నెత్తిమీద పెట్రోమాక్స్ లైట్ ఎత్తుకొని నడుసుడు

పెట్రోమాక్స్ లైట్లు కూడా అందరి ఇండ్లల్ల ఎందుకు తెప్పిస్తరు.  ఉన్నోల్లు పెద్ద పెద్దోల్లు పెండ్లిల్లకు తెప్పించుకుం టరు. రాత్రి పూట వెలిగిస్తే తెల్లని ఎలుగు విరజిమ్మేది దాని సుట్టు పిల్లలు చూసుకుంటు  ఉందురు.

Light

కరెంట్ పుట్టని కాలంల పెట్రోమాక్స్ లైట్లే ఆదారం. ఊర్లల్లకు కరెంట్ అంటె తెల్వని కాలం రాత్రి పెండ్లిలు అయితె పెట్రోమాక్స్ లైట్లు కిరాయికి తెచ్చుకునేది. పెట్రోమాక్స్ లైట్ అంటే ఈ కాలం వాల్లకు అసలే తెలవక పోవచ్చు. ఇది గ్యాస్ నూనెతోని నడుస్తది. కిరోసిన్ ఆయిల్‌తోని నడిచే స్టౌవ్‌లు ఉంటుండె. అట్లనే బత్తులతోని మండే స్టౌవ్‌లు సుత ఉండేది. కిరసనాయిలును గ్యాస్ నూనె అంటరు. కొన్నిచోట్ల గాంచునూనె అని కూడా అంటరు. గ్యాసునూనెను పెట్రోమాక్స్ లైట్‌ల పోసి అందులో పిన్నుతో గాలి కొట్టుతరు. అప్పుడు మీద మెంటల్ అని ఒకటి ఉంటది బట్టతోని చేసిన బుగ్గ లాగ ఉంటది. దానికి గ్యాస్‌నూనె వచ్చి చిన్న చిన్న తుంపర లాగ పడుతది. అప్పుడు అగ్గిపుల్లతోని అంటిస్తే వెలుగు వెలగేది. మంచి వెలుతురే వస్తది. ఇప్పటి కరెంట్ లైట్లతోని పోల్చుకోలేము గాని వీటిని కనీసం సూడని కాలంల అవే మహాగొప్ప.

ఈ పెట్రోమాక్స్ లైట్లు కూడా అందరి ఇండ్లల్ల ఎందుకు తెప్పిస్తరు. ఉన్నోల్లు పెద్ద పెద్దోల్లు పెండ్లిల్లకు తెప్పించుకుంటరు. రాత్రిపూట వెలిగిస్తే తెల్లని ఎలుగు విరజిమ్మేది దాని సుట్టు పిల్లలు చూసుకుంటు ఉందురు. వాటిని ఊర్లల్ల కిరాయిలకు ఇస్తరు. అయితె అందులో ఉండే మెంటల్ కదిలిస్తే కూలిపోతది. ఒకసారి వెలిగిస్తే కదులుతే అది బూడిద అయితది. అప్పుడు మల్ల ఇంకొక మెంటల్ ఎక్కించాలి. ఇందుకు దానిని మెల్లగ పట్టుకొని జరుపుతుండు. పెండ్లిల బరాత్జరిగేటప్పుడు ఈ పెట్రోమాక్స్ లైట్లను పల్లకి ముందట సప్పుల్ల వాల్ల కన్న ముందు మనుషులు నెత్తిమీద రుమాలు కట్టుకొని ఎత్తుకొని నడుస్తుందురు. వాల్లు నడుస్తుంటే కాంతి కదులుతుంటది.

అదొక పెద్ద హల్‌చెల్. ఇదంత ఉన్నాల్ల ముచ్చట. లేనోల్లు అయితే ఇండ్లల్ల పెండ్లి బరాత్‌ల దగ్గర లాంతరులు పట్టుకపోతరు. లాంతరు కూడా గ్యాస్ నూనెతోని వెలుగుతది కాని ఎలుగు తక్కువ వస్తది. అసలు రాత్రి గాక ముందే పనులు పూర్తి అయ్యేది. పెండ్లిల్లు రాత్రి లగ్గం వస్తేనే పెట్రోమాక్స్ లైట్లు అయినా లాంతరులు అయినా వాడుతరు.

లాంతరులు ఇంటింటికి ఉంటయి. పొద్దుగూట్లె పడే మోపుకే లాంతరు తుడిచి శుభ్రం చేసి గ్యాస్ నూనె పోసి గాజు బుగ్గను బూడిదతోని నీళ్లు లేకుండా తోమి తుడిచి ఎక్కిస్తరు. అప్పుడు అంటిస్తే వెలుతురు వస్తది. లాంతరు కన్న చిన్నది ఎక్క దీపం. ఎక్కదీపంల సుత చిన్న బత్తి ఉంటది. గాలికి మలిగి పోకుండ ఓ బుగ్గ ఉంటది. అది ఇండ్లుడ్ల మూడు నాలుగు ఉంటయి. ఆ ఎక్కదీపాల ఎలుగుకు సదువుకున్న వాల్లు ఎందరో ఇప్పుడు యాబైపైన ఏండ్లున్న వారున్నారు. ఎక్కదీపాలు, లాంతర్లు పెండ్లిల్ల పేరంటాలు వస్తే పెట్రోమాక్స్ లైట్లు ఇంక చిన్న చిన్న గుడిసెల్లోనైతె గ్యాస్ నూనెతో వాడి చిన్న గుడ్డదీపం ఉంటది. కొందరి ఇండ్లల్ల మట్టి దీపంతుల కూడా ఉంటయి. అవి దేవుని దగ్గర ముట్టిస్తరు. అండ్ల నువ్వుల నూనె పోసి వత్తి పెట్టి ఎలిగిస్తరు. ఇప్పటికీ ఉన్నది గని మట్టి వాట్ల స్థానంల మాణిక్యాలు వచ్చినయి.

కరెంట్ రాక ముందు పరిస్థితి వేరే ఉండేది. వెలుగు తక్కువే వ్యవసాయానికి కరెంట్ మోటర్లు లేవు అప్పుడు మోటల ద్వారా బాయిలల్ల నీళ్ళు పొలాలకు పారిచ్చేది. ఇంకా మందు రోజుల్లో పెట్రోమాక్స్‌లైట్లు లేనప్పుడు కాగడాలతోని వెలుగురు పొందేది. కాగడ అంటే కట్టెకు బట్టకట్టి దాని మీద నూనె పూసి అంటు పెట్టుతే నిదానంగా మంట దీపం వలె వస్తుంటది. దాని వెలుగుకు పెండ్లి బరాత్‌లు నడుస్తరు. ఇప్పుడు కాంతి విరజిమ్మే లైట్లు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పట్టుగాలల్లు వీది దీపాలు సుత గ్యాస్‌నూనెలోని వెలిగించి పెట్టేవాల్లు. ఆ వెలుగు కిందనే వీదుల్లో నడవడం ఉండేది. పల్లెటూల్లలో వీది దీపాలు ఉండవు. రాత్రి కాంగనే తిని పండుకునుడే మల్ల ఎగిలి కాదంగనే లేసుడే చీకట్టనే ఎవల పనికి వాల్లు నడుస్తుంటిరి.

అన్నవరం దేవేందర్ 94407 63479

Comments

comments