దూదిమేడలో ప్రాణమంత కవిత్వం

అపురూపమైన సంఘటనలకు కొన్ని సందర్భాలు, సన్నివేశాలు ప్రేరకాలుగా మారుతుంటాయి. కవితా సామాగ్రి అందులో నుండే కవికి అందుతుంది. కఠిన శిల మీద తనను తాను సానబెట్టుకుంటూ ఆలోచనలు, కొలమానాలు, విలువల అంతర్మథనంలో కాగివేగే కవి యేమి రాయాలో, ఎలా రాయాలో అర్థం చేసుకుని సాధకుడుగా నిరూపించుకోవడం కష్టమైన పని అన్నది స్పష్టం. సాదాసీదా సామాజికుడిగా కనిపిస్తూనే నిరాడంబరమైన సూటిదనాన్ని కవిత్వంలో వెలిగింపజేసిన కవి నాళేశ్వరం శంకరం “భూగోళపు గోడ మీద జ్వలిస్తున్న బీజాక్షరాలు, సలసల కాగుతున్న సమాజం […]

అపురూపమైన సంఘటనలకు కొన్ని సందర్భాలు, సన్నివేశాలు ప్రేరకాలుగా మారుతుంటాయి. కవితా సామాగ్రి అందులో నుండే కవికి అందుతుంది. కఠిన శిల మీద తనను తాను సానబెట్టుకుంటూ ఆలోచనలు, కొలమానాలు, విలువల అంతర్మథనంలో కాగివేగే కవి యేమి రాయాలో, ఎలా రాయాలో అర్థం చేసుకుని సాధకుడుగా నిరూపించుకోవడం కష్టమైన పని అన్నది స్పష్టం. సాదాసీదా సామాజికుడిగా కనిపిస్తూనే నిరాడంబరమైన సూటిదనాన్ని కవిత్వంలో వెలిగింపజేసిన కవి నాళేశ్వరం శంకరం “భూగోళపు గోడ మీద జ్వలిస్తున్న బీజాక్షరాలు, సలసల కాగుతున్న సమాజం నా ముందూ వెనుకలు, వీటిని ఆవాహన చేసుకుందామనుకునే లోపునే యీ భయానక ప్రపంచం నాలో ప్రవేశించి, అంతఃఘర్షణకులోను చేసినప్పుడల్లా ఒక ఆలోచన నాలో కదిలి, నేను గాకాక, ఆ ఆలోచన నేనుగా మారినప్పుడూ, ఆ ఆవేశంలోనే సంచరిస్తున్నపుడూ, నాకూ, నా ఆలోచచనకూ మధ్యన ఓ భావన రూపుదాల్చుతుంది. ఓ క్రియాత్మక లయ కొనసాగుతుంటే ఆ ఆలోచనా ధోరణికి సరిపడే ప్రతీకల్ని సమకూర్చుకుంటూ కవిత్వం రాయటం నా అలవాటు, ‘దూది మేడ’ను నిర్మించింది యీ పద్ధతిలోనే, అని తన కవితాస్థితిని స్పష్టంగా ఏనాడో చెప్పారు. శంకరం. అరమరికలు లేకుండా కవి సామాజిక అనుభవాలు కవిత్వంలో స్పష్టమవ్వాలి. నిత్య నిరంతర సాధకుడిగా కవిని నిలిపేవి అనుభవాల్ని ఆత్మీకరించుకుని రాసిన అక్షరాలే. దూది మేడలోని ఎన్నో కవితలు శంకరంలోని మేలుకొని ఉండే సామాజిక గుణానికి దర్పణం పడతాయి. నదిని ఎండుటాకుగా, ఊళ్ళోని ఆవుల్నీ, గేదెల్నీ ఫ్రిడ్జిలో దాచిన పాల పాకెట్లుగా అభివర్ణించడం శంకరం లాంటి నిత్య సాధన చేసే కవులకు మాత్రమే పట్టుపడే సామాజిక దృశ్యీకరణలు. ‘చేతిలోకి పురుగులొస్తున్నాయి’. కవితలో నేల ఒడిలో విచ్చుకుంటున్న పత్తి మొగ్గలను మింగేస్తున్న రాజకీయ పత్తి పురుగులపై శంకరం ప్రకటించిన నిరసన చెప్పుకోదగింది. ‘మట్టి మీద ఇల్లు బతకాలంటే మట్టి కింద బావి బతకాలి కదా’, ‘భూమి పగుళ్ళు బారిన అద్దం,’ రూపాయి చిన్నదే అయినా, దేశం కంటే మా అమ్మ పెద్దదే’ ‘వంటి పంక్తులలో ఆయన ఆత్మ పరివేదన ఎన్నో అంతరాళాలను తాకి తడిపనలను రేకెత్తిస్తుంది.
