నిన్న కాలం మొన్న కాలం

అప్పుడప్పుడూ వుదయం వుదయమే యేదో వొక పాట మనతో పాటు మేలుకొంటుంది. అసలాపాట మనలోకి యెలా వస్తుందో!!! మనం ఆదమరచి నిద్రపోతున్నప్పుడు మనం తీసుకొనే వూపిరితో పాటు మనలోకి వచ్చేస్తుందా ప్రేమగా… మనకి తెలివి రాగానే చటుక్కున ‘గుడ్ మార్నింగ్’ అంటూ మనలోకి వచ్చిన ఆ పాట మనతో ఆ రోజంతా తిరిగుతూనే వుంటుంది. అలా యీ రోజు వుదయమే నన్ను విష్ చేసిన పాట ‘కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం […]

అప్పుడప్పుడూ వుదయం వుదయమే యేదో వొక పాట మనతో పాటు మేలుకొంటుంది. అసలాపాట మనలోకి యెలా వస్తుందో!!! మనం ఆదమరచి నిద్రపోతున్నప్పుడు మనం తీసుకొనే వూపిరితో పాటు మనలోకి వచ్చేస్తుందా ప్రేమగా… మనకి తెలివి రాగానే చటుక్కున ‘గుడ్ మార్నింగ్’ అంటూ మనలోకి వచ్చిన ఆ పాట మనతో ఆ రోజంతా తిరిగుతూనే వుంటుంది.
అలా యీ రోజు వుదయమే నన్ను విష్ చేసిన పాట ‘కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి’ భలే పాట… ట్యూన్ అందులోని సాహిత్యం… అడివి సంపెంగలు విచ్చుకొనే వేళ వో వసంతపు జల్లు కురిసినప్పుడు అడివిఅడివంతా ఆ తీయని సౌరభం గాలిలో తేలిఆడుతూ అలాఅలా లోగిలిలోగిలిని విజిట్ చేస్తూ తీయగా మన హృదయపు లోగిలిని చుట్టుకొనే కమ్మని సుగంధం యీ ట్యూన్.
మన రోజంతా పరస్పర ప్రతిధ్వనులు కాగా… నిజంగానే వొక్కోసారి జీవితం యెందుకంత alien అయిపోతుంది మనలో చాలమందికి. యే చిన్ని అనుభవం మనది కాకుండా. రోజంతా గింజుకులాడటమే అయినప్పుడు మరొకరి జీవితంలో, మనసులో యేదో వొక స్థానం వహించాలనే తాపత్రం యెందుకో… యీ మొత్తంలో మనలోకి మనం యేమిటి… రోజు వెంట రోజు వొకేలా పరిగెడుతున్నప్పుడు మనకి మనం యేమిటో కూడా తొంగి చూసుకోవాలనే ఆకాంక్షా కుతూహలం మనలో వున్నాయో లేదో కూడా పట్టించుకొనే చోటు మనసుకి యివ్వకుండా వుదయం లేచినప్పటి నుంచి రవ్వంత తీరిక లేకుండా పరిగె డుతుంటాం… ముఖ్యంగా నగరాల్లో సమయం చాలసార్లు కిక్కిరిసిన ట్రాఫిక్ లోనే సాగిపోతుంటుంది. యింటి కిటికీ రెక్కలు తీయడానికే వొక్కోచోట వీలులేని రద్దీ జీవితం… రోజంతా శ్రమ… శ్రమ… శ్రమా… శ్రమ పాడేవాళ్ళ కి వొట్టి చేతినేప్పుడూ చూపించదీ నగరం… గుప్పెట నిండుగా సంపదని నింపుతుంది… కొంగు నిండుగా జీవిత భరోసాన్ని స్తుంది. అందికే పల్లెని కరువు, పట్టణాన్ని నిరుద్యోగంతో కర్కసంగా కమ్ముకున్న వేళ, మనలని రెండు చేతులతో అమ్మలా దగ్గరకి తీసుకుంటుంది నగరం. ఆ నగరపు దూరాలు మనల్ని చాలాసార్లు మనలని అనేక ఆదుర్ధాలతో నింపేస్తుంటాయి… అలాంటప్పుడు యిలా మనలని వొక పాట మనతోనే వుండటం భలే వుంటుంది కదా.
