నేనైతే ‘డోక్లాం’ను ఆపగలిగే వాడిని

Rahul Gandhi Says Chinese Still In Doklam

లండన్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తానయితే డోక్లాం సంక్షోభాన్ని అపగలిగే వాడినని అన్నారు. ఇది సంభటనల సమాహారంలో భాగమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గనుక బాగా పరిశీలించి ఉంటే డోక్లాం సంక్షోభాన్ని నిలువరించి ఉండేవారని రాహుల్ అన్నారు. తానయితే దీన్ని సంఘటనల సమాహారంగాను, వ్యూహాత్మకంగాను చూస్తానన్నారు. కానీ ప్రధాని మోడీ మాత్రం దీన్ని ఒక సంఘటనగా మాత్రమేచూస్తున్నారన్నారు. మోడీ చైనాను నిలువరించడంలో విఫలమయ్యారన్నారు. చైనీయులు ఇప్పటికీ డోక్లాంలో ఉన్నారనేది వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. లండన్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ విషయంలో కూడా మోడీకి ఒక విధానం లేదని ఆయన విమర్శించారు. సిక్కింలోని డోక్లాం వద్ద భూటాన్, భారత్, చైనాల ట్రై జంక్షన్ ఉంది. ఈ ప్రాంతంలో రోడ్లు, తదితర మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు చైనా సైన్యం ప్రయత్నించడంతో గత ఏడాది జూన్ 16నుంచి రెండు నెలలకు పైడా చైనా, భారత్‌ల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. చివరికి ఆగస్టు 28న చైనా సైన్యాలు వెనక్కి తగ్గడంతో సమస్య పరిష్కారమైంది.

విభజనకు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి యత్నం
భారతీయులందరినీ కాంగ్రెస్‌పార్టీ కలిపి ఉంచితే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు మాత్రం విద్వేషాలను వ్యాప్తి చేస్తూ, వారిని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బెర్లిన్‌లో గురువారం రాత్రి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వమనే కాంగ్రెస్ సిద్ధాంతం సిక్కుల గురువు గురునానక్‌దేవ్ కాలం నుంచి వచ్చిందన్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, సుదీర్ఘ ప్రసంగాలు చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, యువత తమ భవిష్యత్తు ఏమిటో తెలియక అయోమయంలో అల్లాడుతోందన్నారు. భారతదేశం ముందుకు వెళ్లాలనేది కాగ్రెస్‌పార్టీ ఆకాంక్ష అని, తమ ప్రభుత్వ హయాంతో దేశంలో ఎక్కడా, ఎవరు కూడా విద్వేషాలను, కోపాలను రెచ్చగొడుతూ మాట్లాడడాన్ని మీరు వినలేదని కూడా రాహుల్ అన్నారు.

Comments

comments