ఛిద్రమైపోతున్న మానవతా సంబంధాలు, లుప్తమైపోతున్న విలువల పట్ల, ఆవేదన నిరసన వ్యక్తం చేస్తూ ఆయన రాసిన ‘మనీమృగం’, ‘ఇది కరెన్సీ వసంతకాలం’, ‘కరెన్సీఖడ్గం’ ఉదాహరణలుగా నిలుస్తాయి. మానవ విలువలను మార్కెటు ఎకానమీ విధ్వంసం చేస్తున్న తీరుపై కవిగా తీవ్రంగా ఆయన స్పందించారు. జీవలక్షణం ‘శంకరం కవిత్వంలోని ప్రత్యేకత. చలంను ఇష్టపడే శంకరం ఆయన ప్రభావాన్ని ఎంతగా పొందారో అనడానికి ‘మనోలోకానికి పాఠ్యగ్రంథం,’ ‘అమ్మానాన్నల బా ల్యం’; దాంపత్య దూరం’ అన్న కవితలను చదివితే అర్థమౌతుంది. జీవన సంక్షిష్టతలు, నిస్సంకోచాలు, హృదయ మరకలు, వేదనాజల్లులు కవిత్వంలో కన్పిస్తూ ఆలోచనలకు తెరలుతీస్తాయి.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జీవిత పార్శాలు శంకరం కవిత్వంలో వ్యక్తా వక్తమై జీవితానుభవాలను కళ్ళ ముందుంచుతాయి. పీడిత వేదన, ఆర్తి, నిరసనలు, ప్రతి ఘటనలు శంకరం కవిత్వంలో మొదటి నుండి ఉన్నాయి. ‘దళిత దుఃఖం’, ‘మావూరి మానవతార’ వంటి కవితలలో పోరాటస్ఫూర్తి ప్రజ్వరిల్లింది. ‘గుడిసె అంటుకు పోతున్నప్పుడు కాలేకట్టెలే ధనుర్బాణాల వకపోతే యెలా? అని ఉద్యమ స్వరమై నినదిస్తారు.
గర్జనలు, వాగాడంబరాలు కవిత్వానికి పనికి రావని భావించి, కవిత్వకార్యభార్యాన్ని భుజాన వేసుకుని తుదకంటూ మోసి తీరేవాడే కవి అని నమ్మిన స్పష్టమైన స్థితి శంకరం కవిత్వంలో కన్పిస్తుంది. ఎన్నో చోట్ల కవిగా బహిర్ముఖుడై ఆశ్చర్యపరుస్తూ వాస్తవాలను ఆరబోసి తేల్చుకోమంటారు. సదా మెలకువ కవికి ఉండాల్సిన లక్షణమంటూ తన ప్రతి కవిత ద్వారా చెప్పకనే చెప్పారు. కవిత్వం ఒట్టి ఆవేశంగా కాకుండా వర్తమానాన్ని ప్రతి ఫలిస్తూ జ్వాలా తోరణమైఉండాలని శోధన, నిత్యజీవన సాధనతో మమేకమై నాలుగు దశాబ్దాలుగా రాస్తున్న నిరంతర కవి ‘శంకరం. నిగ్రహం, ఆగ్రహం, వ్యక్తిత్వం కలగలిసిన కవిగా పేరొందారు.