అలా చుట్టుకున్న యీ పాటతో తిరుగుతూ పది గంటల వేళ ఛార్జర్ కొనుక్కుందామని యెండకి దొరక్కుండా తొందరగా వచ్చేయ్యాలని బయలుదేరాను. నేనా షాప్ దగ్గరకి వెళ్ళే సరికి అక్కడున్న చిన్ని నీడలో వో అమ్మాయి అబ్భాయి కబుర్లు చెప్పుకొంటున్నారు. షాప్ వాళ్ళు ఆ షాప్ షట్టర్ ని ఆ షట్టర్ రాడ్ ని చేత్తో తిప్పుతూ పైకి లేపుతున్నారు. వాళ్ళిద్దరూ మరికాస్త పక్కకి జరిగి మాటాడుకుంటున్నారు… ఆ రెండు నిమషాలకే యెండ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. యీ షట్టర్ త్వరగా తీయటం పూర్తయితే బాగుండుననుకొన్నా ఆ యెండని తట్టుకోలేక… అప్పుడే మనిపించిందంటే యిలా యీ చార్జర్ కోసం కాకుండా, యిలా రావటం యెవరో వొక యిష్టమైన లేదా ఆసక్తికరమైన వాళ్ళని కలవడానికైతే యీ యెండ యింతలా విసుగ్గా బాధించేదా… చిన్నినవ్వు లోలోపల… అంత సులభమా అలాంటి వొక మాయాలాంతరు నవీనవెన్నెలకాంతులు…
చార్జర్ తీసుకొని యిటు తిప్పబోతున్న కార్ ని అటు పుస్తకాల దుకాణం వైపు తిప్పా… వొక పుస్తకం కొనాలి వొక స్టూడెంట్ కోసం.
ల్యాండ్ మార్క్ లో పెద్దగా జనం లేరు. కావలసిన పుస్తకాలు చెప్పాను. కౌంటర్ ల్లో వాళ్ళు సిస్టంలో స్టాక్ చెక్ చేస్తాం కూర్చోమని అన్నారు. పుస్తకాలు దుకాణంలో యెటు చూసినా పుస్తకాలు వున్నప్పుడు కాళ్ళు అటు లాగుతాయి. కళ్ళు పుస్తకాల చుట్టూ తిరుగుతుంటాయి. చదువుకునే రోజుల్లో బుక్ ఫెయిర్ కి వెళితే చూపులు రంగులురాట్నం తిరిగేవి పుస్తకాల చుట్టూ. రకరకాల సైజులు రంగులు బొమ్మల్లో … కొనుక్కు తెచ్చుకున్న పుస్తకాలతో పాటు కొనని పుస్తకాలు వచ్చేసేవి యింటికి చూపుల్లో యిరుక్కొని. అలానే లైబ్రెరీకి వెళితే అన్నీ వొక్క సారే చదివెయ్యాలనే ఆత్రం కుతూహలం. యెప్పుడెప్పుడు లైబ్రెరీకి పారిపోదామానే వుండేది.
