నిబంధనలు పాటించాల్సిందే!

 సినిమా హాళ్లల్లో గరిష్ఠ ధరలకే విక్రయాలు నేడు ఎమ్మార్పీ విధానం అమలుపై తనిఖీలకు సిద్ధమవుతున్న అధికారులు మనతెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో : ఎంఆర్‌పీకే తినుబండారాలు విక్రయించాలని తూనికలు, కొలతల శాఖ అధికారులు జారీ చేసిన ఆదేశాలతో నగరంలోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్ నిర్వాహకులు అలర్ట్ అయ్యారు. దీంతో క్యాంటీన్లలో ధరల సూచిక బోర్డులు ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే శీతల పానీయాలు, తినుబండారాలు, పాప్‌కార్న్ ఇతర కొన్ని ఆహార పదార్థాలను గరిష్ఠ చిల్లర ధరలకే విక్రయిస్తున్నారు. […]

 సినిమా హాళ్లల్లో గరిష్ఠ ధరలకే విక్రయాలు
నేడు ఎమ్మార్పీ విధానం అమలుపై
తనిఖీలకు సిద్ధమవుతున్న అధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో : ఎంఆర్‌పీకే తినుబండారాలు విక్రయించాలని తూనికలు, కొలతల శాఖ అధికారులు జారీ చేసిన ఆదేశాలతో నగరంలోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్ నిర్వాహకులు అలర్ట్ అయ్యారు. దీంతో క్యాంటీన్లలో ధరల సూచిక బోర్డులు ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే శీతల పానీయాలు, తినుబండారాలు, పాప్‌కార్న్ ఇతర కొన్ని ఆహార పదార్థాలను గరిష్ఠ చిల్లర ధరలకే విక్రయిస్తున్నారు. ఈ ఎంఆర్‌పీ అమలు విధానం నగరంలోని కొన్ని ప్రధాన మల్టీప్లెక్సులు, థియేటర్లలో మాత్రమే అమలవుతోంది. కానీ శివారు ప్రాంతాలు, మారు మూల ప్రాంతాల్లో ఉన్న థియేటర్లలో ఈ నిబంధనలు సరిగా అమలు కావడంలేదని సినీ ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు.కాగా కొత్త నిబంధనల అమలుపై నేడు, రేపు గ్రేటర్ హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలోనూ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. అయితే జూలై 29న థియేటర్ యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆగస్టు 1 నుంచి గరిష్ఠ చిల్లర ధరల విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందేనని తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ ఆదేశాలను జారీ చేశారు. అయితే ఈ నిబంధనలు సరిగా అమలవుతున్నాయా? లేదా? అనే విషయంపై సంబంధిత శాఖ అధికారులు దాడులకు సన్నద్ధం అవుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటి సారి కేసు నమోదు చేసి రూ.25వేల జరిమానా కట్టాలి. రెండవ సారి ఉల్లంఘిస్తే రూ.50 వేలు జరిమానా, మూడవ సారి లక్ష రూపాయలతో జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. గతంలో ఈ నిబంధనలు ఉన్నా థియేటర్స్ నిర్వాహకులు పాటించకపోయేది. దీంతో వినోదం కోసం సినిమా చూడటానికి వెళ్లే ప్రేక్షకుడు అధిక ధరలతో తన జేబులు చిల్లు చేసుకునేవాడు. 30 రూపాయలు ఉండే శీతల పానీయం 300 రూపాయలకు, ఇరువై రూపాయలకు వచ్చే పాప్‌కార్న్..150 రూపాయలకు అమ్మి అందినకాడల్లా దోచుకునే వారు. వీటిపైన ఫిర్యాదులు ప్రేక్షకుల నుంచి అధికంగా వెళ్లడంతో ఆదిశగా అదికారులు కొరఢా ఝుళిపిస్తుండటంతో నిర్వాహకులు జాగ్రత్తలు వహిస్తున్నారు. గతంలో ఎమ్మార్పీ ధరల కంటే రూ.10 నుంచి 30 వరకు అధికంగా తీసుకునేది. అదే మల్టీప్లెక్సుల్లో అయితే నాలుగైదు రెట్లు ఎక్కువగా తీసుకునే వారు. దిల్‌సుఖ్ నగర్‌లోని ఒక ప్రధాన థియేటర్‌లో ధరల సూచిక బోర్డులో తినుబండారాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఒక వాటర్ బాటిళ్ రూ.25, 300 ఎంఎల్ శీతల పానీయం రూ.30, చిప్స్(45గ్రా) రూ.20, ఎగ్‌పఫ్ ఒకటి రూ.20, కాఫీ 75ఎంఎల్ రూ.20. అదే ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఒక ప్రధాన థియేటర్‌లో ఏర్పాటు చేసిన సూచిక బోర్డులో ఒక మంచి నీటి బాటిల్ రూ.20, చిప్స్ ప్యాకెట్ రూ.20, ఒక బిస్కెట్ ప్యాకెట్ రూ.20 ఉంది. అలాగే మరొక సినిమా హాల్లో కప్పు టీ రూ.10, చిప్స్ పాకెట్ రూ.30, పాప్‌కార్న్ రూ.25లకు విక్రయిస్తున్నారు.

Related Stories: