భారీ పేలుడు పదార్థాల స్వాధీనం
8750 జిలెటిన్ స్టిక్స్,
480 డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు 8ముగ్గురు వ్యక్తులు,
ఆటోని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించిన ఎస్ఒటి ఎఎస్ఐ అంతిరెడ్డి
మన తెలంగాణ / రాజేంద్రనగర్ : అక్రమంగా ఆటోలో తరలిస్తున్న భారీ పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ ఎస్ఓటి, రాజేంద్రనగర్ పోలీసులు టిఎస్‌పిఎ వద్ద మాటు వేసి పెద్ద సంఖ్యలో జిలెటిన్‌స్టిక్స్, డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … గచ్చిబౌలికి చెందిన వ్యక్తులు ఆటోలో పేలుడు పదార్థాలు తరలిస్తున్నట్లు ఎస్వోటి పోలీసులకు సమాచారం అందింది. దీంతో టిఎస్‌పిఎ వద్ద మాటు వేసిన పోలీసులు అటుగా వచ్చిన ఎపి 25టివి0515 నెంబరు గల ఆటోను ఆపి తనిఖీచేశారు. ఆటోలో పెద్ద ఎత్తున జిలెటిన్‌స్టిక్స్, డిటొనేటర్లు ఉన్నట్లు గుర్తించి పోలీసులు ఆటో పాటు వాటిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో 750 జిలెటిన్‌స్టిక్స్,480 డిటోనెటర్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని అక్రమంగా తరలిస్తున్న గచ్చిబౌలికి చెందిన కృష్ణ, నర్సింహతో పాటు ఆటో డ్రైవర్ నర్సింహను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పెద్ద బండరాళ్లను, గుట్టలను ధ్వంసం చేయడానికి ఎక్కువగా జిలెటిన్‌స్టిక్స్, డిటొనేటర్లు ఉపయోగిస్తారని తెలిసింది. కానీ ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు ఎలాంటి అనుమతి లేకుండా తరలిస్తుండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్వోటి ఎఎస్ఐ అంతిరెడ్డి పేలుడు పదార్థాలతో పాటు ముగ్గురు వ్యక్తులను, ఆటోను తదుపరి దర్యాప్తు నిమిత్తం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. ఈకేసును రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.