నందమూరింట మరో విషాదం

అచ్చిరాని 2323 ఒకే కుటుంబంలో ఇద్దరు దుర్మరణం మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : నందమూరి కుటుంబానికి నల్లగొండ జిల్లా రోడ్లు గండంగా పరిణమిస్తున్నాయి. ప్రత్యేకించి నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల బారిన పడ డం చూస్తుంటే విధి వెం టాడుతుందా అన్న అనుమానాలు కల్గకమానదు. జిల్లాలోనే నాలుగేల్ళ వ్యవధిలో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు నందమూరి కుటుంబాన్ని కుంగదీశాయి. నందమూరి హరికృష్ణ కుటుంబంలో ఇద్దరు పెద్దలను జిల్లాలో జరిగిన […]

అచ్చిరాని 2323
ఒకే కుటుంబంలో ఇద్దరు దుర్మరణం

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : నందమూరి కుటుంబానికి నల్లగొండ జిల్లా రోడ్లు గండంగా పరిణమిస్తున్నాయి. ప్రత్యేకించి నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల బారిన పడ డం చూస్తుంటే విధి వెం టాడుతుందా అన్న అనుమానాలు కల్గకమానదు. జిల్లాలోనే నాలుగేల్ళ వ్యవధిలో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు నందమూరి కుటుంబాన్ని కుంగదీశాయి. నందమూరి హరికృష్ణ కుటుంబంలో ఇద్దరు పెద్దలను జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలే పొట్టనపెట్టుకున్నాయి. విధి వంచితమో, కాకతాళీయమో కాని నందమూరి కుటుంబంలో ఊహించని విదంగా తీరని విషాధాన్ని నింపాయి. ఒకరి మరణం మరువక ముందే మరో మరణం తెలుగురాష్ట్రాల్లో చరిత్ర కలిగిన ఒకే కుటుంబంలో చోటుచేసుకోవడం అభిమానులు, అనుచరులను కుంగదీస్తోంది. నాలుగేళ్ళ వ్యవధిలోనే హరికృష్ణతో పాటు ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ మృత్యువాతపడడం చిన్నవారైన కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లను కోలుకోలేని దెబ్బ తీసిందినే చెప్పాలి. ఈ పరిణామాలన్నింటికీ నల్లగొండ జిల్లా రోడ్డు ప్రమాదాలు కారణభూతం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విధి వెంటపడినచందంగా ఒకే కుటుంబంలో ఇద్దరిని బలిగొనడం, జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ డం వంటి పరిణామాలు భయకంపితులను చేస్తుందని కుటుంబసభ్యుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. తొలుత ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో 2009లో అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారం లో భాగంగా ఖమ్మం పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరుగుప్రయాణంలో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం మెతె క్రాస్‌రోడ్డు వద్ద ఆదుపుతప్పి చెట్టు ను ఢీకొట్టి బోల్తాపడగా ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ తలకు బలమైన గాయాలు కాగా,ఆయనతో పాటు న్నటువంటి స్నేహితులు రాజీవ్‌కనకాల, హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. అదే విదంగా హరికృష్ణ పెద్దకుమారుడు జానకిరామ్ 2014లో నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సాయంత్రం సమయంలో 6.30గంటలకు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి 65పై తానే స్వయంగా కారు నడుపుకుంటూ ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. అప్పుడు జానకిరామ్ ప్రయాణించిన కారు నెంబర్ ఏపీ 29బీడీ 2323గా గుర్తించారు. కాగా తాజాగా బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కూడా తానే స్వయంగా కారు నడుపుకుంటూ అజాగ్రత్త వల్ల దుర్మరణం పాలయ్యారు. హరికృష్ణ శుభకార్యానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి నెల్లూరు కు వెళ్తూ అతివేగంతో కారులో ప్రయాణిస్తూ ఫల్టీ కొట్టడం మూలంగా తలకు బలమైన గాయాలై మరణించారు. ఈ నేపధ్యంలోనే నల్లగొండ జిల్లా నందమూరి కుటుంబంలోని వారికి ప్రమాదాలు నిలయంగా మారిందని చెప్పుకుంటున్నారు. అయితే నల్లగొండ జిల్లాలోనే నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఏదేమైనా అతివేగం, నిలువెత్తు నిర్లక్షం,భారీ వాహనాల్లో స్వీయ డ్రైవిం గ్ వంటి అజాగ్రత్త చర్యల మూలంగానే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అనుభవాలు కూడా అదే స్పష్టం చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి నల్లగొండ జిల్లాలో గడిచిన నాలుగు సంవత్సరాల్లో నందమూరి హరికృష్ణ కుటుంబంలో రోడ్డు ప్రమాదాల ద్వారా ఇద్దరు దుర్మరణం పాలుకాగా, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తృటిలో తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్నారు. దీంతో నల్లగొండ జిల్లా నందమూరి కుటుంబపై కక్షకట్టిందా అన్న అనుమానం హరికృష్ణ కుటుంబ సభ్యుల్లో నెలకొందని కొందరు అభిమానులు చెబుతున్నారు.

కామినేని వద్ద నేతల నివాళి

దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి

మన తెలంగాణ/కట్టంగూర్/నార్కట్‌పల్లి : మాజీ మంత్రి, సినీ నటుడు, టీడిపి రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ (61) హఠాన్మరణంతో సినీరంగ ప్రముఖులు, అటు రాజకీయ నేతలు బాధతప్త హృదయాలతో శ్రద్ధాంజలి ఘటించారు. బుధవారం నల్లగొండ జిల్లా పరిధిలోని నార్కట్‌పల్లి, అద్దంకి రహదారిపై గల అన్నెపర్తి స్టేజీవద్ద నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు ఉదయం 6 గంటలకు ప్రమాదవశాత్తు అదుపుతప్పి, పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఉదయం 6:15 నిమిషాలకు చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. సుమారు గంటపాటు చికిత్స పొందుతూ, కామినేని ఆసుపత్రిలో నందమూరి హరికృష్ణ తుదిశ్వాస విడిచారు. తన తండ్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న తనయులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు హైదరాబాద్‌నుండి బయలుదేరి కామినేని ఆసుపత్రికి ఉదయం 8 గంటలకు చేరుకున్నారు. తన తండ్రి హరికృష్ణ భౌతిక కాయాన్ని చూసి, బోరున విలపిస్తూ, కన్నీటిపర్యంతమయ్యారు. అదేవిధంగా నందమూరి హరికృష్ణ సోదరుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి చేరుకొని, హరికృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి, కన్నీటిపర్యంతమై, గుండెలు బాదుకున్నారు. అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపి సీనియర్ నాయకులు దగ్గుపాటి పురంధేశ్వరి కామినేని ఆసుపత్రిని సందర్శించారు. అదేవిధంగా సినీ నటుడు జగపతిబాబు, కొడాలి నాని, సినీ డైరెక్టర్ త్రివిక్రమ్‌లు హరికృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ అకాల మరణం చెందిన విషయాన్ని తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ నియోజకవర్గ ఇంఛార్జి కంచర్ల భూపాల్‌రెడ్డిలు హుటాహుటిన నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి చేరుకొని, నందమూరి హరికృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. హరికృష్ణకు పోస్టుమార్టం చేసేందుకు వారిరువురు నల్లగొండ జిల్లా కలెక్టర్ డా॥ గౌరవ్ ఉప్పల్ , ఎస్పీ ఏవి రంగనాధ్‌ల పర్యవేక్షణలో పూర్తి ఏర్పాట్లు చేసారు.
హరికృష్ణ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపి సీఎం చంద్రబాబు నాయుడు
సినీహీరో, మాజీమంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లా పరిధిలోని అద్దంకి రహదారిపై గల అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందడం పట్ల ఏపి సీఎం నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసారు. విషయం తెలుసుకున్న సీఎం వెంటనే అమరావతినుండి తన తనయుడు నారా లోకేష్‌తో కలిసి, హెలికాఫ్టర్‌లో అన్నెపర్తి 12వ బెటాలియన్‌కి బయలుదేరారు. 11ః01 నిమిషానికి అన్నెపర్తి వద్ద హెలికాఫ్టర్‌లో దిగి, మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో కలిసి రోడ్డుమార్గాన నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రి 11ః10 నిమిషాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ కేడ్లు, రూఫ్ తాళ్లతో ఎస్పీ రంగనాధ్ కామినేని ఆసుపత్రి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. విషయం తెలుసుకున్న టీడిపి కార్యకర్తలు, అభిమానులు, పరిసర గ్రామాల నుండి వందలాది మంది ప్రజలు కామినేని ఆసుపత్రికి పోటెత్తారు. కామినేని ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ఆసుపత్రిలో ఉన్న హరికృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. అనంతరం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్యులను పిలిపించి, కామినేని ఆసుపత్రిలోనే నందమూరి హరికృష్ణకు శవపరీక్ష నిర్వహించారు. అనంతరం 12ః50 నిమిషాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో నందమూరి హరికృష్ణ భౌతిక కాయాన్ని హైదరాబాద్‌కు తరలించారు. నివాళులు అర్పించినవారిలో నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, నలబోతు భాస్కర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీటిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌వి రమణ, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాల్వాయి రజనీకుమారి, కామినేని ఆసుపత్రి ఎండి కామినేని సూర్యనారాయణరావ్, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ రంగనాథ్, డిఆర్‌డిఏవో అసిస్టెంట్ డైరెక్టర్ రింగు అంజయ్య తదితరులు ఉన్నారు.

చైతన్యరథంలోనే అంతిమయాత్ర హరికృష్ణ భౌతికకాయానికి సిఎం కెసిఆర్ నివాళి

మన తెలంగాణ / హైదరాబాద్ : సినీ నటుడు, రాజకీయవేత్త హరికృష్ణ నల్లగొండ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ మెహిదీపట్నంలో భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తీవ్ర సానుభూతిని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సన్నిహిత అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కెసిఆర్ తీవ్ర దుఃఖంలో ఉన్న జూనియర్ ఎన్‌టిఆర్‌ని ఓదార్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నప్పటికీ మెహిదీపట్నం నుంచి అంతిమయాత్ర ‘చైతన్యరథం’లోనే జరుగుతుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించింది మొదలు చివరి వరకూ ఆయన వాడిన చైతన్యరథంకు హరికృష్ణ డ్రైవర్‌గానే వ్యవహరించారని, అంతిమయాత్ర సైతం ఆ వాహనంలోనే జరపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. చైతన్యరథానికి దశాబ్ద కాలానికి పైగా సారథి (డ్రైవర్)గా కొనసాగిన హరికృష్ణ తన తండ్రి చేత సమర్ధుడైన డ్రైవర్ అని కితాబునందుకున్నారు. తన డ్రైవింగ్‌తో రాష్ట్రవ్యాప్తంగా చైతన్యం రథం మీద ఎన్‌టిఆర్‌ను తిప్పిన హరికృష్ణ చివరకు డ్రైవింగ్ పొరపాటుతోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

అంత్యక్రియలకు ఏ లోటు రానివ్వం : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో దివంగత నందమూరి హరికృష్ణ అంత్యక్రియలకు ఏ లోటు లేకుండా చేస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. వారి కుటుంబ సభ్యుల అభ్యర్ధన మేరకు గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్తానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రెవిన్యూ, పోలీసు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలిపారు. మాజీ మంత్రిగా, ఎంపిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు హరికృష్ణ ఎంతో సేవచేశారన్నారు. సోదరులు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు కూడా హరికృష్ణ మృతి పట్ల తమ విచారం వ్యక్తం చేశారు.

దురదృష్టకరం : మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరమని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తండ్రి, కొడుకులు (జానకీరామ్)లు ఒకే ప్రాంతంలో యాక్సిడెంట్‌లో చనిపోవడం విచారకరమన్నారు. ఆయన మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేస్తూ హరికృష్ణ కుటుంబ సభ్యులకు హరీశ్‌రావు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.