నాడు పోరు వేదన..నేడు ప్రగతి నివేదన

‘మీకు దమ్ముంటే.. ధైర్యం వుంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజలముందుకు రండి..ఎన్నికల బరిలో తేల్చుకుందాం..’ అని వొక ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ప్రతిపక్షాలు అనంగ చూసినం గని తెలంగాణల వుల్టావున్నది. ప్రభుత్వమే ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నది. “మీరు వుట్టిగనే బట్టకాల్సి మీదేస్తూ తప్పుడు విమర్శలు చేసుడుకాదు..మీము అధికారాన్ని వదులుకోని ప్రజలముందుకు వస్తున్నం… దమ్ముంటే ఎన్నికలకు సిద్దంకండి..ప్రజల ముందే తేల్చుకుందాం..” అని తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న టిఆరెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీకి సవాలు విసురుతున్నది. గమ్మతేందంటే…తాము విసరాల్సిన సవాల్‌ను […]

‘మీకు దమ్ముంటే.. ధైర్యం వుంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజలముందుకు రండి..ఎన్నికల బరిలో తేల్చుకుందాం..’ అని వొక ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ప్రతిపక్షాలు అనంగ చూసినం గని తెలంగాణల వుల్టావున్నది. ప్రభుత్వమే ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నది. “మీరు వుట్టిగనే బట్టకాల్సి మీదేస్తూ తప్పుడు విమర్శలు చేసుడుకాదు..మీము అధికారాన్ని వదులుకోని ప్రజలముందుకు వస్తున్నం… దమ్ముంటే ఎన్నికలకు సిద్దంకండి..ప్రజల ముందే తేల్చుకుందాం..” అని తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న టిఆరెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీకి సవాలు విసురుతున్నది. గమ్మతేందంటే…తాము విసరాల్సిన సవాల్‌ను ప్రభుత్వమే విసురుతుంటే ఆ సవాల్‌ను తొడగొట్టి స్వీకరించాల్సిన కాంగ్రెస్ పార్టీ… తప్పించుకునేందుకు సాకులు దోలాడుతున్నది. ఎన్టీఆర్ చంద్రబాబు వంటి వారు గతంలో చాలామంది ఇట్లనే ముందస్తుకు పోయి వోడిపోయిండ్రు…అని సలహాలు సూచనలిస్తున్నది. అంటే యేమిటి అర్థం.? …వొద్దు వొద్దు అట్లా ముందస్తుకు పోవడం వల్ల మీరు ఓడిపోతరు అంటూ టిఆరెస్ పార్టీ కి బాగుపడే’ సూచనలివ్వడం ఎందుకు.? బాక్సింగ్ బరిలో నిలిచిన వాడు వీరుడైతే ప్రత్యర్ధి తప్పులు చేయాలని చూస్తడు, అట్లా తప్పులు చేసినపుడు పంచ్ విసిరి పడగొడుతడు.. అదికదా స్పోర్టివ్ స్పిరిట్ అదే కదా యుద్ధనీతి..మరి వంద సంవత్సరాల చరిత్ర మాది అనిచెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఈ పాటి జ్నానం కూడా లేదా….? లేదు అని మనం అనుకోవాల్నా.? అంటే ఎందుకు లేదు వున్నది…కని భయపడుతున్నది..పైంగ నాకేం బయ్యంలేదు..నీను భయపడుతలేను అని చెప్పుకోవడానికి ఇటువంటి కూతలతోని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ ముందస్తు అంటుంటే..ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ముందేతుస్ మంటూ పారిపోతున్న విచిత్ర హాస్యాస్పద పరిస్థితి తెలంగాణలో నెలకొన్నది.

అన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తూ వొక్కదానికీ నిదర్శనాలుగానీ సాక్ష్యాధారాలు గానీ చూయించకుండా సంచులకు సంచులు బట్టగుడ్డలు మూటగట్టుకోని తెలంగాణ ప్రభుత్వం మీద కాల్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ తోక పార్టీలకు ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నయి.? వొక పాలక ప్రభుత్వమే స్వయంగా ప్రతిపక్షానికి ఎన్నికలకు పోదామని సవాల్ విసురుడేంది.? తమ అవసరాలకోసం ముందస్తుకు పోయిన చరిత్రను చూసినంకని, ప్రతిపక్ష పార్టీల తప్పులను ఎత్తిచూపేందుకు ముందస్తుకు పోయిన చరిత్ర వున్నదా.? మరెందుకట్లయితున్నది..? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజలముందల వొక ప్రతిపక్షంగా నిలవడలేక పోతున్నది.? ఎందుకు తన నిజాయితీని కోల్పోయింది.? తెలంగాణ ప్రగతికొరకు పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ అది వొదిలిపెట్టి, కష్టపడి ప్రగతిని సాధిస్తున్న పాలక పార్టీమీద అక్కసు ఎందుకు కక్కుతున్నది..? దీనిలోని ఆంతర్యమేంది.? కేవలం అధికారం కోసమే అయినా అదీ ప్రజలు మెచ్చేట్టు వుండాలెగని..అభివృద్ధిని అడ్డుకునే కార్యాచరణకు ఎందుకు పూనుకుంటది.? అనే విషయాన్ని యావత్ భారతదేశం ఆశ్చర్యంగా గమనిస్తున్నది. ఈ సవాల్ ప్రకటనల పరంపరను ప్రభుత్వ ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలుగానే చూడట్లేదు. దేశాన్ని అబ్బురపరిచే అభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ తదితర పార్టీల చేతకాని తనానికి స్వార్ధ రాజకీయాలకు నిదర్శనంగా తెలంగాణే కాదు, దేశం యావత్తూ గమనిస్తున్నది. ప్రజలకోసం పనిచేస్తున్న వొక ప్రభుత్వం ఇన్నితీర్ల కాల్లల్ల కట్టెలను అధిగమిస్తూ వస్తున్న తీరును, వాస్తవాల లోతును తర్కాన్ని అవగాహన చేసుకోవాల్సిన సందర్భం ఇది.

నాడు ఉద్యమ నివేదన
సెప్టెంబర్ 2 న జరుగబోయే ప్రగతినివేదన సభ వొక చారిత్రాత్మక సభగా నిలువ బోతున్నది. ఐతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటినుంచి నేటి వరకు కెసిఆర్ అధ్యక్షతన అనేక బహిరంగ సభలు జరిగినయి. చరిత్రను సృష్టించినయి. తెలంగాణకు ఆంధ్రా వలస పాలన చేస్తున్న తీరని నష్టాన్ని, తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని తెలిపే భావజాల వ్యాప్తిని ప్రజల్లోకి తీసుకుపోయిన సభలవి. ఆ సభలు చేసిన మరో పని యేందంటే…తమను తాము తక్కువగా వూహించుకుంటున్న తెలంగాణ ప్రజల మానసిక స్థైర్యాన్ని ఎత్తిపట్టి వొక ఆత్మవిశ్వాసాన్ని కలిగించినయి. మనం ఎంతగొప్పవాల్లమో అంత తక్కువగా ఆలోచించుకుంటున్నము అనే విషయాన్ని అర్థంచేయింనయి. తెలంగాణ ప్రజల్లోని బలాన్ని బయిటికి గుంజుకొచ్చి పోరాటంలో మమేకం చేసిన సభలుగా చరిత్ర సృష్టించనవి.

తెలంగాణ కోసం పోరాడుతున్న టిఆర్‌ఎస్ పార్టీని ఆంధ్రావాల్లతో కలిసి తెలంగాణలోని కాంగ్రెస్ తదితర పక్షాలు వుట్టుట్టిగనే విమర్శించేటివి. ఉద్యమించలేని, తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు గంపలు గంపలు గుడ్లు తెచ్చుకోని వాటిమీద ఈకలు పీకుకుంటా కూసునేవీ ప్రతిపక్షాలు. వారి తప్పుడు ఆరోపణలను తెలంగాణ కోసం ఉద్యమించలేని వారి చేతకాని తనాన్ని ప్రజా సభల ద్వారా ఎండగట్టి ప్రజల మద్దతును పరీక్షించుకునేది టిఆర్‌ఎస్ పార్టీ. ప్రతి వొక కీలక ఘట్టంలో కొన్ని చారిత్రక సందర్భాల్లో నాటి ఉద్యమనాయకుడుగా, ప్రజలను సమీకరించి వారికి తన ఆలోచనా విధానాన్ని విశదీకరించి వారి ఆమోదాన్ని పొంది కార్యాచరణను ప్రారంభించేవారు కెసియార్. అట్లా ప్రతిసందర్భంలో ప్రజలముందుకు పోయి కాంగ్రెస్ తదితర పార్టీల మీద వత్తిడి పెంచి ప్రజలముందు వాటితో ముక్కునేలకు రాయించి వారిని బలవంతంగా ఉద్యమంలోకి గుంజుకొచ్చిన చరిత్ర. దీనినింకా ఎవరూ మరులేదు.

