ద్విచక్రవాహనంతో వంతెనను ఢీకొని ఇద్దరు దుర్మరణం

Two persons dead tatch the bridge with the two wheeler

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గాం పోలీసు స్టేషన్ పరిధిలోని ఈజ్‌గాం శివమల్లన్న ఆలయ మూలమలుపు వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈజ్‌గాం ఎస్ఐ గట్ల సుధాకర్ కథనం ప్రకారం.. కాగజ్‌నగర్ పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన తరుణ్ తేజ్ చారి (23), బలిశెట్టి రాహుల్ (22)లు అపాచి మోటర్ సైకిల్‌పై మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈజ్‌గాం నుండి కాగజ్‌నగర్‌కు వస్తుండగా, ఈజ్‌గాం శివమల్లన్న ఆలయం వద్ద మూలమలుపు ప్రధాన రహదారిపై ఉన్న వంతెనను ద్విచక్ర వాహనం ఢీకొట్టిందని, దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వంతెనపై నుండి కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. అతి వేగంగా వాహనం వంతెనను ఢీకొట్టడం వల్ల ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభావించిందని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను సిర్పూర్ (టి) సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించినట్టు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా, రోడ్డు ప్రమాదం జరిగినట్టు సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, ప్రజలు ఘట స్థలానికి చేరుకున్నారు. ఈ మూల మలుపు ప్రమాదాలకు కేంద్రంగా మారిందని స్థానికులు వాపోయారు. ప్రధాన రహదారిపై ఉన్న ఈ ఇరుకైన వంతెన వద్ద నిరంతరం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వెల్లడించారు. కాగా ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, బాలాజీనగర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధు మిత్రుల రోదనలు మిన్నంటాయి.

Comments

comments