నిరుద్యోగికి ఆహారోద్యోగం!

Youth get Opportunities with Online Food Delivery Services

ఉద్యోగాలు లేవని సర్కారును నిందించడం లేదు. ఉపాధి చూపలేదని ప్రభుత్వంపై అపవాదులు వేయడం లేదు. యువత స్వయంకృషితో ముందుకు సాగుతోంది. నిరుద్యోగంతో సతమతమౌతున్న యువత ఆహారోద్యోగంతో బిజీగా ఉన్నారు. ఆన్‌లైన్‌లో తినుబండారాలను చేరవేస్తూ నెలకు రూ.20 నుంచి రూ.౩౦ వేలకు పైగా ఆర్జిస్తున్నారు.

నగరంలో జీవితం యాంత్రికంగా మారింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలతో బిజీబిజీగా ఉండటంతో ఇంట్లో ప్రత్యేక వంటలు చేసుకునే పరిస్థితి లేదు. దీంతో ఆన్‌లైన్‌లో ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్ చేస్తూ ఎంచక్కా ఆరగించేస్తున్నారు. అనుకోని అతిథి ఇంటికి వచ్చినా వారు కోరిన వంటను చేయలేకపోయినా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు. నిమిషాల్లో కోరిన ఫుడ్డు ఇంటికే వస్తుండటంతో ఆన్‌లైన్ వ్యాపారాలకు గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జంట నగరాల్లో ప్రముఖ హోటళ్లన్నీ కిటకిట లాడుతున్నాయి. టిఫిన్స్, మీల్స్, స్నాక్స్, స్వీట్స్, డిన్నర్ వరకు అన్ని రకాల ఆహార పదార్థాలను పార్సిల్ ద్వారా కష్టమర్లకు అందిస్తూ, ఆదరాభిమానాలు చూరగొంటున్నాయి కొన్ని ఫుడ్ సంస్థలు. కాగా ఆన్‌లైన్ వ్యాపారంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 20 వేల మంది పైచిలుకు నిరుద్యోగ యువకులు ఉపాధి పొందుతున్నట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్ రంగంలో బడా కంపెనీలు: ఆన్‌లైన ద్వారా ఆహార పదార్థాలు అందించే పద్ధతిని తొలుత ఎంఎన్‌సి కంపెనీ స్విగ్గీ ప్రారంభించింది. అనంతరం జుమాటో ఆన్‌లైన్ ఫుడ్ సప్లై రంగంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఉబెర్ ఈట్స్ రాకతో పోటీ పెరిగింది. అనతికాలంలో జియో సైతం ఆన్‌లైన్ లో అడుగుపెట్టనుంది. గతంలో 2 కంపెనీలు ఉండగా పోటీ అంతగా ఉండేది కాదని, రానున్న కాలంలో రియలన్స్ జియో రానుండటంతో పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ పేర్కొంటున్నారు.

బంపర్ ఆఫర్లు: పుడ్ సప్లై చేసే సంస్థలు యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. డిన్నర్, టిఫిన్ సమయాల్లో పనిచేసే సిబ్బందికి అదనపు మొత్తాలు ఇస్తూ తమ వ్యాపారాలను పెంచుకుంటున్నాయి. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు, అలాగే రాత్రి 7 నుంచి రాత్రి 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేవారికి గంటకు రూ.100 చొప్పున మొత్తాలు చెల్లిస్తున్నారు. 6గంటల పాటు ఎటువంటి ఆర్డర్ లేకున్నా సదరు బాయ్‌కి రూ.600 చెల్లిస్తామని ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రస్తుతం ఉబెర్ సంస్థ పీక్ అవర్స్‌లో అందుబాటులో ఉండే డెలివరీ బాయ్స్‌కు గంటకు రూ.100 ప్రకారం ఇస్తామంటూ ఆఫర్ ప్రకటించింది. డెలివరీ చేయా ల్సిన ప్రాంతాన్ని బట్టీ సంస్థలు మొత్తాలను కేటాయిస్తాయి. ఈ క్రమంలో ఒక కిలోమీటర్ అదనంగా పెరిగితే అందుకు సంబంధించి కిలోమీటర్‌కు రూ.8 అదనంగా చెల్లిస్తా యి. ప్రతీవారం డె లివరీ బాయ్స్‌కు సం బంధించిన మొ త్తాలు వారి బ్యాంక్ అకౌంట్లలో పడిపోతుంటాయి.

డెలివరీ బాయ్ అర్హతలు: ఇంటర్ మీడియట్ చదివి ఓ స్మార్ట్‌ఫోన్, ద్విచక్ర వాహనం, ఆర్‌సి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ ఉంటే చాలు డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం వచ్చినట్లే. రహదారులపై అవగాహన ఉంటే మరీ మంచిది. రూ.1000 డిపాజిట్ చేస్తే సదరు డెలివరీ బాయ్‌కి ఆ సంస్థ పేరుతో టీ షర్ట్, డెలివరీ బ్యాగ్ అందజేస్తారు. బాయ్స్‌కు ఏదేనీ ప్రమాదం సంభవిస్తే వారి కుటుంబాలను ప్రమాద బీమా కల్పిస్తారు.

ప్రముఖ హోటళ్లు కిటకిట: నగరంలోని ప్రముఖ హోటళ్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్లను అందించడంలో బిజీబిజీగా మారాయి. కొన్ని హోటళ్లలో ఫుడ్ పార్సిల్స్ కోసం ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బావర్చి, ఆస్ట్రో తదితర హోటళ్లు పార్సిల్ సర్వీసులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో బిర్యానీ తదితర వాటిపై ధరలు సైతం తగ్గించారు. జంబో బిర్యాని ధర రూ.400 ఉండగా, ఆన్‌లైన్‌లో ఆర్దర్ ఇచ్చిన వారికి కేవలం రూ.240కే ఇస్తుండటం గమనార్హం. అయితే మిగిలిన మొత్తాలను సైతం కంపెనీలు ఆయా హోటళ్ల వారికి చెల్లిస్తున్నారు.

చాలా బాగుంది: ఇదివరలో నెలకు రూ.౩౦ నుంచి రూ.40 వేల వరకు సంపాదించే వాడిని. ఆన్‌లైన్ వ్యాపారంలో పెరిగిన పోటీ వల్ల కొంత మేర ఆదాయం తగ్గింది. రోజుకు కనీసం 8నుంచి 9గంటల పాటు కష్టపడితే నెలకు కనీసం రూ.30వేలకు పైగానే సంపాదిం చుకోవచ్చు. -మీర్జా

– నాగ శ్రీధర్ శర్మ, మన తెలంగాణ ప్రతినిధి
ఫొటోః బాష