నేడు మంత్రులతో సిఎం భేటీ

Meet CM KCR with ministers today

సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌కు రావాలని అందుబాటులో ఉన్న మంత్రులందరికీ వర్తమానం
2వ తేదీ ప్రగతి నివేదన, కంటివెలుగు, రైతుబీమాలతో పాటు కీలక రాజకీయాంశాలు చర్చించనున్నట్లు సమాచారం

మన తెలంగాణ / హైదరాబాద్ : మంత్రులతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతిభవన్‌లో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులందరూ సాయంత్రం నాలుగు గంటలకల్లా సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఇప్పటికే సమాచారం అందింది. వివిధ అంశాలపై మంత్రులతో సిఎం చర్చించనున్నారు. వచ్చే నెల రెండవ తేదీన నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన’ భారీ బహిరంగసభకు సంబంధించిన అంశాలతో పాటు వివిధ రాజకీయ అంశాలు, పరిపాలనాపరమైన అంశాలను ఈ సమావేశంలో మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ‘కంటి వెలుగు’, ‘రైతుబీమా’ పథకాలు అమలవుతున్నందున అందులో క్షేత్ర స్థాయిలో పాల్గొంటున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వస్తున్న స్పందన, అమలవుతున్న తీరు తదితరాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సంక్షేమ పథకాలతో గ్రామాల్లో ప్రజలు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు, ఆవాంతరాలేమైనా ఎదురవుతున్నాయా, వాటిని పరిష్కరించడమెలా తదితర అంశాలపై మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.

పరిపాలన, రాజకీయపరమైన అంశాలను కూడా చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దాదాపుగా ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మంత్రులతో సమావేశాల ప్రక్రియను సిఎం ప్రారంభించడం గమనార్హం. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో పరిపాలన ఏ విధంగా సాగుతోంది, సంక్షేమ పథకాలు ఏ విధం గా అమలవుతున్నాయి, పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఆయా జిల్లాలకు ప్రభుత్వపరంగా ఉన్న అవసరాలేంటి, నియోజకవర్గాలవారీగా అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు దిద్దుబాటు చర్యలకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేసే అవకాశం ఉంది. ఎన్నికల వాతావరణం వచ్చినందున శాసనసభ్యులంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రజల మధ్యనే ఉం టూ సమస్యలను అధ్యయనం చేస్తూ ప్రభుత్వపరంగా పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతూ చొరవ తీసుకోవాలని ఇప్పటికే పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినందున రానున్న కాలంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని మంత్రులకు సిఎం సూచించే అవకాశం ఉంది. గత నెల 27న మంత్రివర్గ సమావేశం నిర్వహించిన తర్వాత మళ్ళీ విడివిడిగా సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.

Comments

comments