యిప్పుడు కావలసిన పుస్తకాలని ఆన్ లైన్ ల్లో బుక్ చేసుకోవటం… యింటిల్లిపాదికి కావలసిన పుస్తకాలు యింటికే రావటం… చాల టైం కలిసొస్తుంది. పుస్తకాలని లైబ్రెరీలకి, షాప్స్ కి అద్దెకి యిచ్చే దుకాణాలకి వెళ్ళి తీసుకొచ్చిన అనుభవం నుంచి యింటికి పుస్తకాలు తీసుకొచ్చే అనుభవాన్ని చూసిన వాళ్ళం వున్నాం. ఫ్లిఫ్ కార్ట్ నుంచి పుస్తకాలు అందుకొనే తరం మన ముందుంది. వాళ్ళు దీనివల్ల యేమైనా మిస్ అవుతున్నారా… కావలసిన పుస్తకాలు చదువుతూనే వున్నారుగా… సో… మిస్ అయ్యేదేముంటుంది… వుంటుందా… ఆలోచిస్తూ ఆ చల్లని విశాలమై హాల్లో ని బుక్ రాక్స్ వైపుకి వెళ్లాను… వో కొత్త పుస్తకం చేతుల్లోకి తీసుకున్నా. కొత్త పుస్తకపు కాగితం ఆ యింక్ పరిమళం ఆస్వాదించటం భలే యిష్టం… ముఖ్యంగా సోవియట్ వాళ్ళ పుస్తకాలకి వో గమ్మతైన పరిమళం వుండేది. సో… వో పుస్తకాన్ని తెరచి వాసన చూసా… రూమ్ ఫ్రెష్ నర్ లెమన్ గ్రాస్ పరిమళం చల్లగా… అవును యిప్పుడు యిక్కడ కొత్త పుస్తకం రూమ్ ఫ్రెష్ నర్ వాసన మాత్రమే వేస్తుంది… యెప్పటికప్పుడు మరచి మళ్ళీ మళ్ళీ చూస్తుంటా అలవాటైన కుతూహలంతో.
అప్పుడు చూసా వొక యేడెనిమిదేళ్ళ పాప నా ముందు నుంచి చేతిలో వొక పుస్తకం పట్టుకొని చకచకా పిల్లల పుస్తకాల విభాగంలోని పుస్తకాల ర్యాక్స్ మధ్య నుంచి వెళుతుంది. అక్కడ వో పక్కగా వేసిన సోఫాలో కూర్చున్న వ్యక్తికీ పుస్తకం యిచ్చింది. అతను యేం చెప్పారో మళ్ళి పుస్తకాల ర్యాక్స్ వైపు వెళుతోంది వెతికే చూపులతో. ఆ తండ్రి కూతురికి పుస్తకాలు వెతుక్కో టాన్ని పరిచయం చేస్తున్నారు. నేర్పిస్తున్నారు. మాడ్చే మధ్యాహనాలు, వడగాల్పులు, యెండ దాడులు వొక్క సారిగా యెగిరి పోయాయి.
యీ ఆదివారం సెలవు రోజు వుదయం చల్లని పవనేమేదో స్వాగతం చెప్పిన్నట్టు శీతల స్పర్శ అలముకొంది. మనసు పసి పిల్లై మారాకు వేసింది. స్మృతి పొదల్లో గులాబీలు గుబా ళించాయి.
