నాన్న స్ఫూర్తితో సామాజిక సేవ

విమానం ఎక్కడమంటే అనాథ పిల్లలకు సాధారణ విషయం కాదు. అలాంటిది వారి ఈ పెద్ద కోరికను సహృదయంతో తీర్చింది. అంతేకాకుండా ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదివిస్తూ, భవిష్యత్తులో వారు మంచి ప్రయోజకులవ్వాలని కోరుకుంటోంది. చదువుతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా కుంగ్‌ఫూ, కరాటేలాంటి క్రీడలను నేర్పిస్తూ, ఆ బాలలను కంటికి రెప్పల్లా, సొంత బిడ్డల్లా చూసుకుంటోంది వాల్మీకి ఫౌండేషన్. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సామాజిక సేవలో తమ బాధ్యతను నెరవేరుస్తున్న వాల్మీకి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు హరికిషన్‌తో సకుటుంబం […]

విమానం ఎక్కడమంటే అనాథ పిల్లలకు సాధారణ విషయం కాదు. అలాంటిది వారి ఈ పెద్ద కోరికను సహృదయంతో తీర్చింది. అంతేకాకుండా ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదివిస్తూ, భవిష్యత్తులో వారు మంచి ప్రయోజకులవ్వాలని కోరుకుంటోంది. చదువుతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా కుంగ్‌ఫూ, కరాటేలాంటి క్రీడలను నేర్పిస్తూ, ఆ బాలలను కంటికి రెప్పల్లా, సొంత బిడ్డల్లా చూసుకుంటోంది వాల్మీకి ఫౌండేషన్. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సామాజిక సేవలో తమ బాధ్యతను నెరవేరుస్తున్న వాల్మీకి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు హరికిషన్‌తో సకుటుంబం మాటామంది.

అనాథ పిల్లలను విమానం ఎక్కించాలనే ఆలోచన ఎలా వచ్చింది ?
ట్రావెల్ ఏజెంట్‌గా ఇప్పటి వరకు 40 దేశాలు తిరిగాను. ఒక రోజు మా ఆశ్రమంలో పిల్లలతో మాట్లాడుతున్న సమయంలో మారుతి అనే 5 ఏళ్ల అబ్బాయి మమ్మల్ని కూడా విమానం ఎక్కించవచ్చుకదా అని అడిగాడు. వాళ్ల కోరిక తీర్చాలనిపించింది. రెండు సార్లు ఎయిర్ షోకి తీసుకెళ్లాను. అప్పుడ ఆ పిల్లల కళ్లల్లో ఆనందం చూసి వాళ్లను ఒక్కసారి విమానంలో ఎక్కించి ఒక టూర్ ప్లాన్ చేద్దాం అని అనుకున్నాను.

వింగ్స్ ఆఫ్ హోప్ ముఖ్య ఉద్దేశ్యం ?
పిల్లలను గగన విహారయాత్రను చేపించాలని వింగ్స్ ఆఫ్ హోప్ అనే ఒక ప్రాజెక్ట్‌ని ప్రారంభించాను. తెలంగాణ క్యారియర్ ద్వారా ట్రూ జెట్ ఎయిర్‌లైన్ ద్వారా ఈ యాత్రను విజయవంతం చేశాం. ట్రూ జెట్ సంస్థ సిఎఫ్‌ఒ విశ్వనాథ్, సిసివో సుధీర్ రాఘవన్ ఎంతో సహకారం అందించారు.

అనాథ పిల్లలకు సేవ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
మా నాన్నకి 4 సంవత్సరాలు ఉన్న సమయంలో తన సవితి తల్లి కారణంగా అనాథ అయ్యాడు. ఆమె ఓ తిరునాళ్లలో మా నాన్నను వదిలేసి వెళ్లిపోయిందట. ఆ సమయంలో ఓ పోలీస్ అధికారి ఆయన్ను దగ్గరకు తీసుకుని దగ్గర్లో ఉన్న అనాథాశ్రమంలో చేర్పించారట. నాన్న చదువుకోవడానికి ఆఫీసరే డబ్బులు పంపేవారట. అలా నాన్న (డిహెచ్‌ఎమ్‌ఎస్) డాక్టర్ అయ్యాడు. తాను పడ్డకష్టాలు చెబుతుండేవారు. తనలాంటి వారు ఇంక ఎందరో ఉన్నారని, వారికి తమ వంతు సహాయం చేయాలనే వారు.

ఎప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ?
ఉన్నంతలో కొంత డబ్బును పేద పిల్లల కోసం, అనాథల కోసం వినియోగించాలనుకున్నాం. నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే పార్ట్‌టైం జాబ్ చేస్తూ అనాథ పిల్లలకు సహాయం చేస్తుండేవాడిని. నేను మా ఇద్దరు తమ్ముళ్లు కలిసి ఓ సంస్థను ఏర్పాటుచేయాలనుకున్నాం. అదే వాల్మీకి ఫౌండేషన్.

వాల్మీకి ఫౌండేషన్‌ని ఎప్పుడు స్థాపించారు ?
2008లో స్థాపించాం. మొదటి సంవత్సరం నలుగురు పిల్లలను చేర్చుకున్నాం. ప్రస్తుతం మా దగ్గర 45 పిల్లలు ఉన్నారు. తమ్ముడు సూర్యగణేష్ దీనికి సంబంధించిన పనులు అన్నీ చూసుకునేవాడు. ప్రస్తుతం దీని బాధ్యతలన్నీ నేనే చూసుకుంటున్నాను.

మీ కుటుంబ సభ్యుల గురించి…
నాన్నగారు రిటైర్డ్ తహశీల్దార్. అమ్మ రిటైర్డ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్. అమ్మ రెండేళ్ల క్రితం చనిపోయింది. మేము ఏడుగురం సంతానం. అందులో నేను ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాను. రోటరీ క్లబ్‌లో మెంబర్‌ను. నా భార్య రాధ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బేగంపేట్‌లో పనిచేస్తుంది. మాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి 9వ తరగతి కేంద్రీయ విద్యాలయ పికేట్, అబ్బాయి 3 వ తరగతి కేంద్రీయ విద్యాలయ బోయిన్‌పల్లిలో చదువుతున్నాడు. మా నాన్నకు చిన్నప్పటి నుంచి సమాజ సేవ చేయాలనే ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. అదే మాకూ వచ్చింది.

మీ సంస్థలో పిల్లలు ఇంగ్లీషు బాగా మాట్లాడుతున్నారు ?
మా ఇంట్లో అందరం చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నాం. ఇంగ్లీషు సరిగ్గా రాకపోవడంతో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. మా సొంతూరైన అనంతపురానికి దగ్గర్లో ఉన్న సత్యసాయి ఆశ్రమానికి విదేశీ యాత్రికులు వస్తుండేవారు. అప్పుడు నేను వారికి అక్కడున్న ప్రాంతాలను చూపించి, వారితో ఇంగ్లీష్ మాట్లాడం నేర్చుకున్నాను. అలాంటి సమయంలో వారు నాకు విదేశీ కరెన్సీలు ఇచ్చేవారు. నా దగ్గర 195 దేశాలకు సంబంధించిన కరెన్సీలు నా దగ్గర ఉన్నాయి. వాటితో ఏఏ దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకున్నాను. నాలాంటి తెలుగు పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటే వారికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు వస్తాయని , భవిష్యత్తులో ఇబ్బంది వుండదనే ఉద్దేశంతో ఇక్కడి పిల్లలకు ఇంగ్లీషు మీడియం స్కూల్లో చేర్పించాను.

ఎంత మంది పిల్లలు ఈ యాత్రలో పాల్గొన్నారు ?
వాల్మీకి ఫౌండేషన్ పిల్లలు మాత్రమే కాకుండా నగరంలో ఉన్న కొంతమంది అనాథ పిల్లల్నీ తీసుకెళ్లాలనుకున్నాం. ట్రూ జెట్ సంస్థ సంస్థ స్థాపించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాబట్టి 300 మంది పిల్లలకు అవకాశం ఇస్తాం అని వాళ్లు చెప్పడంతో మొదటి దశగా 30 మంది పిల్లలను తీసుకెళ్లాం. ప్రముఖ హీరోయిన్, ప్రత్యూష ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సమంత, డా॥ మంజుల అనగాని ఈ ప్రోగాంలో పాల్గొనారు.

హంపీ యాత్ర గురించి ?
ఈ ఏడాది జూలై 30న పిల్లల్ని తీసుకవెళ్లిన ట్రూ జెట్ 30 సీట్లను ఉచితంగా కేటాయించింది. హంపీ వెళ్లిన తరువాత పిల్లలు ఉండటానికి రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ వారు వసతి కల్పించారు. మిసెస్ వరల్డ్ 2018 రుమన సిన్హాతో పాటు, రేడియో జాకీ డా॥ వేణు శ్రావణ్ మాతో వచ్చారు.

సమంత అక్కినేని సహకారం?
సమంత సహృదయం కలిగిన వ్యక్తి. హ్యాపీ హోం ఆదిభట్లలో 56 మంది పిల్లలతో, ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఫౌండేషన్‌లో ఉన్న అమ్మాయిలకూ గగన విహారంలో స్థానం కల్పించాం.

వాల్మీకి సంస్థలో పిల్లలు ఏం చదువుతున్నారు ?
ఐదవ తరగతి నుంచి బిటెక్ వరకు చదువుకుంటున్నారు. ప్రస్తుతం మా దగ్గర ఉన్న పిల్లలకు చాలా వరకు మేము చదువు కంటే, వారిలో ఆత్మసైర్యం పెంచడానికే శిక్షణ ఇస్తుంటాం. పల్లవి మోడల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్‌లో చదువుతున్నారు. అక్కడి యాజమాన్యం మా పిల్లల కోసం తక్కువ ఫీజులు వసూలుచేస్తున్నారు. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఎగ్ బ్యాంక్ ఏంటి?
ఈ మధ్యనే ఎగ్ బ్యాంక్‌ని ఏర్పాటు చేశాం. పిల్లలకు చదువుతో పాటు పౌష్టిక ఆహారం అవసరం. ఒక దాత ముందుకు వచ్చి 50,000 గుడ్లను ఉచితంగా ఇచ్చారు. అలా వచ్చిన గుడ్లని హైదరాబాద్‌లో ఉన్న ఆనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఉచితంగా అందించాం.

మీ సంస్థలో పిల్లలు చేర్చాలంటే ?
బోయిన్‌పల్లిలో ఉన్న వాల్మీకి ఫౌండేషన్‌లో చేరడానికి ముందు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారిని కలవాలి. వారిచ్చిన సమాచార వివరాలు తెలుసుకుని చేర్చుకుంటాం. ఇప్పుడు కారా యాక్ట్ (CARA) ప్రకారం పిల్లల్ని అనాథాశ్రమంలో చేర్చుకునేందుకు వీలుంది.

బయట ఫుడ్‌ను అంగీకరించరా.. ఎందుకని ?
ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తాం. ఎవరైనా పెళ్లిరోజు, పుట్టినరోజు వంటి కార్యక్రమాలను పిల్లల మధ్య జరుపుకోవడానికి వస్తారు. బయట నుంచి అన్నం తెచ్చి తినిపిస్తాం అంటారు. మేం ఒప్పుకోం. ఎవరైనా తినిపించాలని అనుకుంటే మా దగ్గర ప్రత్యేకంగా వంటగదులు ఉన్నాయి. అందులో వారికి నచ్చిన ఆహారాన్ని వండించి తినిపించమని చెబుతాం.

దాతలు ఎలా స్పందిస్తున్నారు ?
మాకు ఎవరైనా దాతలు డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తే మేము వాటిని పిల్లలకు బట్టలు, చదువుకు ఖర్చు అయ్యే వస్తువలను ఇప్పించమని చెబుతుంటాం. ఫౌండేషన్ నుంచి పిల్లల్లను బయటకు, స్కూల్స్‌కి తీసుకెళ్లాలనుకుంటే బస్సు, ఆటో వంటి సౌకర్యాలు కూడా లేవు. ఒక స్కూల్ వ్యాన్ కోసం ఎదురుచూస్తున్నాం ఎవరైనా దాతలు ముందుకు వస్తే బాగుంటుంది.

చదువుతో పాటు ఎలాంటివి నేర్పిస్తుంటారు ?
మా పిల్లలకు చదువుతోపాటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉండే వాలెంటీర్లు ప్రతి రోజు సాయంత్రం ట్యూషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రాయింగ్ నేర్పిస్తుంటారు. యోగా, కరాటే, కుంఫూ నేర్చుకుంటున్నారు. పర్వతారోహణ చేసి వచ్చిన పూర్ణ, హీరో విజయ్‌దేవరకొండలాంటి సెలబ్రిటీలు మా సంస్థకు వచ్చి మా పిల్లల్తో గడిపారు. ఫౌండేషన్ స్థాపించిన మొదటి సంవత్సరం పిల్లవాడైన నాయుడు ఎంఏ సోషియాలజీలో గోల్డ్ మెడల్ సంపాదించాడు. ప్రస్తుతం ఇప్పుడు ఆ అబ్బాయి మా సంస్థలో మేనేజర్‌గా ఉన్నాడు. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో మా ఆస్తులను వారికి గ్యారెంటీగా పెట్టి పెళ్లి జరిపించాం.

                                                                                                                                                        – కాసోజు విష్ణు

Comments

comments