నిను వీడని దోమను నేనే!

ప్రపంచ నాగరికత కంటే  ముందే మనిషికి  దోమకు మధ్య పోరాటం జరుగుతూనే ఉంది. దోమల నివారణ కోసం అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి స్పందించిన సందర్భాలూ ఉన్నాయి. మలేరియా దోమలను అంతమెుందించేందుకు వేలకోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా ఖర్చు అయినా అవి మాత్రం అంతం కాలేదు. కాలంతో పాటు దోమలు పరిణితి చెంది కొత్తరోగాలను విస్తృతంగా వ్యాపింపజేస్తున్నాయి. నినువీడని నీడను నేనే అంటూ మనుషులను వెంటాడి వేటాడి కాటు వేస్తున్నాయి. దోమకాటుకు ఎవరైనా ఒకటే…పాలకులుకావచ్చు, ప్రజలు కావచ్చు, రాజులుకావచ్చు, సామంతులు […]

ప్రపంచ నాగరికత కంటే  ముందే మనిషికి  దోమకు మధ్య పోరాటం జరుగుతూనే ఉంది. దోమల నివారణ కోసం అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి స్పందించిన సందర్భాలూ ఉన్నాయి. మలేరియా దోమలను అంతమెుందించేందుకు వేలకోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా ఖర్చు అయినా అవి మాత్రం అంతం కాలేదు. కాలంతో పాటు దోమలు పరిణితి చెంది కొత్తరోగాలను విస్తృతంగా వ్యాపింపజేస్తున్నాయి. నినువీడని నీడను నేనే అంటూ మనుషులను వెంటాడి వేటాడి కాటు వేస్తున్నాయి.

దోమకాటుకు ఎవరైనా ఒకటే…పాలకులుకావచ్చు, ప్రజలు కావచ్చు, రాజులుకావచ్చు, సామంతులు కావచ్చు దోమకాటు దెబ్బ రుచి చూడాల్సిందే. ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన అలెగ్జాండర్ మలేరియాతో మరణించాడు. సైనికులు విషజ్వరాలతో అశువులు బాసారు. సరిహద్దుల్లో పొంచి ఉండే సైనికులకంటే దోమలు భయంకరమైనవి. అవి ఎప్పుడైనా, ఎక్కడైనా దాడిచేయవచ్చు. రోగాలతో ప్రాణాలు తీయవచ్చు. తీస్తున్నాయి కూడా..

