నేడు తుది సమరం

sprt

 ఫిఫా ఫైనల్‌కు
ఫ్రాన్స్-క్రొయేషియా సిద్ధం

రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఫుట్‌బాల్ మహా సంగ్రామం తుది అంకానికి చేరు కుంది. ఫ్రాన్స్ క్రొయేషియా జట్ల మధ్య ఆదివారం ఫైనల్ సమరం జరుగనుంది. రష్యా రాజధాని మాస్కో లోని చారిత్రక లుజ్నికి స్టేడి యంలో జరిగే తుది సమరానికి ఫ్రాన్స్‌క్రొయేషియా జట్లు సిద్ధమయ్యాయి. టైటిల్ ఫేవరెట్లుగా భావించిన జర్మనీ, అర్జెంటీనా, బ్రెజిల్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, ఇంగ్లండ్ తదితర అగ్రశ్రేణి జట్లు ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించాయి. అయితే అనూహ్యంగా ఫ్రాన్స్, క్రొయేషియాలు టైటిల్ పోరుకు చేరుకుని సంచలనం సృష్టించాయి. మాజీ చాంపి యన్ ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అయితే క్రొయేషియా టైటిల్ పోరుకు దూసుకెళ్లడం మాత్రం ప్రపంచ ఫుట్‌బాల్‌లో పెను సంచల నమే సృష్టించింది. అందరి అంచనాలు తారుమారు చేస్తూ క్రొయేషియా అనూహ్యంగా ఫైనల్‌కు చేరుకుంది. 40 లక్షల జనాభా మాత్రమే కలిగిన క్రొయేషియా అసాధారణ పోరాట పటి మతో ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలువాలని తహతహలాడు తోంది. మరోవైపు ఫ్రాన్స్ కూడా తన ఖాతాలో రెండో ప్రపంచకప్‌ను జమ చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారు. ఇరు జట్లలో కూడా మెరికల్లాంటి ఆట గాళ్లు ఉండడంతో ఫైనల్ సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.

హోరాహోరీ ఖాయం..
ఆదివారం క్రొయేషియాఫ్రా న్స్ జట్ల మధ్య జరిగే ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయమని చెప్పాలి. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఫైనల్‌కు చేరుకునే క్రమంలో ఇరు జట్లు కూడా ఒక్క ఓటమిని కూడా చవి చూడలేదు. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన క్రొయేషియా లీగ్ దశలో అజేయంగా నిలిచింది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. ఇదే క్రమంలో బలమైన అర్జెంటీనాను 30తో చిత్తు చేసి పెను ప్రకంనలే సృష్టించింది. నైజీరియా, ఐస్‌లాండ్ జట్లను సైతం క్రొయేషియా ఓడించింది. ఇక, ప్రిక్వార్టర్ ఫైనల్లో బలమైన డెన్మార్క్‌ను మట్టి కరిపించింది. పెనాల్టీ షూటౌట్‌లో క్రొయేషియా విజయం సాధించింది. ఇక, క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య రష్యాను ఇంటిదారి పట్టించింది. యుద్ధాన్ని తలపించే రీతిలో సాగిన ఈ సమరంలో క్రొయేషియా పెనాల్టీ షూటౌట్‌లో విజయాన్ని అందుకుంది. ఇక, సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై చారిత్రక విజయాన్ని అందుకుంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను 21 తేడాతో ఓడించి టైటిల్ పోరుకు చేరుకుంది. పెద్దగా స్టార్ ఆటగాళ్లు లేకున్నా సమష్టి పోరాటంతో క్రొయేషియా ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే తుది పోరులో ఫ్రాన్స్ ఓడించి తన ఖాతాలో తొలి ప్రపంచకప్‌ను జమ చేసుకోవాలని తహతహలాడుతోంది.
మరో టైటిల్ కోసం..
ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో తనదైన ముద్ర వేసిన ఫ్రాన్స్ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. ఇందులో ఒకసారి చాంపియన్‌గా నిలిచింది. 2000లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ విశ్వ విజేతగా నిలిచింది. కాగా, జర్మనీ వేదికగా 2006లో జరిగిన సాకర్ విశ్వకప్‌లో రన్నరప్‌గా అవతరించింది. తాజాగా ఈసారి మళ్లీ ఫైనల్లో ప్రవేశించింది. రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ప్రారంభం నుంచే అద్భుతంగా ఆడింది. లీగ్ దశలో రెండు విజయాలు సాధించిన ఫ్రాన్స్ ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో బలమైన అర్జెంటీనాను మట్టి కరిపించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో ఫ్రాన్స్ 43 తేడాతో విజయం సాధించింది. ఇక, క్వార్టర్ ఫైనల్ పోరులో 20తో ఉరుగ్వేను ఇంటిదారి పట్టించింది. మరోవైపు సెమీఫైనల్లో పటిష్టమైన బెల్జియంను ఓడించి టైటిల్ వేటకు చేరుకుంది. ఇక, క్రొయేషియాతో జరిగే ఫైనల్లో కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. తన ఖాతాలో మరో ప్రపంచకప్‌ను జమ చేసుకోవాలనే పట్టుదలతో ఫ్రాన్స్ ఉంది. ఉమిటిటి, గ్రిజ్‌మన్, ఎంబాబె వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
క్రొయేషియాకే మద్దతు…
ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరి ప్రకంపనలు సృష్టించిన క్రొయేషియాకే అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. కేవలం 40 లక్షల జనాభా మాత్రమే కలిగిన క్రొయేషియా అసాధారణ ఆటతో ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొంటూ అద్వితియ ప్రదర్శనతో టైటిల్ పోరుకు చేరుకున్న ఘనత క్రొయేషియాకే దక్కుతుంది. టోర్నీ ప్రారంభానికి ముందు క్రొయేషియాపై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. అయితే లీగ్ దశలోనే అర్జెంటీనాను చిత్తు చేసి తానెంత ప్రమాదకర జట్టో చాటింది. ఇదే జోరును నాకౌట్‌లోనూ కొనసాగించింది. ఒక్కో జట్టును మట్టి కరిపిస్తూ ఫైనల్‌కు దూసుకొచ్చింది. కాగా, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు క్రొయేషియాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఫైనల్లో కూడా క్రొయేషియాకే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఫ్రాన్స్‌తో పోల్చితే క్రొయేషియాకే మద్దతు అధికంగా కనిపిస్తోంది. క్రొయేషియా టైటిల్ సాధించాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. వీరి అంచనాలను నిజం చేయాల్సిన బాధ్యత క్రొయేషియా ఆటగాళ్లపై ఎంతైన ఉంది.