నేడు భారత్ బంద్

Bharat-Bandh

న్యూఢిల్లీ: ఆకాశాన్నంటిన పెట్రో ధరలకు నిరసనగా సోమవారం భారత్ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ పిలుపునకు డిఎంకె, ఎన్‌సిపి, ఆర్‌జెడి, జెడి( ఎస్) సహా పలు ప్రధాన ప్రతిపక్షాలుసైతం మద్దతు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా జరిగే ఈ నిరసనలో పాలు పంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ వివిధ పౌరసంఘాలతో పాటుగా స్వచ్ఛంద సంస్థలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. వామపక్షాలు మాత్రం విడిగా అదే రోజు దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వగా మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ బంద్‌కు మద్దతు తెలియజేస్తూనే సామాన్యులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు పశ్చి బెంగాల్‌లో బంద్ పాటించబోమని స్పష్టం చేసింది.

సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు సోమవారం ఉదయం తొమ్మిది గంటలనుంచి మధ్యాహ్నం మూడు గంటలవరకు మాత్రమే బంద్ పాటించడం జరుగుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తెలియజేశారు. 2004లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు పెట్రోలు, డీజిలు ధరలు 50 శాతం దాకా పెరిగాయని, వీటిపై కేంద్ర ఎక్సైజ్ సుంకాలు అయితే వందల శాతం పెరిగాయని సుర్జేవాలా ఆరోపించారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం సామాన్యుడిని పిండి ధనవంతులకు దోచి పెడుతోందని ఆయన ఆరోపించారు. పెట్రోలు, డీజిలు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నా కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని మరో కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లోట్ ఆరోపిస్తూ, కేంద్రాన్ని నిద్ర లేపేందుకు, ప్రభుత్వం తీరుపై ప్రజల ఆగ్రహాన్ని తెలియజేయడం కోసమే భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు.

పెట్రోపై రాజస్థాన్‌లో 4% వ్యాట్ తగ్గింపు

జైపూర్: రాజస్థాన్‌లో పెట్రోలు డీజిల్ ధర లపై వ్యాట్‌ను నాలు గు శాతం మేర తగ్గిం చారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఆది వారం అధికారిక ప్రకటన వెలువరిం చారు. అర్థరాత్రి నుంచే వ్యాట్ తగ్గింపు నిర్ణయం అమలులోకి వస్తుందని, ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఇంధన ధరలు లీటరుపై రెండున్నర చొప్పున తగ్గుతాయని వివరించారు. రాష్ట్ర రాజధాని జైపూర్‌లో పెట్రోలు ధరలు లీటరుకు రూ 80కి చేరుకున్న రోజునే వాహనదారుల ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని వ్యాట్‌ను తగ్గించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్రోలుపై 30 శాతం వ్యాట్ ఉంది. తగ్గింపుతో ఇది 26 శాతం అవుతుంది, ఇక డీజిల్‌పై ఇప్పటివరకూ 22 శాతం వ్యాట్ ఉండగా తగ్గింపుతో ఇది 18 శాతానికి వస్తుంది. రాజస్థాన్ గౌరవ్ యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి హనుమాన్ నగర్ జిల్లాలోని రావాత్సర్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తూ వ్యాట్ తగ్గింపు నిర్ణయం గురించి తెలిపారు.

ఆగని పెట్రో వడ్డన

చమురు ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా కేంద్రం మాత్రం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. పెట్రోలు ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ ఆదివారం సైతం పెట్రోలు, డీజిలు ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 12 పైసలు పెరగ్గా, డీజిలు ధర పది పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు లీటరు రూ. 80.50కు, డీజిలు రూ. 72.61కు చేరుకుంది. కాగా ముంబయిలో పెట్రోలు ధర లీటరుకు రూ.  87.89కి, డీజిలు ధర లీటరుకు రూ.77.09కి చేరుకుంది.దాదాపు పక్షం రోజులుగా పెట్రోలు, డీజిలుధరలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments