నేటి అవసరాలకు అనుగుణంగా మన ఉపాధ్యాయులు మారాలి

A teacher needs a change

ప్రస్తుత విద్యార్థులకు అనుగుణంగా మారిన ఆధునిక విద్యావ్యవస్థకు అనుగుణంగా మారని ఉపాధ్యాయుని వలన విద్యాప్రమాణాలు కొంత వరకు తగ్గిపోతున్నాయి. ‘టైమ్స్ ఉన్నత విద్య విశ్వ విద్యాలయాల ప్రపంచ ర్యాంకింగ్స్ (2018)’ తొలి రెండు వందల స్థానాల్లో అత్యధికంగా 77 విద్యా సంస్థలలో అమెరికా, 31 విద్యా సంస్థలలో యుకె అగ్రస్థానాల్లో నిలిచాయి. నెదర్లాండ్స్ 12, జర్మనీ 10, ఫ్రాన్స్ 8 విద్యా సంస్థలలో తరువాతి 3 స్థానాల్లో నిలిచాయి.
ఈ ర్యాంకింగుల్లో ఇండియా నుంచి ఒక్క విద్యా సంస్థకైనా స్థానం దక్కకపోవడం మన ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రమాణాల లేమికి నిదర్శనం. భారతదేశంలో 700 విశ్వ విద్యాలయాలు, 37,000 కళాశాలలు ఉన్నప్పటికీ, 3 కోట్లకు పైగా విద్యార్థులు పేర్లు నమోదు చేసినప్పటికీ, ఒక్క విద్యా సంస్థకైనా స్థానం దక్కలేదు. ఎన్‌సిఇఆర్‌టి దేశ వ్యాప్తగా నిర్వహించిన జాతీయ సాధ్య సర్వేలో 610 జిల్లాల్లో 44,514 పాఠశాలలను గుర్తించి, పదో తరగతి చదువుతున్న 15.44 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేసింది. అన్ని విషయాలలో విద్యార్థుల స్పందనను మదింపు చేశాక, వారి అభ్యాసనం తీరు దారుణంగా ఉందని పేర్కొంది. ప్రత్యేకించి గణితంలో మరీ వెనుకబడి ఉన్నారని స్పష్టీకరించింది.
ఉపాధ్యాయునిలో మార్పు అవసరం
పూర్వ కాలంలో ఉపాధ్యాయుడు విషయ జ్ఞానాన్ని మాత్రమే విద్యార్థులకు అందించేవాడు. అంతేకాకుండా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో అనగా, లెక్చర్ మెథడ్‌లో పాఠం చెప్పేవాడు. విద్యార్థుల స్పందనకు ప్రాధాన్యమిచ్చే వాడు కాదు. ఆ కాలంలో విద్యార్థులు నియమిత ప్రశ్నలకు జవాబులు పాఠ్యపుస్తకంలో నుండి చదివి, బట్టీ పట్టి వ్రాసేవారు. విద్యార్థుల స్మరణ శక్తిని మాత్రమే పరీక్షించి, పరీక్షలలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రమాణాలు నిర్ణయించేవారు. ఆ కాలంలో విద్యార్థుల ఆలోచనాశక్తిని, నిర్ణయాలు తీసుకునే శక్తిని, సృజనాత్మకమైన ఆలోచనలను పరీక్షించేవారు కాదు.
ప్రస్తుత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావడం జరిగింది. ఆధునిక విద్యా విధానం 1986లో అప్పటి ప్రధాని ఆధ్వర్యంలో ‘విద్యార్థి కేంద్రీకృత విద్యావిధానం ద్వారా ప్రాథమిక విద్యను అభివృద్ధి పరచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యపై ఆధునిక విద్యా విధానం 2016 రిపోర్టు ఆధారంగా ఎన్నో మార్పులు సంభవించినవి. ప్రస్తుతం కంటిన్యూయస్ మరియు కారిప్రెహెన్సిల్ మూల్యాంకనం ద్వారా గ్రేడింగ్ విధానం రావడం జరిగినది. ఫార్మేటిల్, సమ్మేటిల్, ప్రాజెక్టు మూల్యాంకనం రావడం జరిగినది.