కుక్కతోక వంకర అన్నట్టు…నాడు ఎట్లయితే ఉద్యమకాలంలో తెలంగాణను అడ్డుకునే చర్యలకు పూనుకుని ప్రజల తిరుగుబాటును చవిచూసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తిరిగి స్వయం పాలనలో అదే పంధాను అనుసరిస్తున్నది. తెలంగాణ విభజన సందర్భంగా మనకు దక్కాల్సిన సీలేరు విద్యుత్తు ప్రాజెక్టును ఏడు మండలాలను ఆంధ్రాకు కట్టబెట్టిందీపార్టీ. అడుగడుగునా తెలంగాణను ఆగం చేయబూనిన తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నేడు బరితెగించి అదే టిడిపితోని బహిరంగ పొత్తుకు సిద్ధడుతున్నది. తెలంగాణకు భారీ నష్టం కలిగించే, ఆంధ్రాకు ప్రత్యేక హోదాకు మద్దతుగా నిలబడుతున్నది. తెలంగాణ జీవధారగా నిర్మితమవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అడుగడుగునా అడ్డం పడుతూ వందలాది కేసులను వేసి ఆంధ్రాకు ప్రత్యక్షంగా సహకరిస్తున్నది. కేంద్రం నుంచి అన్ని తీర్ల అనుమతులు వచ్చీ శరవేగంగా పనులు పూర్తయితున్న నేపథ్యంలో యింకా కాళేశ్వరాన్ని అడ్డుకోవాలనే కుట్రలకు ఆజ్యం పోస్తూ రౌండు టేండు గాడిది గుడ్డు అనుకుంటా తప్పుడు సమావేశాలను నిర్వహిస్తూ తప్పుడు సమాచారాన్ని గుప్పిస్తున్నది. వొక్కటేమిటి…ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడుతున్న అంశాలు వందల సంఖ్యలో వున్నయి.. వాటినిక్కడ పేరు పేరునా ఉదహరించడానికి జాగసరిపోదు..ఈ సంగతి ప్రజలకూ అర్థమైంది. ఈ నేపథ్యంలో దొంగే దొంగ దొంగ అని అరుస్తూ.. వుల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అనే కాంగ్రెస్ విధానాన్ని ప్రజల ముందస్తుకు తీసుకుపోవాల్సిన అక్కెరున్నది. ఉద్యమకాలంలో మాదిరే కీలక సందర్భాల్లో ప్రజల ముందుకు పోయినట్టుగా.. నేడూ కాంగ్రెస్ దొంగ విధానాన్ని ఎండగట్టవలసిన సందర్భం వచ్చింది. అందులో భాగమే రేపటి చారిత్రాత్మక ప్రగతి నివేదన సభ..

నేడు ప్రగతి నివేదన
కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాల అసలు రంగును మరో మారు బయటపెడుతూనే గత నాలుగున్నరేండ్లుగా స్వయం పాలనలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అవి దేశంలోనే నెంబర్ వన్ గా రాష్ట్రం పురోగమిస్తున్న తీరును ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రభుత్వాధినేతగా తెలంగాణ ప్రగతిని అశేష జనవాహిని ముందల నివేదించనున్నారు. తెలంగాణ వస్తది సరెగని పాలనెట్ల.? అని అనుమానంతో మాట్లాడిన నోల్లు ఇవాల వూహించని రీతిలో తెలంగాణ పురోగతిని చూసి ఆశ్యర్యంతో తెరుచుకుంటున్నవి. పాలనకు మానవత్వం జోడయితే ఎట్లుంటదో ముఖ్యమంత్రి కెసియార్ ప్రవేశ పెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి తెలుసుకుంటున్నది దేశం. సాంకేతికాభివృద్ధిని ప్రజా సంక్షేమానికి వినియోగించడం ఎట్లనో కాళేశ్వరం ప్రాజెక్టు నేర్పుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్దదయిన ఎత్తిపోతల పథకంగా చరిత్ర సృష్టించబోతున్నది.

