నాటక సినీరంగాల మేటి గిరీష్ కర్నాడ్

ఎన్నో గడబిడల మధ్య, అవ్యవస్థల మధ్య, కోలాహలాల మధ్య వాస్తవమనిపించే ఊహను అర్థం చేసుకోవడమే నాటక దర్శనం! – అని అంటారు జ్ఞానపీఠ్ గ్రహీత, నాటక రచయిత గిరీష్ కర్నాడ్. పాఠకులకు, రచయితలకు మధ్య సంభాషణ, రచన ద్వారా నేరుగా జరుగుతుంది. నాటకం పరిస్థితి వేరు. నాటకం ఒకరు రాస్తే, దానికి మరొకరు దర్శకత్వం వహిస్తారు. వేరు వేరు నటులు పాత్రలు పోషిస్తారు. వీరందరి సమిష్టి కృషి వల్లనే ప్రేక్షకుల్లో రసోత్పత్తి జరుగుతుంది. అందుకే ఆనంద వర్ధనుడు […]

ఎన్నో గడబిడల మధ్య, అవ్యవస్థల మధ్య, కోలాహలాల మధ్య వాస్తవమనిపించే ఊహను అర్థం చేసుకోవడమే నాటక దర్శనం! – అని అంటారు జ్ఞానపీఠ్ గ్రహీత, నాటక రచయిత గిరీష్ కర్నాడ్.
పాఠకులకు, రచయితలకు మధ్య సంభాషణ, రచన ద్వారా నేరుగా జరుగుతుంది. నాటకం పరిస్థితి వేరు. నాటకం ఒకరు రాస్తే, దానికి మరొకరు దర్శకత్వం వహిస్తారు. వేరు వేరు నటులు పాత్రలు పోషిస్తారు. వీరందరి సమిష్టి కృషి వల్లనే ప్రేక్షకుల్లో రసోత్పత్తి జరుగుతుంది. అందుకే ఆనంద వర్ధనుడు భరతుడి నాట్యశాస్త్రం నుండి రససిద్ధాంతం స్వీకరించాడు. నాటకంలో రస ప్రక్రియ సంక్షిప్తంగా ఉంటుంది. అది ఒక సామూహిక అనుభవం. నాటకం చూడడమంటే ఎన్నెన్నో గందరగోళాల మధ్య, ఒక ఇమేజరీని అర్థం చేసుకోవడం – అని అన్నారు కర్నాడ్.
సమకాలీన భారతీయ నాటకరంగానికి పెద్దదిక్కు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీష్ కర్నాడ్ తన అరవై ఒకటవ యేట చిన్న వయసులోనే జ్ఞానపీఠ్ స్వీకరించారు. బహుశా ఈ అవార్డు స్వీకరించిన తొలి నాటక కర్త ఈయనే ! శివరామ్ కారంత్ వంటి కన్నడ మహా రచయితలు నాటకాలు రాసినా, వారు నవలలు కూడా రాశారు. గిరీష్ కర్నాడ్ ప్రత్యేకత ఏమిటంటే ఏ ఇతర సాహితీ ప్రక్రియల జోలికి పోకుండా కేవలం వేళ్ళ మీద లెక్కించగలిగినన్ని నాటకాలు మాత్రమే రాసి, దేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారానికి ఎన్నిక కావడం! ఆయన రాసినవి కొద్ది నాటకాలే అయినా, ప్రతి రచనా భారతీయ నాటక రంగం మీద మైలు రాయిలా నిలిచిపోయింది. యయాతి (1961), తుగ్లక్(1964), హట్టన హుంజ (త్యాగం1967), హయవదన (1970), నాగమండల (1988), తలెదండ (1990), అగ్నిమత్తు మాలె, అంజు మల్లిగె, హిత్తినా హుంజా, మానిషాద (రేడియో నాటికలు), ద డ్రీమ్స్ ఆఫ్ టిప్పూ సుల్తాన్……వగైరా! నాటక కర్తగా కర్నాడ్ అంతర్జాతీయ ఖ్యాతినార్జించారు. ఆయన నాటకాల గూర్చి చర్చించకుండా సమకాలీన భారతీయ నాటక రంగం గురించి వ్యాఖ్యానించడం, అర్థం చేసుకోవడం కుదరదు.
ఇబ్సన్ రాసిన నాటకాలు, సత్యజిత్‌రే తీసిన సినిమాలు చాలా తక్కువ అయినా, వారికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఆ విధంగా గిరీష్ కర్నాడ్ రాసింది కూడా తక్కువే. స్థాయీ ప్రమాణాలు గణన లోకి తీసుకుంటే, ఆయనకు రావల్సిన గుర్తింపు వచ్చింది. అయితే ఉదర పోషణార్థం వ్యాపార సినిమాల్లోనూ, టెలీ సీరియల్స్‌లోనూ నటించక తప్పలేదు. నాటకాలు రాస్తూ కూచుంటే వెంటనే డబ్బులు రావు. ఒక వ్యక్తిగా కుటుంబ బరువు బాధ్యతలు మోయాలంటే డబ్బు చాలా అవసరం. డబ్బు కోసం మనసును చంపుకుని కొన్ని పనులు చేయాల్సివచ్చిందని ఆయన అనేక సార్లు చెప్పుకున్నారు.
బాల్యంలో గిరీష్ కర్నాడ్ తమ ఇంటి జీతగాళ్ళతోపాటు నాటకాలు, యక్షగానాలు చూడడానికి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి వెళ్ళేవాడు. ఆ నాటకాలు అతని మీద ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఆ అద్భుత రంగుల ప్రపంచాన్ని తన స్వంతం చేసుకోవాలనుకున్నారు. గిరీష్. ఇంగ్లీషులో కవిత్వం రాద్దామనుకున్నవాడల్లా రంగస్థలానికి నాటకాలు రాసాడు. అప్పటికి నాటకరంగం మీద అతనికి అవగాహన రాలేదు. కొంచెం పెరిగి పెద్దయ్యాక ముంబయిలో అల్హాజీ దర్శకత్వంలో ప్రదర్శించిన ‘ మిస్ జూలీ’ నాటకాన్ని చూసాడు. అందులో పాత్రల ప్రవేశం, నిష్క్రమణం, లైట్లు ఫేడ్ ఇన్ కావడం, ఫేడ్ అవుట్ కావడం, మంద్రస్థాయిలో వినిపించే సంగీతం వగైరాలన్నీ అతనిమీద తీవ్రంగా ప్రభావం చూపాయి. అదిగో అప్పుడే తాను తప్పక నాటక కర్త కావాలని నిర్ణయించుకున్నాడు. కొంత సాంకేతిక పరిజ్ఞానం అలవడిన తర్వాత, ఆయన రాసిన నాటకాలు ఒక నిర్దుష్టతను సంతరించుకున్నాయి. దానికి తోడు రోడెస్ (RHODES) స్కాలర్‌షిప్‌తో ఆక్స్‌ఫర్డ్‌లో చదవడానికి వెళ్ళినపుడు అక్కడ లండన్ రంగస్థలాన్ని అధ్యయనం చేసారు కర్నాడ్. ఇలియట్, ఆడెన్‌ల జన్మభూమి అయిన ఐర్లాండులోనే స్థిరపడిపోదామనుకున్నారు కూడా! కానీ, ఆయన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వారికోసం వెనక్కి తిరిగి వచ్చారు.
గిరీష్ కర్నాడ్ నాటకాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఆయన తన రచనలకు ఎప్పుడూ కథ సమకూర్చుకోలేదు. పురాణాలనుండి, జానపద గాథల నుండి మాత్రమే కథల్ని ఎంచుకున్నారు. ఈ రెండూ కాకపోతే ఒక్కోసారి చారిత్రక ఘట్టాలను నాటకీకరణ చేశారు. ఒక కొత్త కథను సృష్టించడంకన్నా, అందరికీ తెలిసిన కథనే తనదైన శైలిలో ఆయన అద్భుతంగా తీర్చి దిద్దుతూ ఉంటారు. కర్నాడ్ తన నాటకాలన్నింటినీ ఇంగ్లీషులో రాశారు. అవి పలు భారతీయ భాషల్లోకి సుళువుగా అనువాదమయ్యాయి. కొన్ని తెలుగులోకి కూడా వచ్చాయి. చదువుకునే రోజుల్లో గణితం ఆయనకు అభిమాన విషయంగా ఉండేది. కానీ అది జీవితంలో ఎక్కువగా ఉపయోగ పడలేదు. కానీ, సూక్ష్మీకరణలు, ఫార్ములాలసారం, నాటకాల్లో పాత్రల మధ్య అనుబంధాల సమతుల్యం సాధించడానికి ఉపయోగపడిందని చెప్పుకున్నారాయన. నాటక కర్తగానే కాక, సినీ దర్శకుడిగా, నటుడిగా కూడా ఆయన తన ప్రత్యేకతల్ని చాటుకున్నారు. ‘గోధూళి’ ‘ఉత్సవ్’ వంటి హిందీ చలనచిత్రాలు ఆయనను మొదటి స్థాయి దర్శకుడిగా నిలబెట్టాయి. కళాత్మక చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న ‘ఉత్సవ్’ వ్యాపారపరంగా కూడా విజయవంతమైంది. పట్టాభి దర్శకత్వంలో వెలువడిన ‘సంస్కార’ కన్నడ చిత్రంలో ఆయన నటన అద్భుతం!
ఆయన నటనను సెల్యులాయిడ్ మీద ఒక కవితగా అభివర్ణించారు విశ్లేషకులు. శ్యాం బెనెగల్ హిందీ చిత్రాలు’నిశాంత్’ ‘మంథన్’ లలోనూ ,బి.వి. కారంత్ దర్శకత్వంలో వెలువడిన కన్నడ చిత్రం ‘వంశవృక్ష’ లోనూ, ‘స్వామి’ హిందీ చిత్రంలోనూ ఆయన నటన భారతీయ ప్రేక్షకుల హృదయాల మీద చెరగని ముద్ర వేసింది. ‘ఖాందాన్’ ‘మాల్గుడి డేస్’ ‘అప్నా ఆస్‌మాన్’ వంటి దూరదర్శన్ హిందీ సీరియల్స్ ద్వారా ఆయన దేశంలోని ఆబాలగోపాలానికి పరిచితులయ్యారు.ఎన్నో తెలుగు చలన చిత్రాలలో కూడా నటించిన కర్నాడ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సన్నిహితుడే. అయితే తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాల్లోనూ, తను స్క్రిప్టు సమకూర్చిన నాటకాల్లోనూ ఆయన నటించలేదు. అలా నటించకూడదని ఆయనే తనకుతాను ఒక నియమం పెట్టుకుని, కొన్ని విలువల్ని పరిరక్షించారు. ‘టర్నింగ్ పాయిం ట్’ ఇంగ్లీషులో వెలువడ్డ దూరదర్శన్ సైన్స్ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించి విద్యార్థి లోకానికి, పరిశోధక ప్రపంచానికి దగ్గరివాడయ్యారు.
పూనాలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) కు డైరెక్టర్‌గా పని చేసిన గిరీష్ కర్నాడ్, బాధ్యతాయుతమైన పరిపాలకుడిగా పేరు గడించాను. ఆ రకంగా కళారంగానికి తన సేవలందించాడు.
మోహన్ రాకేశ్, బాదల్ సర్కార్, విజయ్ టెండూల్కర్‌ల వంటి ప్రయోగాత్మక నాటక ప్రయోక్తల్ని ; సత్యజిత్ రే, మృణాల్ సేన్, శేఖర్ కపూర్ వంటి సినీ దర్శకుల్ని అభిమానించే కర్నాడ్, తను వారి స్థాయిని అందుకోలేక పోయానని అసంతృప్తి ప్రకటించేవారు. అయితే భారతీయ విమర్శకులు, ప్రేక్షకులు మాత్రం ఆయనను ఉన్నతశ్రేణి నాటకకర్తగా, చిత్రదర్శకుడిగా నటుడిగా గుర్తించారు. అభిమానించారు. కర్నాడ్ ముఖ్యంగా తన మీద ఎవరి ప్రభావమూ లేకుండా జాగ్రత్త పడ్డారు. రచనలో, నటనలో, దర్శకత్వంలో ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి నిరంతరం ప్రయత్నించిన కళాజీవి ఆయన! దేశంలో సీనియర్ రచయిత, దర్శకుడు. ఆయన లివింగ్ లెజెండ్.

డా.దేవరాజు మహారాజు
9908633949

Related Stories: