నేడు జాతీయ ఇంజినీరింగ్ దినోత్సవం

mokshagundamమోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు దాదాపు మూడువందల సంవత్సరాల క్రితం ఒకప్పటి కర్నూల్ జిల్లా, ప్రస్థుతం ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ‘మోక్ష గుండం” అనే గ్రామం నుంచి అప్పటి మైసూరు రాజ్యా నికి వలస వెళ్లారు. బెంగళూరు నగరానికి 38 మైళ్ళ దూరంలో ఉన్న ముద్దనహళ్ళి గ్రామంలో స్థిరపడిన అతి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో శ్రీనివాసశాస్త్రి శ్రీమతి వెంకటమ్మ దంపతుల సంతానమే విశ్వేశ్వ రయ్య. ఆయన 1861 సెప్టెంబరు 15న జన్మించారు. తండ్రి గొప్ప సంస్కృత పండితులు, ఆయుర్వేద వైద్యు లు. అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి 20వ ఏట, బెంగళూరు సెంట్రల్ కాలేజీ నుంచి బీఏ డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులై అందరిని ఆశ్చర్య పర్చారు. అప్పటి మైసూరు రాజ్యపు దివాను రంగాచార్యుల సహాయ సహకారా లతో ప్రభుత్వపు ఉపకారవేతనంపై పూనేలోని ఇంజినీరింగ్ కాలేజీలోచేరి 1883లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరిలోకి ప్రథముడుగా వచ్చారు విశ్వేశ్వరయ్య.

దాదాపు 70 ఏళ్లకు పైగా నిరంతరం శ్రమించి, దేశంలోని దాదాపు అన్ని ముఖ్య నగరాలకు రక్షిత మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్మూలన, వరద నివారణకు పథకాలు పూర్తి చేశారు.1918 నాటికి, దేశంలోకెల్లా అతి పెద్దదైన కృష్ణ రాజు సాగరం జలాశయం కావేరీ నదిపై నిర్మించారు.‘ఏడెన్’ నగరానికి, మూసీ నదివల్ల వరదల పాలైన హైదరా బాద్ నగరానికి ప్రత్యేకంగా ఆహ్వానితులై, వారి సూచ నల మేరకు నగర పునర్నిర్మాణం, మురుగునీటి పారుదల, వరద నివారణ పథకాలు పూర్తిగావించారు. మైసూరురాజ్య చీఫ్ ఇంజినీర్‌గా, దివానుగా పనిచేశారు. ఇంజినీరుగా విశ్వేశ్వరయ్య అధిరోహించని శిఖరం, అందుకోని అవార్డులు లేవు. భారతప్రభుత్వం 1955లో ‘భారతరత్న’తో సత్కరించింది. 102వ ఏట 1962 ఏప్రిల్ 14న కన్నుమూశారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15 జాతీయ ఇంజినీరింగ్ దినోత్సవంగా పాటించబడుతున్నది.
– మూడ్ శోభన్ నాయక్, (టిఎస్‌ఎఫ్)

Comments

comments