ధోనీ, కోహ్లి వల్లే ఈ స్థాయికి : రవీంద్ర జడేజా

               ravindra-jadeja

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లిల వల్లే తాను అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా ఎదిగానని భారత స్టార్ రవీంద్ర జడేజా అభిప్రాయ పడ్డాడు. ఇద్దరు కూడా తనకు కావాల్సినంత ప్రోత్సాహం అందించారని తెలిపాడు. ప్రారంభంలో కెప్టెన్ ధోనీ ప్రతి సిరీస్‌లో తనకు అండగా నిలిచే వాడన్నాడు. క్లిష్ట సమయంలో కూడా ధోనీ వెన్నంటి ఉన్నాడని వివరించాడు. అతనిచ్చిన మనోధైర్యం వల్లే తన ఆట గాడిలో పడిందన్నాడు. వరుస వైఫల్యాలు చవిచూసినప్పటికీ ధోనీ తనపై నమ్మకం ఉంచాడన్నాడు. ఇది తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నాడు. అతనిచ్చిన ప్రోత్సాహం, సహకారం ఎప్పటికీ మరచిపోనని జడేజా స్పష్టం చేశాడు.

ఇక, ప్రస్తుత కెప్టెన్ కోహ్లి కూడా తనకు పూర్తి సహకారం అందిస్తున్నాడని తెలిపాడు. టెస్టుల్లో తాను నంబర్‌వన్ బౌలర్‌గా, ఆల్‌రౌండర్‌గా ఎదగడంలో కోహ్లి పాత్ర చాలా కీలకమన్నాడు. బౌలర్‌గా అతను నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడన్నాడు. వైఫల్యాలు చవిచూసిన వెన్నుతట్టి ప్రోత్సాహించడన్నాడు. అందువల్లే తాను అగ్రశ్రేణి టెస్టు బౌలర్లలో ఒకడిగా ఎదగగలిగానని జడేజా పేర్కొన్నాడు. భవిష్యత్తులో కూడా కోహ్లి అండ తనకు ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. తన కెరీర్‌లో ధోనీ, కోహ్లిలకు ప్రత్యేక స్థానం ఉందన్నాడు. ఈ రోజు తాను ఈ స్థాయిలో నిలిచానంటే దానికి వారిద్దరే కారణం అని చెప్పడంలో తనకు ఎలాంటి సంకోచం లేదన్నాడు. కష్టాల్లో కూడా వీరిద్దరూ అండగా నిలిచి తనలో ధైర్యాన్ని నింపారని తెలిపాడు. ఇక, సహచర బౌలర్ అశ్విన్ సహకారం కూడా వేల కట్టలేనిదన్నాడు. అతను కూడా తనకు ఎన్నో చిట్కాలు చెబుతుంటాడని, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా తనకు అండగా నిలిచాడని జడేజా పేర్కొన్నాడు. కాగా, మూడో టెస్టుకు దూరం కావడం చాలా బాధగా ఉందన్నాడు.

Comments

comments