వొకనాడు పాలక వర్గాలకు అప్రాధాన్యతాంశాలుగా నిలిచిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, రైతు మొదలకుని దళిత మైనారిటీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం, విద్యా వైద్యం, శాంతి భద్రతలు, మౌళిక వసతుల కల్పన కుటుంబం బాలబాలికలు మహిళలు వృద్ధ్దులు వికలాంగులు ఎంబిసిలు సంచార జాతులు తదితర విస్మరించబడిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ విధానాలు నేడు జాతి దృష్టిని ఆకర్షిస్తున్నవి. యింకా చెప్పుకుంటూ పోతే రైతుబంధు రైతుబీమా కంటివెలుగు భూప్రక్షాళన కెసిఆర్ కిట్ కళ్యాణ లక్ష్మి శాదీముబారక్ మిషన్ భగీరథ వంటి 400 వలకు పైగా ఎంతచెప్పిన వొడువని పథకాలు అమలులోకి వచ్చి యివాల తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైపోయినయి. ‘కడుపుల పిండం పడ్డ కాంచి కాట్లే పిండం పెట్టేదాకా…అన్నట్టుగా.. ప్రజాసంక్షేమమే పరమావధిగా అమలుపరుస్తున్న పథకాలకు బడ్జెట్ లో ప్రాధాన్యతలను రూపొందించిన ప్రభుత్వం ఈ దేశంలనే లేదంటే అతిశయోక్తికాదు. ఇదంతా ఎట్లా సాధ్యమైతున్నది మరి.? అంటే తెలంగాణ కష్టాలను తెలిసిన తెలంగాణను సాధించుకొచ్చిన ఉద్యమనాయకుడే ముఖ్యమంత్రిగ వుండడం వలన సాధ్యమైతున్నది.

అదే..టిఆరెస్ లేని తెలంగాణ ప్రభుత్వాన్ని వొక్క సారి వూహించుకోండి…కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కనుక ఈ నాలుగేండ్లు నడిచి వుండివుంటే..ఎట్లా వుండేదో అర్థం చేసుకోండి.? ఎన్నికొట్లాటలో ఎన్నిసార్ల ముఖ్యమంత్రులు మారేవారో.? వీల్ల సందుల ఆంధ్రా గుంటనక్కలు జొరబడి ఎంత ఆగం చేసేవాల్లో తెలంగాణను …వూహించుకుందానికే భయమైతున్నది కదా.? దేశంల గుర్తింపు పక్కకు పెట్టు.. ఎందుకు తెచ్చుకున్నంరా నాయిన తెలంగాణను అని నెత్తినోరు కొట్టుకుంటూ రోడ్లమీద పడి మొత్తుకునే వాల్లం, ఇదే కాంగ్రెస్ పార్టీనే గనుక ఈ నాలుగేండ్లు తెలంగాణను నడిపివుంటే. అటువంటి భయంకర వూహించనలవిగాని పరిస్థితిని కోరి కోరి తెచ్చుకోవడానికి విజ్జత కలిగిన ప్రజలెవరూ సాహసించరు. విశాదమేందంటే…కాంగ్రెస్ పార్టీని అధికార పక్షంగాకంటే బలమైన ప్రతిపక్షంగా చూడాలనుకుంటున్న తెలంగాణ ప్రజలకు తాము అత్యంత బలహీనులమని గత నాలుగేండ్ల కాలంలో కాంగ్రెస్ నిరూపించుకున్నది.

బలహీనులమే కాదు అధికారమే పరమావధిగా ఎంతటి స్వార్థ రాజకీయాలకైనా తెగబడుతామని తమ అభివృద్ధిని అడ్డుకునే చర్యల ద్వారా నిరూపించుకున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను ముంచాలని చూసే పక్కరాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే టిడిపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా మరో మారు తన నిజస్వరూపాన్ని ప్రదర్శించబోతున్నది. ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి కనీస ప్రతిపక్ష హోదాకూడా ఈసారి కట్టబెట్టబోమని ఇప్పటికే తెలంగాణ సమాజం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సెప్టెంబర్ 2 న కొంగర కలాన్‌లో జరుగనున్న ప్రగతి నివేదన సభ…తెలంగాణ కోసం ఉద్యమకాలంలో చేసిన పోరాట స్పూర్తిని ప్రదర్శించబోతున్నది. సాధించుకున్న తెలంగాణను బంగారి తెలంగాణ దిశగా తీసుకపోయే క్రమంలో.. ఉద్యమకాలం నాటి పోరు వేదన సభల స్పూర్తితో …గత నాలుగేండ్ల స్వయం పాలనలో పోరాడి సాధించిన ప్రగతిని ప్రజలముందు నివేదించనున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఈ సభలో ప్రతిఇంటినుంచి ఇద్దరు అన్నట్టుగా పాల్గొని కెసియార్ ఆలోచనా విధానాన్ని నేటి వరకు సాధించిన ప్రగతిని బలపరుద్దాం. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధ్ది చెందుతున్న రాష్ట్రంగా దూసుకువస్తూ, బంగారి తెలంగాణ దిశగా సాగుతున్న ప్రయాణానికి మార్గాన్ని మరింత సుగమం చేద్దాం.