నీ కాళ్ళు మోక్కుతా…కలెక్టర్ సారూ

నా భూమి నాకు ఇప్పించండి వృద్ధురాలి వేడుకోలు  మన తెలంగాణ/చర్ల : యాభై ఏళ్ల నుంచి కాయ కష్టం చేసి తినీ, తినక భూమిని బాగు చేసుకుని జీవనం సాగిస్తున్న ఓ దళిత కుటుంబం అది. భర్త చనిపోగా వృద్ధాప్యంలో తమకు జీవనాధారంగా ఉన్న 70 సెంట్ల వరి పొలాన్ని కాకులు, గద్దలు వచ్చి తన్నుకు పోయిన చందంగా పొలం ఆక్రమించుకుని గుడిసెలు వేయడంతో 80 ఏళ్ల వయస్సులో ఏమి చేయాలో తెలియక బీరరమణమ్మ అనే ముదుసలి […]

నా భూమి నాకు ఇప్పించండి
వృద్ధురాలి వేడుకోలు 

మన తెలంగాణ/చర్ల : యాభై ఏళ్ల నుంచి కాయ కష్టం చేసి తినీ, తినక భూమిని బాగు చేసుకుని జీవనం సాగిస్తున్న ఓ దళిత కుటుంబం అది. భర్త చనిపోగా వృద్ధాప్యంలో తమకు జీవనాధారంగా ఉన్న 70 సెంట్ల వరి పొలాన్ని కాకులు, గద్దలు వచ్చి తన్నుకు పోయిన చందంగా పొలం ఆక్రమించుకుని గుడిసెలు వేయడంతో 80 ఏళ్ల వయస్సులో ఏమి చేయాలో తెలియక బీరరమణమ్మ అనే ముదుసలి ‘మన తెలంగాణ’కు గోడు వినిపించుకుంది. తన కుటుంబానికి 50 ఏళ్ల నుండి పట్టాలు ఉన్న భూమిని కొందరు గిరిజనులు ఇటీవల ఆక్రమించడంతో తహసీల్దార్‌కు ఫిర్యా దు చేసింది. అయినప్పటికీ న్యాయం జరగక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తోంది. జిల్లా కలెక్టర్ సారూ… మీ కాళ్లు మొక్కుతా నా భూమి నాకు ఇప్పించాలని వేడుకుంటోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, చర్ల మండల పరిధిలోని విజయకాలనీకి చెందిన బీరా నారాయణ దాసు కుటుంబానికి కొయ్యూరు గ్రామంలో పట్టా నెం.63లో 93 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. నారాయణ దాసు, రమణమ్మ దంపతులు కాయకష్టం తో దానిని బాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కాలక్రమేణా సుందరయ్య కాలనీకి వేసిన రహదారిలో తన పొలంలో నుండి కొంత భాగం పోగా 70 సెంట్ల భూమి మాత్రమే మిగిలింది. తన పొలంలో రహదారి ఎందుకు వేశారు. నష్ట పరిహారం వస్తుందా … రాదా అనే విషయం కూడా తెలియని అమాయకత్వం ఆ కుటుంబానిది. మిగిలిన 70 సెంట్ల వరి పొలాన్ని కౌలుకు ఇచ్చి ఆ కౌలు గింజలతోనే జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది ఆ వరి పొలాన్ని కొందరు స్వార్థ పరులు ఆక్రమించుకుని గుడిసెలు వేయడంతో ఆ కుటుంబం దిక్కు తోచని పరిస్థితిలో ఉంది. ఇంటి పెద్ద నారాయణ దాసు కూడా కాలం చేయడం, కన్న కొడుకు పట్టించుకోక పోవడంతో  వృద్ధ మహిళ తన కూతుర్ని తోడుగా పెట్టుకుని రోజూ తినీ తినక జీవనం సాగిస్తోంది. ఏన్నో ఏళ్లుగా  ఉన్న తమ పట్టా భూమిని ప్రభుత్వ భూమి అంటున్నారని, తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కావాలని మోసం చేశారని బాధిత వృద్ధ మహిళ బోరున విలిపిస్తూ వాపోయింది. తాము దళితులమని, తమకు వృద్ధాప్యంలో తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యమంత్రి కెసిఆర్, జిల్లా కలెక్టర్ తనకు న్యాయం చేయాలని రమణమ్మ వేడుకుంటోంది.

Related Stories: