నువ్వా.. నేనా?

క్రమశిక్షణ మరిచిన హస్తం పార్టీ నేతలు అధిష్టాన దూత ఎదుటే దూషణలు, పిడి గుద్దుల దాడులు రాజుకున్న అంతర్గత విభేదాలు బట్టబయలు నేతల సమన్వయ లోపంతోనే బజారు పాలైన కాంగ్రెస్ పార్టీ పరువు మన తెలంగాణ/మెదక్ : నియోజకవర్గంలో తమదే పెత్తనం కావాలనుకునేవారు ఒకరు.. ఈసారి ఎలాగైనా తనకే పార్టీ సీటు దక్కాలనే ఆకాంక్షతో మరొకరు. ఇలా ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తీరు నెలకొంది. శనివారం నాడు జిల్లా కేంద్రంలో […]

క్రమశిక్షణ మరిచిన హస్తం పార్టీ నేతలు
అధిష్టాన దూత ఎదుటే దూషణలు, పిడి గుద్దుల దాడులు
రాజుకున్న అంతర్గత విభేదాలు బట్టబయలు
నేతల సమన్వయ లోపంతోనే బజారు పాలైన కాంగ్రెస్ పార్టీ పరువు

మన తెలంగాణ/మెదక్ : నియోజకవర్గంలో తమదే పెత్తనం కావాలనుకునేవారు ఒకరు.. ఈసారి ఎలాగైనా తనకే పార్టీ సీటు దక్కాలనే ఆకాంక్షతో మరొకరు. ఇలా ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తీరు నెలకొంది. శనివారం నాడు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలు విచక్షణను కోల్పోయి బహిరంగంగానే ఒకరిపై మరొకరు దూషించుకుంటూ పిడిగుద్దుల దాడులకు పాల్పడ్డారు. ఇదంతా ముఖ్య అతిథిగా విచ్చేసిన టిపిసీసీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జి కోఆర్డినేటర్ నగేష్‌ముదిరాజ్ ముందే జరిగింది. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో రాజుకుంటున్న అంతర్గత విభేదాలు ఈ సమావేశం ద్వారా బహిర్గతమయ్యాయి. మెదక్ నియోజకవర్గంలోని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాలుగైదు వర్గాలుగా చీలిపోయింది. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా ఎక్కడి వారక్కడె తమ వర్గం కార్యకర్తలను పిలుచుకొని విడివిడిగా జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో పార్టీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై రాజుకున్న రగడ తారాస్థాయికి చేరుకొని ఎవరిని అడిగి అధ్యక్షుల నియామకం చేశారంటూ విచ్చేసిన అధికార ప్రతినిధి నగేష్‌ముదిరాజ్‌పై మిగతా వర్గాల నాయకులు, కార్యకర్తలు నిలదీశారు. స్థానిక నాయకుల, కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరించకుండానే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక చేయడం తాము ఓప్పుకోమని బీష్మించుకున్నారు. ఈ విషయంలో కొందరు సీనియర్ నాయకులు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ సద్దుమనుగలేదు. సభా మధ్యలో ఒక వర్గం వారు దాదాపు వంద వరకు విచ్చేసి అధిష్టాన నాయకున్ని నిలదీయడంతో పాటు అప్పటికే అక్కడున్న మరో రెండుమూడు వర్గాల కార్యకర్తలు కూడా వారికి వంతుపాడి అధ్యక్షుల ఎన్నికపై రచ్చ చేశారు. గతంలో టిఆర్‌ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్‌లో చేరిన వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఎన్నో సంత్సరాలుగా పార్టీనే నమ్ముకున్న వారికి సముచిత స్థానం దక్కపోవడంతోనే పార్టీ దినదినం బలహీనపడుతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఇరువర్గాల వారిని శాంతింపజేసి కార్యకర్తలందరు కలిసికట్టుగా ఉండి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే దిశగా పనిచేయాలని టిపిసీసీ అధికార ప్రతినిధి నగేష్‌ముదిరాజ్ పిలుపునిచ్చారు.

పార్టీ బలోపేతానికి అందరు కృషి చేయాలి
ముఖ్య అతిథిగా విచ్చేసిన టిపిసీసీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జి కోఆర్డినేటర్ నగేష్‌ముదిరాజ్ విలేకరులతో మాట్లాడుతూ… రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన శక్తి యాప్ ద్వారా ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ సమాచారం చేరవేసే ఉద్దేశ్యంతోనే ఈ యాప్‌ను నెలకొల్పినట్లు తెలిపారు. నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలను పక్కనబెట్టి పార్టీ బలోపేతానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లి 2019లో అధికారంలోకి రావడమే లక్షంగా పనిచేయాలని సూచించారు.
స్థానికులకే టికెట్టు దక్కుతుందని, ఎవరికి టికెట్టు దక్కినా అన్ని వర్గాల వారు ఏకమై కాంగ్రెస్ పార్టీ గెలుపేలక్షంగా పనిచేసి నియోజకవర్గ గెలుపును కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీకి బహుమానంగా ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నాయకులు కంఠంరెడ్డి తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, బట్టి జగపతి, కొండన్ సురేందర్‌గౌడ్, మేడి మధుసూదన్, శ్యాంసుందర్, మామిండ్ల ఆంజనేయులు, మంగ మోహన్, గూడురి క్రిష్ణ, అమరసేనారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నర్సింలుగౌడ్‌తో పాటు పలువురు మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Stories: