నేతల నెత్తిన పొత్తుల కుంపటి

ఖమ్మంపై పలువురి గురి బరిలో నిలిచేదెవరో? కొందర్ని పోటీకి దూరం చేయనున్న పొత్తులు ఖమ్మం సీటును ఆశిస్తున్న రేణుకా చౌదరే ముందు వరుస సిట్టింగ్ ఎంపిగా ఉన్న పొంగులేటికి పోటీ చేసే అవకాశం రాకపోవడం సందేహమే పొత్తులపై కొనసాగుతున్న రసవత్తర చర్చ రానున్న ఎన్నికల్లో రాజకీయ పొత్తులు తప్పవన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. కొన్ని రాజకీయ పార్టీల మధ్య అవగాహన చర్చలు జరుగుతున్నాయి. టిడిపి ప్రస్తుతానికి టిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య నిలిచింది. ఏ వైపుకు మొగ్గుతుందోనన్న విషయం […]

ఖమ్మంపై పలువురి గురి
బరిలో నిలిచేదెవరో?
కొందర్ని పోటీకి దూరం చేయనున్న పొత్తులు
ఖమ్మం సీటును ఆశిస్తున్న రేణుకా చౌదరే ముందు వరుస
సిట్టింగ్ ఎంపిగా ఉన్న పొంగులేటికి పోటీ చేసే అవకాశం రాకపోవడం సందేహమే
పొత్తులపై కొనసాగుతున్న రసవత్తర చర్చ

రానున్న ఎన్నికల్లో రాజకీయ పొత్తులు తప్పవన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. కొన్ని రాజకీయ పార్టీల మధ్య అవగాహన చర్చలు జరుగుతున్నాయి. టిడిపి ప్రస్తుతానికి టిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య నిలిచింది. ఏ వైపుకు మొగ్గుతుందోనన్న విషయం ఖమ్మం నేతల రాతను తేల్చనుంది. ఆది నుంచి రాజకీయ చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లాలో ఈసారి పొత్తులు అత్యంత కీలకం కానున్నాయి. ఆయా పార్టీల నుంచి ఖమ్మం బరిలోకి దిగేందుకు నిర్ణయించుకున్న నేతల ఆశలపై పొత్తులు నీళ్లు చల్లే అవకాశం ఉంది. కాంగ్రెస్ టిడిపి పొత్తు కలిసిన లేదా టిడిపి, టిఆర్‌ఎస్ పొత్తు కలసినా సిపిఐ కాంగ్రెస్‌తో ఉన్న ఇక్కడ కొందరు తెరమరుగు కావాల్సిందే. ఎవరు ఎవరితో ఉంటారన్న దానిపైనే నేతల భవిష్యత్తు ఆధారపడి ఉంది. మొత్తానికి ఖమ్మం పార్లమెంటు రాజకీయం పొత్తుల కోసం ఎదురు చూస్తుంది. ఈ పొత్తులు ఎవర్నీ ముంచనున్నాయో ఎవర్నీ బరిలో దింపనున్నాయో అని ఆసక్తికర చర్చ సాగుతుంది.

మన తెలంగాణ/ఖమ్మం : ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లితో పాటు భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజక వర్గాలు ఉన్నాయి. ఆది నుంచి ఖమ్మం ఎన్నిక ఆసక్తి కరంగానే సాగుతుంది. విలక్షణ తీర్పులు ఇవ్వడం ఈ ప్రాంత ఓటర్లకు అలవాటుగా మారింది. ఇప్పటి వరకు గెలిచిన వారిలో బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసిన వారే అధికంగా ఉండటం గమనార్హం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తులో భాగంగా సిపిఐ నుంచి కె.నారాయణ, టిడిపి నుంచి నామ నాగేశ్వరరావు, వైకాపా నుంచి సిపిఎం పొత్తుతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో దిగారు. శ్రీనివాసరెడ్డి సమీప అభ్యర్థిగా ఉన్న నామ నాగేశ్వరరావుపై విజయం సాధించారు. ఆ తర్వాత క్రమంలో పొంగులేటి అధికార పార్టీలో చేరిన విషయం విధితమే. 2019 ఎన్నికల నాటికి బరిలో దిగే అభ్యర్థుల జాబితాలను పొత్తులు తేల్చనున్నాయి. అన్నింటికి మించి టిడిపి ఎవరితో ఉంటుందనే దానిపై అటు కాంగ్రెస్ ఇటు టిఆర్‌ఎస్ నేతల భవితవ్యం ఆధారపడి ఉంది. ఎందుకంటే టిడిపి అడిగే పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా ఖమ్మం ఉంటుంది. రాష్ట్రంలోని 18 స్థానాల్లో టిడిపికి ఒక్క పార్లమెంటు స్థానం పొత్తులో ఉన్న ఏ ఒక్క పార్టీకి కేటాయించిన అది ఖమ్మమే అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు బరిలోకి దిగనున్నారు. నామ నాగేశ్వరరావు కూడా ఏ పార్టీతో పొత్తు ఉన్న తాము బరిలోకి దిగడం ఖాయమన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపి రేణుకాచౌదరితో పాటు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఖమ్మం సీటును ఆశిస్తున్న రేణుకాచౌదరే ముందు వరుసలో ఉన్నారు. కాంగ్రెస్, టిడిపి మధ్య పొత్తు కుదిరితే రేణుకాచౌదరి ఇక ఖమ్మానికి దూరం కావాల్సిందే. గత ఎన్నికల్లో సిపిఐకి కేటాయించడంతో రేణుకాచౌదరి పోటీ చేయలేదు. 1999, 2004 ఎన్నికల్లో గెలిచిన రేణుకా 2009లో ఓటమి చవిచూశారు. 2014లో పోటీ చేయలేదు. మరోసారి కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న పార్టీకి ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తే రేణుకాచౌదరి మరో స్థానానికి వలస పోక తప్పదు. ఒకవేళ టిడిపి, టిఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు కుదిరితే ఇప్పుడు సిట్టింగ్ ఎంపిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పోటీ చేసే అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే టిఆర్‌ఎస్ పార్టీని కూడా సీట్ల పంపకంలో టిడిపి ఖమ్మంసీటును కోరుతుంది. ఈ ఒక్క స్థానాన్ని టిడిపితో పొత్తు ఉన్న ఏ పార్టీ అయినా వదులుకోక తప్పని స్థితి. ఒకవేళ టిఆర్‌ఎస్‌తో పొత్తు టిడిపితో కుదిరితే పొంగులేటికి కాంగ్రెస్‌తో కుదిరితే రేణుకాచౌదరికి పోటీ చేసే అవకాశం దక్కదనేది సూస్పష్టం. ఇక సిపిఐ కూడా మరో దఫా ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని కోరతామని ఖచ్చితంగా బరిలోకి దిగేందుకు సమయాత్తమవుతున్నామని ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్‌తో గతంలో మాదిరే సిపిఐ కూడా పొత్తును కొనసాగిస్తే కాంగ్రెస్ అభ్యర్థికి కూడా పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చు. మొత్తం మీద ఖమ్మం బరిలో ఏఏ పార్టీలు ఉంటాయి. ఆ పార్టీల పక్షాన ఎవరు బరిలోకి దిగనున్నారనేది పొత్తులపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే ఈ పొత్తులపై రసవత్తర చర్చ సాగుతుంది. 2019 ఎన్నికల పొత్తులు ఎవర్నీ చిత్తు చేయనున్నాయో వేచి చూడాల్సిందే.

Related Stories: