నూరో నెంబర్ చీర !

Magic on a hundred-number saori loom in pedana

మగ్గం మీద మాయాజాలం

మనిషి మనుగడ గురించి వాడుకలో ఉన్న నానుడి. అంటే నాగరకత వెల్లివిరిసిన కాలానికంటే ముందే దుస్తులు ధరించడం నేర్చుకున్నాడు మనిషి. మొదట గొర్రెల ఉన్నితో మొదలైంది. తర్వాత పత్తి, ఇరత నారలతో దుస్తుల తయారీ నేర్చుకున్నాడు మానవుడు. సింధులోయ నాగరకత కాలం నాటికే చక్కగా దుస్తులు ధరించారు. పత్తి నుంచి దారం తీయడం నుంచి దారాన్ని వస్త్రంగా నేయడం వరకు అనేక దశలు రూపొందాయి. దానికంటూ ఒక టెక్నాలజీ డెవలప్ అయింది. నైపుణ్యం తోడయింది. నూలుదారం వస్త్రంగా మారాలంటే… ఎన్ని దశలలో పని జరగాలో చూద్దాం.

కండెలు చుట్టాలి, నూలు వడకాలి, సరిపట్టాలి, రంగు అద్దాలి, అచ్చు అల్లాలి, ఆసు విసరాలి, హల్లు కట్టాలి. ఇవన్నీమగ్గాన్ని చేరేలోపు జరగాల్సిన పనులు. ఈ దశలు పూర్తయిన తర్వాత మగ్గం మీద వస్త్రాన్ని నేయాలి. ఒక వ్యక్తి రోజంతా మగ్గం మీద కష్టపడితే ఒక నేత చీర తయారవుతుంది. మగ్గాన్ని చేరకముందు దశలన్నీ ఇంట్లో ఆడవాళ్లు, పిల్లలు, వయసు మళ్లిన వాళ్లు చేస్తుంటారు. ఇలా చేనేత అనేది కుటీర పరిశ్రమగా రూపొందింది. ఇంటిల్లిపాదీ పనులు చేయడం తప్పనిసరి కావడంతో పిల్లలకు చిన్నప్పుడే ఈ పనులన్నీ ఒంటపట్టేవి. యుక్తవయసుకొచ్చే సరికి పనిలో మెళకువలు నేర్చుకునేవారు. అలా ఒక తరం తర్వాత మరొక తరం… అందుకుంటూ ఉండేది. కులవ్రుత్తిగా మారిపోయింది. కులవ్రుత్తిలో ఉన్న ఒక సౌకర్యం ఏమిటంటే… దానిని ఒక కోర్సుగా చదవాల్సిన అవసరం లేకుండానే పనితనంలో నైపుణ్యం సాధించగలిగేవాళ్లు. ఆ భరోసాతోనే 50 ఏళ్ల కిందటి వరకు కూడా కులవ్రుత్తిని నమ్ముకుంటే బతుకు కు ఢోకా ఉండదనే వాళ్లు పెద్దవాళ్లు. ఈ పనులు చేయడానికి పిల్లలు విముఖత చూపినా కూడా పట్టుబట్టి నేర్పించేవాళ్లు. చేతిలో పని ఉంటే అదే అన్నం పెడుతుందనే నమ్మకం అప్పట్లో. పిల్లల్ని బడికి పంపించి చదివిస్తూ కూడా సాయంత్రాలు రెండు గంటల సేపయినా సరే నేత పనులు చేయించేవాళ్లు తల్లిదండ్రులు. ఇప్పుడలా పని నేర్పిస్తున్న తల్లిదండ్రుల కోసం దుర్భిణీ వేసి వెతకాల్సి వస్తోందంటున్నారు చేనేత కుటుంబానికి చెందిన సీనియర్ జర్నలిస్టు నందం రామారావుగారు. ఆయన జ్ఞాపకాలను ఇలా పంచుకున్నారు.

