నిర్ధిష్టమైన లక్ష్యంతో శ్రమిస్తే విజయం తథ్యం

Success if you work with a specific goal

మనతెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిథి : నిరుద్యోగ యువతీ, యువకులు నిర్ధిష్టమైన లక్షాన్ని ఎంచుకుని నిరంతరం శ్రమిస్తే విజయం తధ్యమని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. గురువారం మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, విఆర్‌ఓ, కానిస్టేబుల్ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ,యువకులకు నెల రోజులపాటు ఉచిత శిక్షణ శిభిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ ఉన్నత చదువులు పేదరికానికి అడ్డుకాదని, విద్యారంగ అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వ ఉద్యోగానికి చాలా డిమాండ్ ఉందని ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే అన్ని అంశాలపై పూర్తి అవగాహన, పట్టు సాధించాలని, ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తేనే లక్షాన్ని చేరుకుంటారని కలెక్టర్ సూచించారు. శిక్షణ సమయంలో సెల్‌ఫోన్, ఇతర వ్యాపకాలు ప్రక్కన పెట్టి కేవలం ఉద్యోగ సాధనపై దృష్టి సారించాలన్నారు. విద్యార్ధికి ఇంటర్ దశ చాలా కీలకమైందని, ఈ దశలో ఉత్తీర్ణులైతే భవిష్యత్తులో ఆర్ధికంగా నిలదొక్కుకోవచ్చని అన్నారు. పోటీ పరీక్షల సిలబస్‌ను నూరుశాతం చదివే అభ్యర్ధులకు ఏ కోచింగ్ అవసరం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ శిక్షణా శిభిరాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సత్యప్రియ, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారిణి సిహెచ్ ఇందిరాదేవి, ఎస్‌సి సంక్షేమ అధికారి రాజు, డిపిఆర్‌ఓ అయ్యూబ్ అలీ, డిగ్రీ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ సంధ్యారాని, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments