త్రివేణి సంగమేశ్వరాలయం

Triveni Sangmeswara Temple in Sangareddy District

ఈ ఆలయానికి వెళితే మానసిక ఉల్లాసం, ఉత్సాహాన్నిస్తుంది. సాక్షాత్తు దేవతలు, ఋషులు, యోగ సాధకులు నడయాడిన నేల ఇది. పరమ శివుడు స్వయంభువుగా అవతరించిన ప్రాంతమిది. ప్రకృతి రమణీయతను, భక్తి భావ పరిమళాలను వ్యాప్తి చెందిస్తూ మంజీరా శ్రీ త్రివేణి సంగమేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఏటిగడ్డల సంఘం గ్రామంలో ఉన్నది.

ప్రత్యేకత: మంజీరా నది ఒడ్డున దేవాది దేవతలు, ఋషులు తపమాచరించి సాక్షాత్తు పరమశివుడిని సాక్షాత్కారం పొంది ఈ ప్రాంతంలో లింగ ప్రతిష్ఠ చేశారట. మంజీరా ఉధృతంగా ప్రవహించే ఏటిగడ్డ సంఘంలో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోతాయనీ, కోరినవి నెరవేరుతాయనీ భక్తుల నమ్మకం.
మూడు ఏరులు కలిసిన ఎత్తైన ప్రాంతం కావడం వల్ల ఏటిగడ్డ సంఘం అనే పేరు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. మంజీరా, నారింజ, నీలం నదుల కలయికే త్రివేణి సంగమేశ్వరంగా చెబుతున్నారు. కాశీ విశ్వేశ్వరాలయం వెలసిన గంగానది దక్షిణదిశగా ప్రవహిస్తున్నది. ఏటిగడ్డ సంఘంలో మంజీరానది దక్షిణ దిశగా ప్రవహిస్తున్నది. అందుకే సంగమేశ్వరాలయానికి అంతటి విశిష్ఠత ఉన్నది. సంగమ కూడలి జలంతో అభిషేకిం చడం ఈ సంగమేశ్వరాలయం ప్రత్యేకత.

చరిత్ర: దీనిని తెలంగాణలోని అతి ప్రాచీన దేవాలయాల్లో ఒకటిగా చెప్తున్నారు స్థానికులు. మాలపాడు, బొబ్బిలిగామా, పొట్టిపల్లి, పోచారం, మునిపల్లి, ఆత్మకూర్, బూచిరెడ్డిపల్లె , ఏటిగడ్డ సంఘం గ్రామాల ఇలవేల్పుగా ఈ ఆలయం పూజలందుకుం టున్నది.

పూజలు: మహాశివరాత్రితో పాటు శ్రావణ, కార్తీకమాసాలే కాకుండా మామూలు రోజుల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. రుద్రాభిషేకం, ఎదుర్కోళ్లు, లింగోద్భవం, పల్లకిసేవ, అగ్నిగుండం, సర్వదేవతా పూజలు వంటి కార్యక్రమాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. హైదరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి భక్తులు వచ్చి మంజీరాలో స్నానం చేస్తారు. ఆయురారోగ్య సమస్యలు ఉన్నవారు స్వామివారిని దర్శించుకుంటే పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం. మానసిక ఆహ్లాదానికి అనువైన క్షేత్రంగానూ దీనికి పేరున్నది.

ఎలా వెళ్లాలి: హైదరాబాద్ ముంబై జాతీయ రహదారిలో సదాశివపేట పట్టణం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింగూరు ప్రాజెక్టుకు వెళ్లే దారికి సమీపంలో ఈ క్షేత్రం కొలువై ఉన్నది. ఇక్కడ ఏటిగడ్డ సంఘం కాలనీ నుంచి కిలోమీటర్ దూరం వెళ్తే త్రివేణి సంగమేశ్వరాలయం చేరుకోవచ్చు. సదాశివపేట నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల సౌకర్యం ఉంది.

-బొర్రా శ్రీనివాస్

Comments

comments