ధైర్యం, తెగువే నా ఆయుధాలు

ph

దుర్మార్గపు చీకట్లు ఎన్ని ముసిరినా సమాజంలో వెలుగు నింపేందుకు నిరంతరపోరాటం చేస్తోందామె. దేశంలోని సుమారు 5,500 ఐఏఎస్ అధికారుల్లో ఆమెది ప్రత్యేక ఒరవడి. పాలకులు ఆమెను వేధించినా, బదిలీ చేసినా వేలాది మంది రైతులు,
ప్రజాసంఘాలు రోడ్డు ఎక్కి ఆమెకు బాసటగా నిలిచారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ సాక్షాత్తు మంత్రి కార్యాలయానికి తాళాలు వేయించిన చరిత్ర ఆమెది. నాణ్యత లోపించిన పనులు చేయిస్తున్నారని మంత్రి వేసిన టెండర్లు రద్దుచేసి ప్రజాసేవకురాలని నిరూపించిన తెలంగాణ తేజం రోహిణి సింధూరి. కర్నాటక హసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ (కలెక్టర్ హోదా)గా బాధ్యతలు నిర్వహిస్తూ రైతుల సంక్షేమానికి పాటుపడుతూ ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన సింధూరితో సకుటుంబం ప్రత్యేక ఇంటర్వూ..

బాల్యంలోనే బంగారు కలలుకన్నది రోహిణీ సింధూరి. కలెక్టర్ కావాలని పాఠశాల చదువులోనే నిర్ణయించుకుంది. అయితే ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడాలనేది అమ్మ శ్రీలక్ష్మీ,నాన్న జైపాల్ ఆశ. చదువు పూర్తిచేసిన అనంతరం రోహిణి మనసు మారుతుందేమోనని కెమికల్ ఇంజనీరింగ్ చేయించారు. పట్టువదలని సింధూరి సివిల్స్‌కు ప్రిపేర్ అవడం మొదలుపెట్టింది. అకుంఠిత దీక్ష అమ్మానాన్నల ప్రోత్సాహంతో జాతీయ స్థాయిలో 43వ ర్యాంకు సాధించింది. అమ్మలో ఉన్న సేవాగుణం, నాన్నలోని అంకితభావం, సత్యసాయి విద్యాసంస్థలో చదువు, స్వామి వివేకానంద బోధనల ప్రభావం అన్యాయంపై తిరగబడే విస్ఫోటనంగా ఆమెను తీర్చిదిద్దాయి.
తప్పని కష్టాలు:కలెక్టర్ కావాలని పట్టుదలతో చదువుతున్న రోహిణీకి పోకిరీల బెడద తప్పలేదు. సత్యసాయి విద్యాసంస్థల్లో చదువుతున్న రోజుల్లో పోకిరీలు మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తూ వేధించారు. మరో చోట చదువుతానని అమ్మతో చెప్పగా ఎదిరించే ధైర్యాన్ని నూరిపోసింది. వేధించేవారు ఎక్కడైనా ఉంటారు వారికి భయపడి తప్పించుకుని పోయేకొద్దీ వెంటబడతారు. ఎదిరించి నిలబడితే వారే తప్పుకుంటారంటూ అమ్మ ధైర్యం చెప్పింది. ఆ ధైర్యం పట్టుదల ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇంజనీరింగ్ పూర్తి కాగానే సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లింది. అక్కడా మరోకష్టం ఆమెకు సవాల్ విసిరింది. రోడ్ క్రాస్ చేస్తుండగా కారు ఢీ కొట్టడంతో కుంగిపోయినా పట్టుదల వీడలేదు. వీల్‌చైర్, బెడ్, వాష్ రూం అన్నీ చదువుకు అనుకూలంగా తీర్చిదిద్దుకుంది కానీ లక్షాన్ని వీడలేదు.
డ్యూటీలో అడుగడుగునా సవాళ్లు:హసన్ జిల్లా డిసిగా బాధ్యతలు చేపట్టగానే సంస్కరణల బాటపట్టింది రోహిణి. వరుస కరవులతో తల్లడిల్లుతున్న హసన్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కలచి వేశాయి ఆమెను. దేశానికి అన్నం పెడుతున్న రైతులు రాలిపోతుంటే కంటతడిపెట్టుకుని ఏదోచేయాలనే తపనతో ప్రభుత్వ పథకాలను పునఃపరిశీలించి కేంద్రం నుంచి కోట్లాది నిధులు తెప్పించి రైతులకు రుణ సౌకర్యాన్ని కల్పించింది. ఆ సంవత్సరం వర్షాలు కురవడంతో రైతులు ఆనందంగా వ్యవసాయాన్ని చేయడంతో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.
ఆ తర్వాత అప్పటికే ఉన్న పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించి బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటుచేసి నిబంధనలను సరళీకృతం చేసి రైతులకు భరోసా కల్పించింది. అప్పటివరకు ఉన్న రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి.
ఆవినీతిపై పోరు: హసన్ జిల్లా చరిత్రాత్మకమైంది. ప్రాచీన చరిత్ర అవశేషాలు అక్కడ అధికంగా ఉంటాయి. శ్రావణబెళగొళలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా మస్థకాభిషేకం జరుగుతుంటుంది. ఈ అభిషేకానికి సుమారు 60 లక్షల మంది భక్తులు వచ్చి 6.5 అడుగులున్న బాహుబలి తలభాగాన్ని అభిషేకిస్తారు. వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న 83 అడుగుల విగ్రహాన్ని కాపాడుతూ లక్షలమంది చేసే అభిషేకానికి ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర, కర్ణాటక రాష్ట్రం నుంచి వందలకోట్ల నిధులు విడుదలయ్యాయి. హసన్‌జిల్లా ఇన్‌చార్జి మంత్రి తనకు అనుకూలంగా ఉన్నవారికి, నైపుణ్యత లేనివారికి టెండర్లతో సంబంధం లేకుండా పనులు కేటాయించడాన్ని రోహిణి తప్పుబట్టి ఆ కంట్రాక్ట్‌ను రద్దుచేసింది. ఆ తర్వాత టెండర్ల ద్వారా పనులను ఖరారు చేయడంతో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది.
కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం:బదిలీని తప్పుబడుతూ ప్రభుత్వంపై న్యాయస్థానం మెట్లు ఎక్కిన సింధూరికి ప్రజలు పూర్తి మద్దతు ప్రకటించారు. వేలాది మంది రైతులు రోడ్లు ఎక్కి స్వచ్ఛందంగా ఆందోళనలు చేశారు. కర్ణాటకతో పాటు దేశంలో ఈ అంశాన్ని చర్చనీయంగా చేశారు. అమ్మబదిలీ అయితే తిరిగి కష్టాలు వస్తాయని రైతులు చేసిన పోరాటానికి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆతర్వాత ఎన్నికల నియమావళిని పాటించక అతిథిగృహంలో మంత్రి అధికార దుర్వినియోగం చేస్తూ అనుచరులకు భూపంపిణీ చేస్తున్నారని గెస్టుహౌస్‌కు తాళం వేయించిది రోహిణి. దీనికి ప్రజలు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు ఆమెకు మద్దతు తెలపడంతో మరోసారి బదిలీ వేటు వేసే ధైర్యం ప్రభుత్వం చేయలేదు.
ప్రజాసంక్షేమానికి అంకితం: కుటుంబ సభ్యుల సహకారం భర్త ప్రోత్సాహంతో ప్రజాసేవకే అంకితమయ్యానని రోహిణి చెబుతోంది. అధికారంతో ప్రజలకు సేవచేయాలనే తపనతో రైతులపట్ల అంకితభావంతో కార్యక్రమాలు రూపొందించడంతో పాటు అప్పటివరకు ఉన్న 30 శాతం అక్షరాస్యతను 60శాతం తీసుకువచ్చింది. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న ఆ కుటుంబంలో పెద్దల సహకారం పూర్తిగా కనిపిస్తోంది. తెలంగాణకు రావాలని అప్పుడప్పుడు అనిపించినా ప్రజాసేవలో దేశమంతా తన సొంత ప్రాంతంగానే భావిస్తూ, ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడి ప్రజలకు సేవ చేయాలన్నదే లక్షమంటోంది. ధైర్యం, తెగువను ఆయుధాలుగా చేసుకుని దూసుకుపోతున్నాని రోహిణి సింధూరి చెబుతోంది.

వి.బి.కె