దాయాది సమరంపై సర్వత్రా ఆసక్తి

India-VS-Pakistan

బర్మింగ్‌హామ్: చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్లు ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకోవడంతో రెండు దేశాల క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రెండు జట్ల మధ్య ఆదివారం జరిగే ఫైనల్ కోసం ఇరు దేశాల అభిమానులు అతృతతో ఎదురు చూస్తున్నారు. ఇంగ్లాండ్‌ను ఓడించి పాక్, బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి భారత్ టైటిల్ సమరానికి చేరుకున్న విషయం తెలిసిందే. దాయాదులు తుది సమరానికి చేరుకోవడంతో ఫైనల్ మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. మొదటి ట్వంటీ-20 ప్రపంచకప్ తర్వాత రెండు జట్లు ఐసిసి టోర్నీ ఫైనల్లో తలపడడం ఇదే మొదటిసారి. చాలా ఏళ్ల తర్వాత దాయాది జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ పోరు కోసం అభిమానులు తహతహలాడుతున్నారు. లీగ్ దశలో ఇప్పటికే పాక్‌ను ఓడించిన భారత్ ఫైనల్లోనూ జయకేతనం ఎగుర వేయాలనే లక్షంతో ఉంది. అయితే శ్రీలంక, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి పటిష్టమైన జట్లను ఓడించి టైటిల్ సమరానికి దూసుకొచ్చిన పాక్‌ను కూడా తక్కువ అంచన వేయలేం. పెద్దగా అంచనాలు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగిన పాక్ ఏకంగా ఫైనల్‌కు చేరుకుని ప్రకంపనలు సృష్టించింది. సెమీస్‌లో ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టును అలవోకగా ఓడించిన పాక్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఓపెనర్లు అజహర్ అలీ, ఫకర్ జమాన్, సీనియర్లు మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, యువ సంచలనం బాబర్ ఆజం, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులతో పాక్ బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక, జునేద్ ఖాన్, మహ్మద్ అమేర్, హసన్ అలీ, షాదాబ్ ఖాన్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో ఫైనల్ సమరం యుద్ధాన్ని తలపించడం ఖాయమని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. కాగా, చిరకాల ప్రత్యర్థులు టైటిల్ పోరుకు చేరుకోవడంతో భారత్‌లో ఒక్కసారి క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ పోరు కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా ఆదివారం కావడంతో మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించు కుంటున్నారు. అటు నిర్వహకులు కూడా దాయాది జట్లు ఫైనల్‌కు చేరుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ ఐసిసి చరిత్రలో అత్యంత విజయవంతమైన మ్యాచుల్లో ఒకటిగా నిలుస్తుందనే నమ్మకాన్ని ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డు అధికారులు అంటున్నారు. అంతేగాక, రెండు దేశాల మీడియాలో కూడా ఫైనల్ అంశం ప్రత్యేక వార్తంశంగా మారింది. ఇరు దేశాల జాతీయ మీడియాలో ఫైనల్ సమరం ప్రత్యేక కథనాలు ప్రసారం అవుతున్నాయి. భారత్-పాక్‌లకు చెందిన మాజీ క్రికెటర్లు సైతం చిరాకల ప్రత్యర్థులు ఫైనల్‌కు చేరుకోవడంపై ఆనందంతో ఉన్నారు. తమ తమ జట్ల బలబలాల గురించి విశ్లేషణలు, అంచనాల్లో మునిగిపోయారు. రెండు జట్లు కూడా విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నాయి. దీంతో ఫైనల్ సమరం ఉత్కంఠభరితంగా సాగడం ఖాయం.

Comments

comments