ప్రపంచవ్యాప్తంగా దోమకాటు వల్ల వచ్చే మలేరియా సవాళ్ళను విసురుతూనే ఉంది. నిర్మూలనకు వాడిన రసాయనాలు నిష్ప్రయోజనమయ్యాయి. ఈ మందుల వల్ల మలేరియా కనుమరుగైనట్లు శాస్త్రవేత్తలు ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదు. మలేరియా నివారణ జరిగిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ భుజాలు ఎగరవేసినా దోమల నిర్మూలన పథకం ముగియగానే రెట్టించిన బలంతో దోమలు ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో విజృంభిస్తున్నాయి. మలేరియా నివారణ మిథ్య అని స్పష్టం అవుతుంది. దోమలన్నీ ప్రమాదకరం కావు, నేరుగా ప్రమాదం లేకపోయినా కుట్టినప్పుడు దురదలు వస్తాయి. కొన్ని దోమలు రోగకారకాల సూక్ష్మజీవులను మోసుకువస్తాయి. ఈ ప్రమాదం మనుషుల్లోనేకాదు జంతువుల్లో కూడా సంభవిస్తాయి. ఇవన్నీ సూక్ష్మజీవుల పర్యవసానం. ఒకరినుంచి ఒకరికి సులభంగా సంక్రమిస్తాయి.
దోమల్లో ప్రధానంగా మూడురకాలు ఉన్నాయి. కులిసిడే కుటుంబంగా దోమలను వ్యవహరిస్తారు. ఇందులో క్యూలెక్సు, అనాఫిలస్, ఈడిస్ దోమలు ఉన్నాయి. అలాగే 3500 వరకు దోమల జాతులు ఉన్నా వందజాతుల వరకు మనిషి రక్తాన్ని పీలుస్తాయి. మిగతా దోమలు పూలు, పండ్లు, ప్రకృతిపై ఆధారపడి జీవిస్తాయి. సూక్ష్మజీవులకు, పక్షులకు ఇతర జీవులకు ఆహారం అవుతాయి.
రక్తమే ఆహారం దోమ శరీరంలో మూడుభాగాలు ఉంటాయి. తల, మొండెం. ఒళ్ళంతా సన్నటి నూగు ఉంటుంది. ప్రాంతాలను బట్టి దోమరంగులు మారుతుంటుంది. కొన్నిదోమల రెక్కల మీద శరీరం మీద తెల్లటిమచ్చలు ఉంటాయి. రాగి,బంగారు వర్ణంలో నిగనిగలాడుతూ ఎగిరే దోమలు కూడాఉన్నాయి.
దోమలకు దృషి,్ట శ్రవణ శక్తి ఉంటుంది.వాటి కళ్ళు సామూహిక నేత్రాలు. షట్కోణకటకాలతో తయారై ఉంటాయి. ప్రతికటకం ఒక ప్రత్యేక కన్నుమాదిరిగా పనిచేస్తుంటుంది. ఇవి కళ్లను ఎప్పుడూ తెరుచుకుని పరిసరాల మీద నిఘావేసి ఉంటాయి. ఎంత చిన్నకదలికనైనా ఇట్టే పసికడతాయి. దోమలకు రెండు స్పర్సశృంగాలు ఉంటాయి. నోరు అచ్చు గరాటు లాగా ఉంటుంది. తొండంతో కుడుతుంది. రక్తం పీల్చుకోవడానికి అది స్ట్రాలాగా పనిచేస్తుంది. మగదోమలు మనిషి జోలికి రావు. రక్తంపై అంతగా మోజుండదు.

ప్రమాదమంతా ఆడదోమతోనే…

ఆడదోమ శరీరంలోని గుడ్లకు మనిషి లేదా జంతువు రక్తం ఆహారంగా కావాలి. ఆడదోమ ఆహారం పూర్తిగా రక్తమయం. దోమ సూదితో పొడిచినట్లు కుడుతుంది. సూదివంటి ఆరుభాగాలు ఉన్న ముళ్ళతో దోమ చర్మానికి రంధ్రం చేస్తుంది. ఈ ముల్లు శరీరంలోకి దిగగానే మెుదట దోమ లాలాజలాన్ని పంపిస్తుంది. అది రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. దీనివల్ల రక్తం పీల్చడం సులువు అవుతుంది. ఈ లాలాజలం చాలా మందిలో అలర్జీ పుట్టిస్తుంది. ఒకసారి కుట్టినప్పుడు తన బరువు కంటే ఒకటిన్నర రెట్ల బరువు రక్తాన్ని దోమ పీలుస్తుంది. మామూలుగా కీటకాల్లో నాలుగురెక్కలు ఉంటాయి. దోమల్లో మాత్రం రెండురెక్కలే ఉంటాయి. ఎగిరేందుకే కాకుండా దోమని సమతుల్యంగా నిలబడటానికి ఈ రెక్కలు ఉపయోగపడతాయి.

ప్రాణాలను హరించే మలేరియా

ప్లేగు అనంతరం లక్షలాదిమంది ప్రాణాలను హరించిన ప్రమాదకరమైన జబ్బు మలేరియా. ప్రతి సంవత్సరం కోట్లాది మంది మలేరియా బారిన పడుతున్నారు. డి.డి.టి వంటి క్రిమిసంహారక మందులు , క్లోరోక్విన్ వంటి మలేరియా మందులు వచ్చాక ప్రపంచవ్యాప్తంగా దోమల నిర్మూలన, మలేరియా నివారణ ప్రారంభమైంది.1950లో యుద్ధప్రాతిపాదికన ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించారు. 1970 నాటికి మలేరియా నిర్మూలించినట్లు అనేక ప్రభుత్వాలు ప్రకటించాయి. ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. తగ్గినట్లే కనిపించి మరణాలు మళ్ళీపెరిగాయి. భారతదేశంతోపాటు ఆఫ్రికా, పశ్చిమ యూరోప్, ఆగ్నేయాసియాలో మలేరియా విస్తరించింది. మందులకు లొంగని ఫాల్సిపేరం పరాన్నజీవి వల్లే 1994 లో రాజస్తాన్ లో 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1994లో ఆంధ్రప్రదేశ్‌లో 45 వేల మరణాలు సంభవించాయి. అంతకుముందు సంవత్సరం వీటి సంఖ్య87 వేలు. 1989 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మలేరియా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆ సంవత్సరం మలేరియా కేసులు కూడా ఎక్కువగా వచ్చాయి.1989 లో 65వేలు, 1990లో 87వేల 147, 1991లో 74వేల 935, 1994లో 86వేల 850 కేసులు నమోదు అయ్యి సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం మలేరియా మరణాల శాతం కొద్దిగా తగ్గినా అపరిశుభ్రత ఉన్న ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తూనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో మలేరియా నిర్మాలనకు చర్యలు తీసుకుంటున్నా అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా లేదనే మిమర్శలు ఉన్నాయి.

మలేరియాలో భారత్‌కు మూడవస్థానం

ప్రపంచవ్యాప్తంగా మలేరియా ఆందోళనకర పరిస్థితులను కలిగిస్తోంది. దోమకాటు ఎలా విజృంభిస్తోందో ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ఈ నివేదికలో భారత్ మూడవస్థానంలో ఉండటం గమనార్హం. మెుత్తం మలేరియా కేసుల్లో 80 శాతం 15 దేశాల్లో నమోదుకాగా ఆఫ్రికా అనంతరం భారతదేశంలోనే మరణాలు అధికంగా ఉన్నాయని డబ్ల్యూ.హెచ్.ఓ 2017 నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. 2014లో 97 దేశాల్లో మలేరియా విస్తరించగా ప్రస్తుతం 97 దేశాల్లో మలేరియా విజృంభించింది. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లమందిని అనారోగ్యానికి గురి చేస్తున్న దోమలు ఇటీవల తిరిగి విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఘనా, కెన్యా, మాలవి దేశాల్లో పైలెట్ ప్రాజెక్టుగా మలేరియా నివారణ పనులు చేపట్టింది. నైజీరియాలో 27శాతం, డెమెక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 10 శాతం, భారతదేశంలో ఆరుశాతం మలేరియా కేసులు నమోదు అయ్యాయి. మలేరియాకు ప్రధానకారణం అపరిశుభ్ర వాతావరణం, పరిసరాలు అని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2016లో భారతదేశంలో 21.6 లక్షల మందికి మలేరియా సోకగా చికిత్సను వేగవంతం చేయడంతోపాటు పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతపర్చారు.

క్యూబాలో సార్వత్రిక ఆరోగ్యరక్షణ

క్యూబాలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యసేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి.1959లో ఆ దేశ రాజ్యాంగంలో రాసుకున్న విధంగా సార్వత్రిక ఆరోగ్య రక్షణ అమలు కోసం పాలకవర్గం నిరంతరం శ్రమిస్తుంది. ప్రతికుటుంబానికి డాక్టర్ అందుబాటులో ఉంటాడు. అలాగే ప్రభుత్వం ప్రజలందరికీ 14 రకాల వ్యాక్సిన్లు వేసి రోగాల నుంచి కాపాడుతుంది. ఆరోగ్యం కోసం క్యూబా జి.డి.పి లో 10 శాతం ఖర్చుచేస్తుంది. అక్కడ దోమకాటు వ్యాధులను భూతద్దంతో వెతికినా కనిపించదు. ఆరోగ్య రంగం అభివృద్ధి సాధించడంతో ఆ దేశ ప్రజల సగటు ఆయురార్థం 79 ఏళ్ళుగా నిర్దారించడం ప్రశంసనీయం. అదేవిధంగా శ్రీలంకను మలేరియారహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

అనేక రకాల దోమలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నప్పటికీ ప్రధానంగా ఎనిమిది రకాల దోమలు ప్రాణాంతక వ్యాధులను వ్యాపింప చేస్తున్నాయి. మలేరియా కలిగించే అనాఫిలిస్ జాతికి చెందిన ఆడదోమ, మెదడువాపుని జపనీస్ బి వైరస్ ,ఫైలేరియా హల్మెంత్ వర్గానికి చెందిన పరాన్నజీవి, డెంగ్యూ ఏయిడిస్ ఈజిప్ట్ జాతి దోమ, చికిన్ గున్యా ఎడిస్ దోమ, కాలాజ్వరం ప్రొటోజోవాకు చెందిన లీ ప్యానియా, నల్లమచ్చల జ్వరం సాండ్ ప్లై క్రిమిద్వారా వ్యాపిస్తుంది. హెచ్.ఐ.వి,కుస్టు రోగులకు ఇది తొందరగా వ్యాపిస్తుంది. లింపాటికల్ పైలేరియాసిస్ దోమకాటుతోనే వస్తుంది. అయితే అనేక ప్రాణాంతకవ్యాధులు దోమల ద్వారా రక్తం మార్పిడి చెంది సూక్ష్మజీవుల ప్రవేశంతో వ్యాపిస్తుంటాయి. పరిశుభ్ర వాతావరణం లేని ప్రాంతాల్లోనే దోమలు ఉత్పత్తి అవుతాయి.

సహజ పద్ధతుల ద్వారా దోమల నివారణ 

దోమల బారిన పడకుండా ఉండాలంటే వాటిని నివారించడమే ఏకైకమార్గం. దోమలు రాకుండా ఉపయోగించే కాయిల్స్, ఎలక్ట్రికల్ పరికరాలు ఖర్చుతో కూడినవి. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్ కూడా వస్తాయి. సహజసిద్ధంగా దోమలను నివారించే మొక్కలు ఉన్నాయి. వీటిలో పుదీనా, నిమ్మగడ్డి, తులసీ, బంతి ముఖ్యమైనవి.

పుదీనా మనం ఆహారపదార్థాల్లో ఉపయోగించే పుదీనా వాసనంటే దోమలకు అసలు గిట్టదు. పెరట్లో పుదీనా మొక్కలు ఎక్కువగా పెంచితే దోమలను నివారించవచ్చు.
తులసి తులసి ఆకుల నుంచి తీసిన రసాన్ని ఇంట్లో చల్లినా.. ఇంటి ద్వారం వద్ద, కిటికీల వద్ద తులసి మొక్కలను పెంచినా దోమలను ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు.
గగ్గెర (సజ్జ) వేసవికాలంలో చల్లదనం కోసం ఉపయోగించే సజ్జగింజల వాసన దోమలకు ఇష్టం ఉండదు. ఈ మొక్కలు ఎక్కువగా ఉండేచోట దోమలు ఉండవు.
నిమ్మగడ్డి ఈ మొక్కల నుంచి తీసిన నూనెను సౌందర్య లేపనాలు, సెంట్లు, సబ్బుల్లో ఉపయోగిస్తారు. ఈ మొక్క నూనె రాసుకుంటే దోమలు కుట్టవు. ఈ మొక్కలను పెరట్లో పెంచడం వల్ల దోమల వ్యాప్తిని తగ్గించవచ్చు.
బంతి రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా ఉండే ఈ మొక్కలను అలంకరణకే కాదు దోమలను అరికట్టడానికి బాగా ఉపయోగపడుతాయి. వీటిని పెరట్లో పెంచితే దోమలు రావు.
నీలగిరి : ఎండిన నీలగిరి ఆకులను నిప్పులపై వేసి పొగపెడ్తే దోమలు రావు.
వేప ఎండిన వేప ఆకులతో పొగవేసినా దోమలు పారిపోతాయి.
ఇవేకాకుండా వెల్లుల్లి రసం నీళ్లలో కలిసి స్ప్రే చేసినా.. దోమలు రావు.
రోజ్‌మేరీ ఆయిల్‌ను కొబ్బరి నూనెతో కలిపి శరీరానికి రాసుకుంటే దోమలు కుట్టవు.
వీటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమలను చాలావరకు నివారించవచ్చు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరూ రోగాలు రాకముందే జాగ్రత్త పడితే మంచిది. ప్రతి ఇంట్లో ఈమొక్కల్లో ఏదో ఒక మొక్కను పెంచుకోవాలి. ప్రభుత్వాలు కూడా వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది.

 రసాయన తెరలతో దోమలు మాయం 

కీటకనాశని మందులకు లొంగని దోమలను చంపడానికి ప్రత్యేక దోమతెరలు తయారయ్యాయి.  రసాయనాలతో తయారైన ఇవి లక్షల మలేరియా కేసులను నివారించగలుగుతాయి.   ఆఫ్రికాలోని బర్కినా ఫాసోలో రెండేళ్ల పాటు శాస్త్రవేత్తలు ఈ తెరలతో ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించారు. వీటి వల్ల 12 శాతం వరకు మలేరియా కేసులు తగ్గాయని ప్రొఫెసర్ సీకలిండ్సే చెప్పారు.  ప్రపంచం మొత్తం మీదా మలేరియా మరణాలలో 91 శాతం కేసులకు పుట్టిల్లు అయిన ఆఫ్రికాలో ఇదో పెద్ద ముందడుగు  అని ఆయన పేర్కొన్నారు.  బర్కినా ఫాసోలో  మొత్తం ఈ తెరలను పరిశీలించినట్లయితే మొత్తం జనాభాలో అయిదేళ్ల లోపు పిల్లలను పీడిస్తున్న  మలేరియా కేసులను 70,0000 వరకు తగ్గించవచ్చని ఆయన అన్నారు.  బర్కినాఫాసో లోని 91 గ్రామాలలోని సంప్రదాయ దోమ తెరతకు బదులుగా  పై,రే త్రాయిడ్ క్రిమీ సంహారిణి మందుల తో పాటు క్రిమీ కీటకాబివృద్ధిని నియంత్రించే పైరి ప్రోన్సి ఫెక్‌ను కూడా చేర్చారు. దీనివల్ల దోమల జీవితకాలం తక్కువ చేయడమే కాక పునరుత్పత్తి సామార్థాన్ని  కూడా తగ్గిస్తాయి. ఈ కాంబినేషన్ లో నెట్ పై ఉండే రసాయన భాగాలు ఎక్కువగా దోమలను చంపడంతో పాటు వ్యాధికారక దోమల సంఖ్యను కూడా తగ్గిస్తాయని విండ్సే వెల్లడించాడు.

సర్ రోనాల్ రాస్ చలువే…

మలేరియా రోగం దోమకాటుతో మనిషికి వ్యాపిస్తుందని 1898 లో సర్ రోనాల్ రాస్ కనుగొనేంతవరకు ప్రపంచానికి తెలియదు. నిజానికి ప్లాస్మోడియం పరాన్నజీవి గురించి రాస్ పరిశోధనలకు ముందే తెలిసినా మనిషిలోకి అది ఎలా ప్రవేశిస్తుందనే విషయం అంతుబట్టలేదు. ప్లాస్మోడియం పరాన్న జీవి దోమ జీర్ణాశయంలో ఆయన కనుగొన్నారు. ఆ తర్వాత మలేరియాపై ప్రత్యక్ష సమరం ప్రారంభమైంది. మలేరియా జబ్బును కలిగిస్తుందని కనుగొన్నందుకు సర్ రోనాల్ కు 1902 లో నోబెల్ బహుమతి లభించింది.1894 నుంచి మలేరియాపై ఆయన పరిశోధనలను కేంద్రీకరించారు. హైదరాబాద్ లోనే ఈ పరిశోధనలన్నీ జరిగాయి.

       వి. భూమేశ్వర్

 సైన్స్ విభాగం

Comments

comments