త్వరలో సురేష్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లోకి

Congress leader  Suresh Reddy to join TRS

కెసిఆర్, ఆయన భావసారూప్యతగల నేతలు : కెటిఆర్
తెలంగాణ అభివృద్ధి కోసమే.. : సురేష్‌రెడ్డి  

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్‌రెడ్డి ఈ నెల 12న ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. పార్టీ అధినేత కెసిఆర్ సూచనల మేరకు సురేష్‌రెడ్డి నివాసానికి వచ్చి కలిశామని అపద్ధర్మ మంత్రి కెటి రామారావు తెలిపారు. నిజామామాద్ జిల్లా తాజా మాజీ ఎం ఎల్‌ఎలు వేముల ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డిలతో కలిసి కెటిఆర్ శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని సురేష్‌రెడ్డి నివాసానికి వచ్చి కలిసి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం సురేష్‌రెడ్డి, జీవన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సహృదయంతో మా పార్టీ ఆహ్వానాన్ని మన్నించి టిఆర్‌ఎస్‌లో చేరేందుకు సురేష్ రెడ్డి సంసిద్ధతను వ్యక్తం చేశారని, త్వరలో ఆయన అభిమాన గణంతో కలిసి మా పార్టీలో చేరుతారని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభాపతిగా బాధ్యతలు నిర్వర్తించిన సురేష్ రెడ్డికి వారి స్థాయికి తగ్గ పదవిని తమ అధినేత కెసిఆర్ ఇచ్చి గౌరవించుకుంటారన్నారు. అధినేత కెసిఆర్‌తో సురేష్ రెడ్డికి సుదీర్ఘ పరిచయం ఉందన్నారు.

1989 నుండి శాసన సభలో కూడా కెసిఆర్‌తో సురేష్ రెడ్డి పని చేయడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విషయంలో అప్పటి నుండే చాలా విషయాల్లో పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలనే ఒక ఆలోచనకు మొదటి నుండి కూడా ఒక భావ సారూప్యత ఉండేదని కెటిఆర్ అన్నారు. అలాంటి పరిస్థితుల్లో సురేష్ రెడ్డి ఈ రోజు తెలంగాణలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులలో తమ పార్టీతో కలిసి పని చేయండని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారన్నారు. పార్టీ అధినేత కెసిఆర్ హామీ మేరకు వారిని టిఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించడానికి స్వయంగా తాను ప్రభుత్వ సలహాదారు డా. జి. వివేక్, తాజా మాజీ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ తాజా మాజీ ఎంఎల్‌ఏ జీవన్ రెడ్డితో కలిసి ఆహ్వానించడానికి వారి నివాసానికి వచ్చామని కెటిఆర్ తెలిపారు. సహృదయంతో వారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి నేను టిఆర్‌ఎస్ పార్టీలోకి వస్తానని మాతో చెప్పడం జరిగింది. శాసనసభా పతిగా అత్యున్నతమైన స్థాయిలో వారు పని చేసి ఉన్నారని, వారి స్థాయికి తగ్గ విధంగా ఆయనను టిఆర్‌ఎస్ పార్టీలో కెసిఆర్ గౌరవించుకుంటారన్న విశ్వాసం తమకు ఉందన్నారు.

సురేష్ రెడ్డితో పాటు బాల్కొండ నియోజకవర్గం నుండి ఆయన అనుచరులు కూడా వందలాది మంది ఈ రోజు తమ పార్టీలో చేరేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తమకు తెలిసింది. ఈ నిమిషం వరకు కూడా కార్యకర్తలకు తెలియదు నేను సురేష్ రెడ్డిని ఇలా ఇంటికి వచ్చి కలుస్తున్న విషయం వారి అనుచరులు, కార్యకర్తలకు తెలియదన్నారు. వారికి కూడా కొంత ఆశ్చర్యం కల్గించినప్పటికీ సురేష్ రెడ్డి మా పార్టీ ఆహ్వానాన్ని మన్నించి పార్టీలోకి వచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినందుకు, అలాగే ఆయన సహృదయానికి, ఆతిథ్యానికి కూడా తాము ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో శాసన సభ్యులు అనే పదం మళ్లీ మళ్లీ వాడుతూ.. మళ్లీ సవరించుకుని తాజా మాజీ శాసన సభ్యులు అని అనడంతో కొందరు నవ్వుకున్నారు. అసెంబ్లీ రద్దు అయింది నిన్ననే కదా… తాజా మాజీ అని అనడానికి ఇంకా అలవాటు కాలేదని కెటిఆర్ చమత్కరించారు.
తెలంగాణ అభివృద్ధి కోసమే : సురేష్ రెడ్డి
తనకు రాజకీయ పదవులు కొత్త కాదని, పోరాడి సాధించుకున్న తెలంగాణను మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు టిఆర్‌ఎస్ పార్టీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి అన్నారు. తన రాజకీయ జీవితాన్ని , అనుభవాన్ని కచ్చితంగా టిఆర్‌ఎస్‌కు ఉపయోగిస్తానన్నారు. కెసిఆర్‌తో తాను నేరుగా పని చేయక పోయినప్పటికీ 1989 నుండి తనకు కెసిఆర్ అభివృద్ధి ఆలోచనలు తెలుసునన్నారు. తెలంగాణ అభివృద్ధి ఇదే వేగంతో దూసుకెళ్లాలంటే కెసిఆర్ మరో సారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కెసిఆర్ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నానని, త్వరలోనే తన అనుచరులకు కూడా తీసుకుని వారి ఆమోదంతో టిఆర్‌ఎస్‌లో చేరుతానని సురేష్ రెడ్డి వెల్లడించారు. కెటిఆర్ తనకు మంచి మిత్రులని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక దిశా దశ వస్తుందని నమ్మిన తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్టరంలో ఒక నిశ్శబ్ధ అభివృద్దిని చూశానని సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఏ ఆశయాలతో అయితే ముందుకు వెళితే అభివృద్ధి సాధ్యమో కెసిఆర్‌కు తెలుసు అన్నారు. నాలుగున్నర సంవత్సరాల నుండి రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్నదన్నారు. ఈ అభివృద్ధికి ఆటంకం కలగవద్దు అంటే టిఆర్‌ఎస్ మరో సారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

Comments

comments