు నెలల కాలంలో నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉండగా ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. “అంగట్లో అన్నీ ఉన్నా… అల్లుని నోట్లో శని” అన్న చందంగా నిర్మాణాలకు కావాల్సిన నిధులున్నా… నిర్మాణాలు చేపట్టడంలో సర్పంచ్‌లు శ్రద్ద చూపడం లేదని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో స్థల సమస్య కూడా ఉండ టంతో గ్రామ పంచాయతీలకు పట్టిన గ్రహణం ఎప్పుడు వీడుతుందోనని ఆయా గ్రా మాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. 

మనతెలంగాణ/జగిత్యాల: జిల్లాలో స్వంత గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాలను గుర్తించిన ప్రభుత్వం ఆయా గ్రామాల్లో కొత్తగా పంచాయతీ భవనాలు నిర్మించాలని నిర్ణ యించింది. జిల్లాలో 125 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద రూ. 17.12 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల మండలంలో 6 గ్రామ పంచా యతీ భవనాలు, రాయికల్ మండలంలో 9, సారంగాపూర్ మండలంలో 12 గ్రామ పంచా యతీ భవనాలకు రూ.3.57 కోట్లు మంజూరు అయ్యాయి. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి మండలంలో 15, గొల్లపల్లిలో 6, వెల్గటూర్‌లో 15, పెగడపల్లి మండలంలో 11 గ్రామ పంచాయతీ భవనాలకు రూ. 6.76 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కోరుట్ల నియోజకవర్గంలోనిమెట్‌పల్లిమండలంలో5, కోరుట్లలో7, ఇబ్రహీంపట్నంలో 8, మల్లాపూర్ లో 7 గ్రామ పంచాయతీలకు రూ. 3.59 కోట్లు మంజూరు కాగా, చొప్పదండి నియోజక వర్గంలోని కొడిమ్యాలలో 2, మల్యాలలో 4 పంచాయతీలకు రూ.80 లక్షలు, వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్‌లో 9, మేడిపల్లిలో 9 పంచాయతీలకుగాను రూ. 2.40 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాకు మంజూరైన పంచాయతీ భవనాల్లో 50 శాతం భవనాల పనులు ప్రారంభమై 19 పూర్తి కాగా 51 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కో పంచాయతీ భవనానికి రూ.13 లక్షల చొప్పున నిధులు విడుదల చేయగా ఆ నిధులతో భవన నిర్మాణ పనులు మాత్రమే పూర్తయ్యాయి. విద్యుత్, ఎలక్ట్రిక్ పరికరాలకోసం మరో రూ.3 లక్షలు అవసరముందని ప్రభుత్వానికి నివేదించగా ఆ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసిందని, వెంటనే ఆయా పనులు పూర్తి చేయించనున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు.

55 గ్రామ పంచాయతీ భవనాల సంగతి ఇక అంతేనా…!
జిల్లాకు మంజూరైన గ్రామ పంచాయతీ భవనాల్లో 55 భవనాల పనులు ప్రారంభం కాకపోవడంతో వాటి సంగతి ఇక అంతేనా అనే ప్రశ్నలు ఉత్ఫన్నమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో భవనం నిర్మించేందుకు అనువైన స్థలం లేక పనులు ప్రారంభం కాకపోగా, మరి కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు నిర్మాణాలు చేపట్టేందుకు సుముఖత చూపడం లేదని తెలుస్తోంది. గ్రామ పంచాయతీ భవనాలను ఆయా గ్రామ సర్పంచ్‌లే నిర్మాణ బాధ్యతలు తీసుకోవాల్సి ఉండగా వారు ఎందుకో గానీ శ్రద్ద చూపకపోవడం… ఇతరులు చేసే వీలు లేకపోవడంతో జిల్లాకు మంజూరైన పంచాయతీ భవనాలకు పునాది రాయి పడటం లేదు. “దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించని” చందంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా సర్పంచ్‌ల నిర్లక్షం వల్ల పంచాయతీ భవనాలు నిర్మాణానికి నోచుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరుతో సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తుండటంతో వారి పదవీ కాలం అనంతరం ఇంజనీరింగ్ శాఖ అధికారులు గ్రామ పంచాయతీల నిర్మాణాలు చేపట్టి సత్వరంగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

స్థల సమస్య, సర్పంచ్‌లు సుముఖత చూపకపోవడం వల్లే…. పిఆర్ ఇఇ మనోహర్‌రెడ్డి

జిల్లాకు మంజూరైన 125లో 70 గ్రామాల్లో పనులు ప్రారంభించి 19 పూర్తి చేయించగా మరో 51 నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. వాటిని త్వరలోనే పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. మిగతా 55కు సంబంధించిన కొన్ని గ్రామాల్లో స్థల సమస్య, మరి కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు సుముఖత చూపించకపోవడం వల్ల పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలను ఆయా గ్రామాల సర్పంచ్‌లే చేయాలే తప్పా ఇతరులు చేసేందుకు వీలు లేదు. కొద్ది రోజుల్లో సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తున్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిపై నిర్ణయం తీసుకుంటాం.