నేడే ప్రజల ఆశీర్వాద సభ

Today is the blessing meeting of the people

మన తెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయడంతో ఎన్నికలకు సిద్ధమవుతున్న కెసిఆర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారానికి శంఖం పూరించనున్నారు. ఏ కార్యాన్ని తలపెట్టినా రాష్ట్రానికి ఈశాన్య దిక్కు నుంచి శుభారంభం చేసే ఆనవాయితీ ప్రకారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. దీనికంటే ముందు కోనాయిపల్లిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసి అక్కడి నుంచి మధ్యాహ్నంకల్లా సభా వేదికకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, దీనివల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఏ మేరకు మంచి జరుగుతుందని, ఏ ఉద్దేశాన్ని ఆశించి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తదితర అంశాలపై ఈ వేదిక ద్వారా వివరణ ఇవ్వనున్నారు. రానున్న యాభై రోజుల్లో వంద బహిరంగసభల్లో పాల్గొంటానని స్వయంగా వ్యాఖ్యానించిన కెసిఆర్ హుస్నాబాద్ నుంచే శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి జరగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో టిఆర్‌ఎస్‌ను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఎన్నికలు జరిగినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాతిపదికనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది. త్వరలో జరగనున్న ఎన్నికలు మాత్రం తెలంగాణ రాష్ట్రం పేరుతో జరిగే తొలి ఎన్నికలు కానున్నాయి.

మళ్ళీ అవకాశంతో బంగారు భవిష్యత్తు
తెలంగాణ సాధించిన పార్టీగా టిఆర్‌ఎస్‌కు, మొండి పట్టుదలతో కొట్లాడి సాధించిన వ్యక్తిగా కెసిఆర్‌కు గుర్తింపు ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల సంక్షేమం కోసం మెజారిటీ ఇచ్చి గెలిపించడంతో నాలుగున్నరేళ్ళలోనే 40కు పైగా అవార్డులు, గుర్తింపులు సొంతం చేసుకున్నామని పేర్కొన్న కెసిఆర్ త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైతం పట్టం కట్టాల్సిందిగా ప్రజలకు ఇప్పటికే పిలుపునిచ్చారు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఎలాంటి గోస పడ్డామో కరెంటు కష్టాల మొదలు రైతుల, చేనేతల ఆత్మహత్యలు, ఎన్‌కౌంటర్ల పేరుతో తెలంగాణ పౌరుల హత్యలు.. ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలను చవిచూసిన ప్రజలు నాలుగున్నరేళ్ళుగా ప్రశాంతంగా నిద్రపోతున్నారని కెసిఆర్ వ్యాఖ్యానించారు. తన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడూ తెలంగాణ ప్రశాంతంగా నిద్రపోయింది చూడలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఇది సాధ్యమైందని వ్యాఖ్యానించారు. వీటన్నింటినీ హుస్నాబాద్ వేదికగా ప్రస్తావించి ప్రగతి రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణను మరింత మెరుగైన దిశగా తీసుకెళ్ళడానికి మరోమారు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరనున్నారు.

Comments

comments