అవును పుస్తకాల కోసం లైబ్రెరీలకి, షాప్స్ కి ,అద్దెకి యిచ్చే దుకాణాలకి వెళ్ళినప్పుడు తిన్నగా పుస్తకం వొక్కటే చూసేవా కళ్ళు. అలానే ఆడుకోడానికి వెళ్ళినప్పుడు కేవలం ఆట మాత్రమే వుండేదా…కానేకాదు కదా దారిలో వానకాలమైతే ఆ చిత్తడి చిత్తడి నేలలో వాన పాములూ ఆరుద్రలూ, శీతాకాలమైతే డిసెంబర్ పువ్వులూ, పుష్య మాసమైతే నీలినీలి గగనాన రంగురంగు పతంగులూ కనిపించేవి. నారాయణమ్మ కొట్టా, మైసమ్మ గుడా, సింహాద్రి కూల్ డ్రింక్ షాపా, సుబ్బారావు మెస్, సిండ్రిల్లా కాస్మోటిక్స్ యిలా దారిలో వుండే వాటి గురించి యెరుక వుండేది… పిల్లల యెదుగుదలలో చాల ముఖ్యమైన భాగంమైన ఆ పరిసర జ్ఞానం చాల సునాయాసంగా యిమిడిపోయేది. దారే పోయేవారిని వొక అ్రడ్రెస్ అడగటమో, అలా అడ్రెస్ అడిగినవారికి చెప్పటమో తెలిసేది. యిరుగూ పొరుగూ తెలిసేవారు. నగరంలో పిల్లలకి యిప్పుడు నైబర్ హుడ్ తెలీదు. చుట్టు పక్కల గమనింపు తగ్గిపోయింది. చుట్టుపక్కల వాళ్ళతో పిల్లలకి పెద్దలకి కూడా యెంగేజ్ మెంట్ చాల తగ్గిపోయింది. ఆ యెంగేజ్ మెంట్ ని రెవైవ్ చేసుకోవాల్సిన అవసరం చాల వుంది. మన పొరుగున యేం జరుగుతుందో తెలీకపోతే మన యింటి ముందు వానకాలువలో వాహనాలు మునిగే వరకు వాన యేం చేస్తుందో తెలీదు. యింటి వెనక వున్న ఖాళీ ప్రదేశంలో పెరిగిన తుమ్మ చెట్లు, అక్కడ పోసే చెత్తా చెదారంతో పెరిగే యెలుకలూ పాములు యిలా యెక్కడ యేం జరుగుతుందో తెలీదు. యిలాంటివి నలుగురు కలిసి పోగై పరిష్కరించుకొనే సమస్యలు. మనకి మన పిల్లలకి మన చుట్టూ పరిశరాలే తెలియవు కానీ మనం పిల్లలతో ఆర్గనైజ్డ్ ప్రపంచ యాత్రలూ ప్లాన్ చేసేస్తుంటాం. పిల్లలకి యిలా పుస్తకాలని పరిచయం చేసే దృశ్యం చూసెంత కాలమైంది.
వండు కోవలసినని వండినవి యిలా యింటికి అన్నీ డెలివరీ అవుతాయి. అందులో కంఫర్ట్ వుంది. కానీ అనుభవం వుండదు. ఆ కంఫర్ట్ ని అవసరమైన మేరకి వాడుకుంటూ వుండాల్సిందే. లేకపోతే మరింత హడావడి. కానీ అనుభవాలకి వుండాల్సిన యెరుకకి దూరం కాకుండా యీ కంఫరట్స్ ని వదులుకోకుండా వీటి మధ్య వొక బాలెన్స్ ని తీసుకురాగలిగితే యీ రోజులో నిన్నటి మొన్నటి మెరుగైన కాలాన్ని వొంపగలిగితే ఆ మేలుకలయిక వర్తమానాన్ని భవిష్యత్తుని ప్రకాశవంతం చేస్తుంది కదా…
యిదంతా బానే వుంది కానీ నీకు తెలివొస్తూనే అంతిష్టంగా అల్లుకుంటే నన్నిలా మధ్యలో పట్టించుకోవా అంటోంది ఆ పాట… అరే నిన్నెలా వదిలేస్తా… నాలోనే తిరుగుతున్నావ్ నువ్వు కూడా గమనింపుని వదిలేస్తున్నావాని నవ్వుతూ చిన్నయెదురు దాడి చేసా.
మనసంతా యే పని చేస్తున్నా ఆ పాటనే నింపుకున్నా… మనం అడిగితే పాటలు మనలని కమ్ముకోవ్ అవి ప్రేమగా మన శ్వాసలోకి వచ్చినప్పుడు చిన్నపాటి నిర్లక్ష్యం చెయ్యకూడదు కదా… అందికే… ‘కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి…’ వెంటవెంటే తన వెంటే.

Comments

comments