పెడనలో దాదాపుగా అన్నీ చేనేత కుటుంబాలే. పెడన చుట్టు పక్కల కూడా చాలా గ్రామాల్లో చేనేతకారులుండేవారు. మా నాన్న దగ్గర నూలు తీసుకెళ్లి చీరలు నేసుకొచ్చేవారు. చీరలు, పంచెలు, లుంగీలు, దుప్పట్లు, తువాళ్లు… ప్రధానంగా ఉండేవి. ఒక చీర నేయడానికి రెండు రోజులు పట్టేదప్పట్లో. ఎందుకంటే నూలుని బాగా మగ్గబెట్టేవారు. దాంతో వస్త్రాన్ని నేసిన తర్వాత పైన నీరు పోసినా కిందకు జారనంత చిక్కగా నేసేవారు. దాంతో రెండు రోజులు పట్టేది. అప్పట్లో 80 బై 80 కౌంట్ చీరలు, 80 బై 60 చీరలతోపాటు 40 కౌంట్, 60 కౌంట్ చీరలు కూడా నేసేవారు. 40, 60 కౌంట్ చీరలను పల్లెల్లో కాయకష్టం చేసుకునే వాళ్లు ధరించేవారు. అవి కొంచెం మందంగా ఉండి ఎక్కువ కాలం నిలిచేవి. 80 బై 80 చీరలు, నూరో నంబర్ చీరలు సంపన్న వర్గాల మహిళలు ధరించేవారు. అవి చాలా సున్నితంగా కళాత్మకంగా ఉండేవి. ఇప్పుడు 100 కౌంట్ చీర నేసే వాళ్లే లేకుండా పోయారు. ఎందుకు లేకుండా పోయారంటే ఆ చీరలను నేసినా కొనేవాళ్లు ఎందరు? ధర ఎక్కువగా ఉంటుంది మరి. దాంతో ఆ పనితనమే కనుమరుగవుతోంది.

వెంకటగిరిలో నేసే నేతను చల్లా నేత అంటారు. దారం పోగుకి పోగుకి మధ్య కొద్దిగా గ్యాప్ ఉంటుంది. దాంతో ఆ నేతకు నూలు ఖర్చు తక్కువ. కడప జిల్లా పుల్లం పేట ఒకప్పుడు చేనేత దుస్తులకు చాలా ప్రసిద్ధి. వాళ్లు ఇప్పుడు దాదాపుగా మానేశారనే చెప్పాలి. మాధవరంలో 80 బై 80 జరీ చీరలు నేసేవాళ్లు. జరీ చీరలకు పేటెంట్ వాళ్లదే అన్నట్లు ఉండేవవి.

చేనేతలో ఇప్పుడు రోజుకు ఒక చీర నేయగలుగుతున్నారు. అదే పవర్లూమ్ మీద రోజుకి కనీసంగా 15 చీరలు తయారవుతాయి. రంగులు కూడా కంటికి ఇంపుగా కనిపిస్తాయి. చేనేత చీర ఆరు వందలుంటే పవర్లూమ్ చీర నాలుగు వందలకే వస్తుంది. *మన్నిక ఎవరికి కావాలి, చూడడానికి బాగుంటే చాల*నే ధోరణి కూడా ఈ తరంలో ఎక్కువైంది. పవర్లూమ్ చీరల వైపు మొగ్గుతున్న మాట నిజమే. ఉపాధి పరంగా చూస్తే పవర్లూమ్ కారణంగా చేనేతకారుల కుటుంబాలకు కొంత వెసులుబాటు ఉంటున్న మాట వాస్తవమే. అయితే చేనేతలోని మనదైన నైపుణ్యం అంతరించి పోతుందేమోననేదే బెంగ.