ఒక విద్యార్థి విషయాన్ని వింటే 20 శాతం మాత్రమే స్మరణలో ఉంటుంది. చూస్తే 30 శాతం స్మరణలో ఉంటుంది, విని, చూస్తే 50 శాతం స్మరణలో ఉంటుంది కాని, విని, చూసి, చేస్తే 80 శాతం విషయంపై స్మరణ, అవగాహన కలుగుతుంది. కావున ఉపాధ్యాయులు విద్యార్థులతో మోడల్స్ చేయించి, ప్రాజెక్టులు చేయించాలి. ఉన్నత విద్యలో విద్యార్థులతో పరిశోధనలు ప్రమాణాలు పాటించి చేయించాలి. ఉపాధ్యాయులు ఏదో మొక్కుబడిగా మార్కులు కేటాయిస్తూ, విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించకుండా, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతిని పాటించకుండా, విద్యార్థిని పాఠ్యాంశంలో నిమగ్నం చేయించకుండా, సిలబస్ పూర్తి చేయడంపైనే దృష్టి పెడుతున్నారు.
విద్యార్థులచే ప్రాజెక్టులు చేయించకుండా , ఉపాధ్యాయులు స్వయంగా చేయడం, లేదా తల్లిదండ్రులచే చేయించడం చేస్తున్నారు. కొంత మంది ఉపాధ్యాయులు ప్రాజెక్టులు చేయించకుండా మార్కులు వేయడం జరుగుచున్నది. ఉన్నత విద్యలో పరిశోధనలు సహితం స్వయంగా విద్యార్థులు చేయకుండా వ్యాపారంగా మారుతుంది.
ఆధునిక విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుని పాత్ర
ఆధునిక విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుడు నిరంతరం నేర్చుకుంటుండాలి. ఆధునిక సామాజిక మార్పులకు అనుగుణంగా మారుతుండాలి. ఆధునిక యుగంలో ఉపాధ్యాయునిపై గురుతరమైన బాధ్యత ఉంది.
ఆధునిక, శాస్త్రీయ, సాంకేతిక అభివృద్ధి కారణంగా మొబైల్, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల, చుట్టూ ఉన్న సమాజం కారణంగా దురలవాట్లు, దుర్వసనాల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. ఇటువంటి ప్రమాదకరమైన నేటి యుగంలో ఉపాధ్యాయునిపైన గురుతర బాధ్యత ఉన్నది. ఆధునిక ఉపాధ్యాయుడు నైతిక విలువలతో కూడిన విద్యను ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఆధునిక ఉపాధ్యాయుడు, విద్యార్థికి ఒక స్నేహితుడుగా, ఒక తత్వవేత్తగా, ఒక మార్గదర్శకునిగా ఉండవలసిన అవసరం ఉన్నది. నైతిక విలువలు కలిగిన, సత్ప్రవర్తన కలిగిన, నైపుణ్యం కలిగిన మంచి భావి భారత పౌరులను తయారు చేయవలసిన బాధ్యత, ఈనాటి ఉపాధ్యాయునిపై ఉన్నది. ప్రభుత్వం ఎన్ని పాలసీలు పెట్టినా ముఖ్యంగా ప్రాథమిక దశలో ఉపాధ్యాయులు మంచి ప్రమాణాలను అభివృద్ధి చేయనంత కాలం విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందదు.
ఉపాధ్యాయులు ఉన్నత ప్రమాణాలను పాటించి, దేశానికి మంచి పౌరులను అందించవలసిన బాధ్యత ఉన్నది. ఉపాధ్యాయుడు తన అలవాట్లలో, తన ఆలోచనా విధానంలో, తన జీవన విధానంలో ఆదర్శంగా ఉండాలి. విద్యార్థికి తన తల్లిదండ్రుల ఎడల, పెద్దల ఎడల భక్తిని, గౌరవాన్ని, బాధ్యతను పెంపొందించవలసిన అవసరం ఉపాధ్యాయునిపై ఉన్నది. నైతిక విలువలు లేకపోవడం వలన సమాజంలో చదువు రాని వారి కంటే చదువుకున్న వారే ఎక్కువ సామాజిక నేరాలు చేయుచున్నారు.
ఉపాధ్యాయులే దేశానికి వెన్నెముక. “దేశ భవిష్యత్ తరగతి గదులలో రూపుదిద్దుకొంటున్నది” అని ఒక మహానుభావుడన్నట్లు దేశాభివృద్ధి ఉపాధ్యాయుని భుజస్కంధాలపై యున్నది. ఉపాధ్యాయుడు విద్యార్థులకు కేవలం చదువునే కాక అనేక సృజనాత్మక కార్యకలాపాలలో శిక్షణనివ్వవలెను. విద్యార్థి పది తరగతులు చదివిన తరువాత ఏ పనిలోనూ శిక్షణ లేక, తనకాళ్లపై తను నిలబడలేక భవిష్యత్‌లో నిరుద్యోగిగా మారుతున్నాడు. ఉపాధ్యాయుడు విద్యార్థుల కనుగుణంగా నూతన విషయాలను బోధిస్తూ నవ భారత నిర్మాణానికి తోడ్పడవలసిన అవసరం ఉన్నది.