“గాయం కాని రోజులేదు
అంతిమ గాయాక్షరం రాసి
మరీ గాయం చేయలేను
గాయమే హృదయమైనప్పుడు
పెదాలమించి జారే ప్రతిస్వరం
గాయస్వరమై కూచుంటుంది’
అంటూ ‘గాయంకాని రోజు’ లేదు కవితలో వ్యవస్థలా, అనునిత్యం దగాపడుతూ గాయాలతో తడిసిముద్దయిపోతున్న దేహాలను ప్రస్తావిస్తూ గాయాల ‘వాగ్గేయకారులకు గానంగానైనా మిగిలిపోతాను’ అంటారు. ‘బతుక్కి దాఖలా బతకడమే’, ‘ఇంకిన పాల సముద్రం’, ‘శత్రుస్నేహం’, ‘దండోరా’, ‘నీడనిచ్చే చెట్టు, ‘మధ్యవర్తి చేతుల్లో రైతూ, కవి!’ ‘వాన చినుకు’, ‘దుఃఖం చిరునామా ముఖమే’, ‘హరితం వెలసిన కాలం’, ‘అగ్గిపుల్లలు’, వాడి కోసమే వాడు చేసేదంతా’! వంటి కవితల్లో కవిగా శంకరం పాటించిన వైవిధ్యం, ఎన్నుకున్న దృష్టికోణాలు, వాస్తవికతలు ఆలోచింపజేస్తాయి.
“నువ్వే కాదు
ఆ నిప్పు పుల్లల అంతః రహస్యాలు తెలిసిన వాడు కూడా
వాటిని ఆర్పేయలేడు
అవి తమ అవయవాల వెలుగుల్నెప్పుడూ
సురక్షిత కుహరాల్లోనే దాచుకోగలవు”
అంటూ అగ్గిపుల్లలు కాలానికి నిప్పు అవసరమైనంత కాలం అవసరమే అంటారు.
‘జ్వలించే కంటి కన్నా
గాయపడిన మట్టిని
అభిషేకించే చెమటే నయం
కాళ్ళు చాచి పడుకున్న రోడ్డు వెంట
చీమలబారులా సాగే బెరుకు బండ్ల మధ్యన
పరవశించిపాడే
పాట రొద మా వూరి జీతగాడిదే’
అంటూ కాలుతున్న కూలి కాష్ఠంలో గంధపు చెక్కలు శ్రామికులు అని చెబుతారు. శ్రమించే శ్రమతో నడవడమే సిద్ధాంతం పోరాట ఫలాలు లభించేదాక అంటారు. బుక్కెడు బువ్వ తిన్నవాడికి గుక్కెడు నీళ్ళనిచ్చేది ఈ బావే కదా అంటూ ఎండిపోతున్న చెట్టులా బావుల అడుగంటి ఖాళీకుండలయ్యాయని ఆవేదన పడి వలసలు ఆగి కరవులు పోవాలని జలధారల ఊటలు రావాలని ఆశాభావం ప్రకటిస్తారు.
నిప్పు కణికల్లాంటి బతుకులోని శిరోస్వప్నాలకు ఊతకర్రలు పుట్టి ముందడుగు పడాలంటారు. ఉద్యమ సమాజాన్ని కవితలో ప్రబలంగా చూపించిన కవిశంకరం. ‘నన్ను వెలివేస్తే, నిన్ను ఉరితీస్తా జాగ్రత్త’ అంటూ దండోరా మోగించి హెచ్చరించిన ఉద్యమశీలి. ‘ఏమైనా ఇక్కడ దుఃఖ పడే వాడే దుఃఖధారలో చేరగలడు. ఆయుధమవ్వగలడు’ అని భరోసా ప్రకటిస్తారు. భిన్నమైన కవితాసామాగ్రితో విభిన్నతను ప్రదర్శిస్తూ సామాజిక అనుభవాల్ని ఊతం చేసుకొని సాధనతో నిలిచిన కవి శంకరం. జీవలక్షణానికి కవిత్వానికి లేపనంగా అద్ది నిస్సంకోచంగా తన భావాలను వెల్లడిస్తూ సాగుతున్న నిరాడంబర సామాజికుడు. మనుషుల్లో మనోపరిమళాన్ని కోరుకుంటూ కవిత్వాన్ని చంద్రశిలపై సానబెడుతున్న ఆశావాది.

తిరునగరి శ్రీనివాస్
9441464764

Related Stories: