నవలా ప్రపంచంలో ‘రాణి’

పదిహేనేళ్లకే కథలు రాయడం మొదలు పెట్టారు సులోచనారాణి. ఆమె కథ ఆంధ్రపత్రిక వీక్లీలో ప్రచురితమై పేరూ, డబ్బూ తెచ్చి పెట్టింది. అలా రచనా రంగప్రవేశం చేశారు. పాఠకుల ప్రసంసలే ఆమెకు ఊపిరిపోసి, మరిన్ని రచనలు చేసేవిధంగా ప్రోత్సహించాయి. నార్ల వెంకటేశ్వర్రావు, యువ చక్రపాణిలాంటి పెద్దల ఆదరాభిమానాలు పొందడం తన అదృష్టంగా చెప్పుకునేవారు. స్త్రీలు కాల్పనిక సాహిత్యంలో మేటిగా రాణిస్తున్న కాలంలో సులోచనారాణి తనదైన సొంత మార్గంలో ఎన్నో నవలలు రాశారు. ఆమె రచనల్లో మధ్యతరగతి మహిళల పట్ల […]

పదిహేనేళ్లకే కథలు రాయడం మొదలు పెట్టారు సులోచనారాణి. ఆమె కథ ఆంధ్రపత్రిక వీక్లీలో ప్రచురితమై పేరూ, డబ్బూ తెచ్చి
పెట్టింది. అలా రచనా రంగప్రవేశం చేశారు. పాఠకుల ప్రసంసలే ఆమెకు ఊపిరిపోసి, మరిన్ని రచనలు చేసేవిధంగా ప్రోత్సహించాయి. నార్ల వెంకటేశ్వర్రావు, యువ చక్రపాణిలాంటి పెద్దల ఆదరాభిమానాలు పొందడం తన అదృష్టంగా చెప్పుకునేవారు. స్త్రీలు కాల్పనిక సాహిత్యంలో మేటిగా రాణిస్తున్న కాలంలో సులోచనారాణి తనదైన సొంత మార్గంలో ఎన్నో నవలలు రాశారు. ఆమె రచనల్లో మధ్యతరగతి మహిళల పట్ల ప్రేమ, ఆప్యాయతలు కనిపిస్తాయి. సగటు మహిళ జీవితం ఆధారంగా సులోచనారాణి రచనలు సాగాయి. స్త్రీల ఆత్మాభిమానం గురించి ఆమె తన రచనల్లో చాలా బాగా ఎలివేట్ చేసేవారు. సులోచనారాణి రాసిన సెక్రటరీ నవల ఇప్పటికీ ఆదరణ పొందడం అందుకు నిదర్శనం. మధ్యతరగతి మహిళల ఊహలను, వాస్తవ జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చిత్రించారు. భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, ప్రధానాంశంగా తనదైన శైలిలో అరుదైన రచనలు చేశారు.
1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు సులోచనారాణి. తను పరిశీలించిన జీవితాలను వస్తువులుగా తీసుకుని రచనలు చేయడం మొదలుపెట్టింది. సజీవపాత్రలకు దగ్గరగా ఉండేలా ఉంటాయి వీరి పాత్రలు. మధ్యతరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఎక్కువగా కోటీశ్వరుడైన నాయకుడు, కిందిస్థాయి నాయిక వీరిద్దరి మధ్య ఏర్పడ్డ ప్రేమ, ఇదీ ఆమె నవలల్లోని ఫార్ములా.
ఆగమనం, ఆరాధన , ఆత్మీయులు, అభిజాతం, ఆశల శిఖరాలు, దాంపత్య వనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కల్యాణం ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు. నవలల్లో ఇళ్లు, పరిసరాలు, ప్రకృతి, మానసిక వర్ణనలు సహజత్వాన్ని, సందర్భాన్ని, సన్నివేశాన్ని బట్టి సాగుతాయి. వీరి నవలా పాత్రలు విచిత్ర మానసిక సంఘర్షణకు లోనవుతుంటాయి. అందువల్లే సాధారణ ప్రజలకు వీరి నవలలు మరింత దగ్గరయ్యాయి. చదివే పాఠకులకు ఆసక్తిని ఉత్కంఠను రేపడంలో సులోచనారాణి అందెవేసిన చేయి.
సులోచనారాణి మొదటిసారిగా ‘చదువుకున్న అమ్మాయిలు’ చిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టారు. 1965లో ‘మనుషులు మమతలు’ సినిమాకు కథను అందించారు. 1970వ దశకంలో యద్దనపూడి సులోచనారాణి రచనలు సినీ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపాయి. ఈమె రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమలేఖలు, బంగారు కలలు, విచిత్రబంధం, జైజవాన్, ఆత్మగౌరవం లాంటి నవలలు సినిమాలుగా వచ్చాయి. సెక్రటరీ మాత్రం ఓ లెజెండ్‌గా మిగిలిపోయింది. మీనా నవల పత్రికలో ధారావాహికగా వచ్చింది. పేరును పాఠకులే నిర్ణయించారు. చివరకు మీనా నవలను 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించి సినిమాగా తీశారు. ప్రముఖ చానల్‌లో వచ్చిన రాధామధు సీరియల్ సులోచనారాణిదే. నేటికీ చాలామంది పాఠకుల హృదయాల్లో వీరి నవలలు నిక్షిప్తమై ఉన్నాయి. చాలా మంది పాఠకులు నేటికీవీరి రచనలను విస్తృతంగా చదువుతున్నారు. తన రచనలతో పాఠకుల మనసులు దోచుకున్న యద్దనపూడి సులోచనారాణి (79) అమెరికాలోని కాలిఫోర్నియాలోని కుపర్టినోలో గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మరణం తెలుగు పాఠక లోకానికి తీరనిలోటు.

Comments

comments

Related Stories: