నేటి నుంచి పిఎల్‌జిఎ వారోత్సవాలు

police force in Forest

మన తెలంగాణ/జయశంకర్ ప్రతినిధి: నేటి నుంచి పిఎల్‌జిఎ వారోత్సవాలు ప్రారంభమవుతుండడంతో పోలీస్ బలగాలు ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో భారీగా మోహరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీసులు అడుగడుగునా వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం ఇద్దరు అనుమా నింధితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోయారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులు మావోయిస్టు నక్సల్సా.. ఎవరనేది తెలియడం లేదు. గ్రేహాండ్స్ బలగాలతో పాటు సివిల్ పోలీసులు మఫ్టీలో ఉండి అనుమానితులపై డేగ కళ్లతో వెంటాడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని అనువనువునా పోలీసులు జల్లెడ పడుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం పోలీసులు మొహరించి ఉండడం వల్ల యుద్ధ వాతావరణం నెలకొంది. పిఎల్‌జిఎ వారోత్సవాలను జరిపి తీరుతాం.

మొన్న జరిగిన ఎన్‌కౌంటర్‌కు బాకీ తీర్చుకుంటామంటూ మావోయిస్టు నక్సల్స్ అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ లేఖలు రాయడంతో ప్రశాంతంగా ఉన్న భూపాలపల్లి జిల్లా ఒక్కసారిగా వేడెక్కింది. మావోయిస్టు నక్సల్స్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో కూడా సంచరించడం లేదని చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా అడవులకే పరిమితమయ్యారనుకుంటే చర్ల ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో మళ్లీ కౌంటర్ ప్రకటనలు మొదలయ్యాయి. గత కొన్నేళ్ల నుంచి మావోయిస్టు నక్సల్స్ ఉనికి లేనట్టుగానే ఉంది. ప్రస్తుత ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులు చాపకింద నీరులా ఏజెన్సీ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చారన్న దానికి వారు విడుదల చేసిన ప్రకటనలే నిదర్శనంగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలో ఏజెన్సీ వాసులు వణికిపోతున్నారు.
టార్గెట్ నేతలను పంపించిన పోలీసులు చర్ల ఎన్‌కౌంటర్, పిఎల్‌జిఎ వారోత్సవాల సందర్భంగా నక్సల్స్ ఏరూపంలోనైనా విరుచకపడచ్చనే ఉద్దేశంతో మావోయిస్టులు టార్గెట్ చేసిన నేతలను పోలీసులు స్థానిక గ్రామాల నుంచి సేఫ్టీ గ్రామాలకు తరలించారు. పిఎల్‌జిఎ వారోత్సవాలు ముగిసేంతవరకు ఏజెన్సీ ప్రాంతాల్లో నేతల పర్యటనలు కూడా పోలీస్ అధికారులు నిషేదించారు. ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం, పేరూరు, తుపాకులగూడెం తదితర ఏజెన్సీ గ్రామాలు అన్ని కూడా పోలీసుల గుప్పెట్లోకి వెళ్లాయి. నక్సలైట్లు కూడా అదే ప్రాంతంలో లేఖలను విడుదల చేసి సవాల్ విసిరారు. పిఎల్‌జిఎ అమరవీరుల వారోత్సవాలను ఎక్కడో ఒక చోట జరిపి పోలీసులకు సవాల్ విసిరాలంటూ మావోయిస్టులు ఉన్నట్లు తెలిసింది. ఈ వారోత్సవాలు ముగిసేవరకు సామాన్య ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడిపే పరిస్థితులు దాపురించాయి.

Comments

comments