సింథటిక్ వెల్లువ
సింథటిక్ వస్త్రాలు పరిచయమైన కొత్తల్లో ఆ కొత్తదనం సమాజాన్ని మాయ చేసేసింది. చేనేత వస్త్రాలంటే వయసు మళ్లినవాళ్ల దుస్తులనే ముద్ర కూడా నాటుకుపోయింది. చేనేతకు చీకటి యుగం అంటే అదే. చేనేత కారుల ద్రుష్టి కొత్త ఉపాధి మార్గాల మీదకు మళ్లింది కూడా అప్పుడే. కులవ్రుత్తినే నమ్ముకున్న కుటుంబాలు కుదేలైన కాలమూ అదే. ఆ చేదు అనుభవాల నుంచి కొత్త తరం కొత్త ఉపాధి మార్గాలను వెతుక్కుంటూ గ్రామాలు దాటింది, తర్వాత రాష్ట్రాలు, దేశాలు, ఇప్పుడు ఖండాలు కూడా దాటి సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్లుగా రాణిస్తున్నారు. ఈ రంగంలో కొనసాగడానికి పెద్దగా ముందుకు రావడం లేదు కొత్త తరం. పిల్లలకు పని నేర్పించడానికే భయపడుతున్నారు తల్లిదండ్రులు.

ఎలాగంటే… ఇంట్లో అందరూ పని చేస్తే… నెలకు ఐదారు వేలు గిట్టుబాటవుతాయి. పిల్లల చదువుల నుంచి అన్ని ఖర్చులూ అందులోనే. అదే ఒక మనిషి ఇతర కూలిపనులకు పోతే రోజుకు నాలుగు వందలు వస్తున్నాయి. భవన నిర్మాణరంగం విస్త్రుతమవడంతో ఏడాది మొత్తం పనులు ఉంటున్నాయి. దాంతో ఒక మగమనిషి కూలికి పోతే నెలకు పది వేలు సంపాదిస్తున్నాడు. ఇందులో దారం కొనడం, మగ్గం రిపేర్లు, ఇతర పనిముట్ల నిర్వహణ వంటి ఖర్చులేవీ లేకుండా నికరంగా పదివేలు మిగులుతాయి. ఇంట్లో ఆడవాళ్లు మరేదయినా పని చేసుకుంటే ఆ కుటుంబం హాయిగా జీవించగలుగుతోంది. పిల్లల్ని చదివించగలమనే ధైర్యం కూడా వస్తోంది. దాంతో దీని మీద పూర్తిగా ఆధారపడే ధైర్యం చేయలేకపోతున్నారు. మగవాళ్లు పెయింటింగ్ వంటి పనులకు వెళ్తుంటే… కులవ్రుత్తిని వదల్లేక ఆడవాళ్లు కొనసాగిస్తున్నారు. చేనేత కారుల కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షలన్నాయి. ఇంతమందికి పని కల్పించడం అంటే ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. ప్రభుత్వం చేయగలిగింది కొంతవరకు అండగా నిలబడడం మాత్రమే.

కులవృత్తిలో పుస్తకాలుండవు, పాఠాలుండవు. థియరీ చెప్పే టీచర్లుండరు. మొత్తం ప్రాక్టికల్సే. పని నేర్చుకుంటూ తెలుసుకోవడం, తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టి నైపుణ్యం సాధించడమే. అలా ప్రతి ఇల్లు ఒక కోర్సును బోధించే యూనివర్శిటీకి మీనియేచర్ రూపమే అవుతుంది. కులవ్రుత్తి రూపుమాసి పోతే ఇవే అంశాలను పుస్తకాల్లో పాఠాలుగా చదవాల్సి వస్తుంది. చదివిన తర్వాత ప్రాక్టికల్స్ చేయాలి. అంటే అప్పుడు చేనేత మగ్గం మీద వస్త్రాన్నినేయడం అనేది విశ్వవిద్యాలయాల్లో బోధనాంశంగా మారుతుంది.

                                                                                                                                                                     – మంజీర