తొలికిరణానికే పలకరింపు

పేపర్‌బాయ్… సమస్త విశ్వాన్ని మన ముందుకు తెస్తాడు. తొలికిరణం చేరక మునుపే ప్రతి గడపను పలకరిస్తాడు. ఉరుములు తరుముతున్నా, కుండపోత వర్షం కురిసినా, వేకువ చలి ఎముకలు కొరికేస్తున్నా పరుగు ఆపడు. వాళ్లు రానిదే ఎందరికో పొద్దు పొడిచినట్లు ఉండదు. వాళ్లు లేనిదే ఏ ఇంటికీ సమాచారం చేరదు. వేడివేడి వార్తలు తెచ్చి చాయ్‌ను సైతం చల్లగా చేయడం వారికే సాధ్యం . తానెవరో ఎవరికీ కనిపించక, సైకిల్‌పై అలా వచ్చి ఇలా వెళ్లిపోతాడు. పేరుకు మాత్రం […]

పేపర్‌బాయ్… సమస్త విశ్వాన్ని మన ముందుకు తెస్తాడు. తొలికిరణం చేరక మునుపే ప్రతి గడపను పలకరిస్తాడు. ఉరుములు తరుముతున్నా, కుండపోత వర్షం కురిసినా, వేకువ చలి ఎముకలు కొరికేస్తున్నా పరుగు ఆపడు. వాళ్లు రానిదే ఎందరికో పొద్దు పొడిచినట్లు ఉండదు. వాళ్లు లేనిదే ఏ ఇంటికీ సమాచారం చేరదు. వేడివేడి వార్తలు తెచ్చి చాయ్‌ను సైతం చల్లగా చేయడం వారికే సాధ్యం . తానెవరో ఎవరికీ కనిపించక, సైకిల్‌పై అలా వచ్చి ఇలా వెళ్లిపోతాడు. పేరుకు మాత్రం పేపర్ బాయ్. కాని అతడో సామాజిక వారధి. వార్తా పత్రికలను పాఠకులకు చేర్చే నిత్య నూతన వారధి. అందుకే పేపర్ బాయ్స్‌కు సలాం. 

ఆ వృత్తిలో కష్టనష్టాలపై దునియా ప్రత్యేక కథనం..

విలేకరులు పొద్దంతా కష్టపడి సేకరించి పంపించిన వార్తలను సంపాదకులు సరిచేసి ముద్రణ ఆమోదయోగ్యంగా మలుస్తారు. ముద్రితమైన దిన పత్రికలను సకాలంలో పాఠకులకు చేరవేస్తేనే పత్రికకు, దాని వెనుక శ్రమకు విలువ. ఏ మాత్రం ఆలస్యమైనా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే. ఈ నేపథ్యంలో దినపత్రికను సకాలంలో పాఠకులకు అందజేసే కీలక వ్యక్తి, శక్తి పేపర్‌బాయ్. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించి కోట్లాది మంది హృదయాల్లో నిలిచిన దివంగత మాజీ రాష్ట్రపతి  డా.ఎపిజె అబ్దుల్‌కలాం తన విద్యార్థి దశలో పుస్తకాల ఖర్చు నిమిత్తం పేపర్‌బాయ్‌గా పని చేశారు. అలాగే జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ, స్వాతంత్య్రోద్యమ నేత బాలాగంగాధర్ తిలక్ ఇలా ఎందరో ప్రముఖులు కొంతకాలం పేపర్‌బాయ్‌గా పని చేసిన వాళ్లే కావడం విశేషం.

మొదటి పేపర్‌బాయ్ : మొట్టమెదటి పేపర్‌బాయ్ అమెరికాకు చెందిన బార్నీ ప్లాహెర్టీ. ఆ రోజుల్లో పేపర్ వేయాలంటే అక్కడి ప్రజలు నామోషీగా భావించేవారు. బార్నీకి మాత్రం పేపర్ వేయడం నామోషీకాదు. నవ నాడుల్లో నజర్ ఉన్నవారు మాత్రమే చేసేపని. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పేవాడు. తన పరిస్థితికి తగ్గట్లుగా పేపర్‌బాయ్‌గా పని చేస్తూ తన ఖర్చులకు డబ్బులు సంపాదించుకునేవాడు. 1833 నాటికి పదేళ్ల వయసులోనే న్యూయార్క్ సన్ పేరుతో నడిచే పేపర్ వేసేవాడు. తెల్లవారకముందే దినపత్రిక ఇంటికి చేరవేస్తుండడంతో ఇతర పేపర్ల వినియోగదారులు సైతం బార్నీ వేసే న్యూయార్క్ సన్ పేపర్‌నే కోరుకునేవారు. దీంతో అనతికాలంలోనే ఆ పత్రిక చందా
దారులు రెట్టింపు అయ్యారు. బార్నీ సేవలు గుర్తించిన పత్రికా యజమాన్యం అతడికి మరిన్ని బాధ్యతలు అప్పగించింది. పేపర్‌బాయ్‌గా చాలామంది పాఠకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బార్నీ పుట్టిన రోజు సెప్టెంబర్ 4న ఆయా పత్రికా సంఘాల నాయకులంతా కలిసి పేపర్ బాయ్స్‌డేగా ప్రకటించారు. నాటినుండి ప్రపంచంలోని అన్ని పత్రికల యాజమాన్యాలు బార్నీ పుట్టిన రోజును పేపర్ బాయ్స్ డేగా ఫాలో అవుతున్నారు. అమెరికాలో హ్యూస్టన్‌లో టెక్సాస్ ప్రెస్ అసోసియేషన్125వ వార్షికోత్సవం సందర్భంగా బార్నీ గౌరవార్థం అతడి కాంస్య విగ్రహాన్ని 2005 లో ఏర్పాటు చేసింది.

లెక్క మరువరు: తెల్లవారుజామునే నిద్రలేవడం, కష్టపడేతత్వం అలవాటు అవుతాయి. జ్ఞాపకశక్తి బాగుంటుంది. ఎందుకంటే రోజూ కొన్ని వందల ఇళ్లకు పేపర్లు వేసే వారుంటారు. ఒక ఇంటికి బదులు వేరే ఇంటికి పేపర్ వేయరు. ఒకవేళ పేపర్ మారిందంటే చాలు కష్టమర్ నుండి ఏజెంట్‌కు, అక్కడ నుండి వీరికి ఫోన్‌లో చీవాట్లే. ఉదయం రెండు, మూడు గంటలు కష్టపడితే వచ్చే ఆదాయం తక్కువే. అయినప్పటికి వేడినీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లు ఏవైనా ఖర్చులకు ఉపయోగపడతాయనే ఆలోచనతో పని చేస్తుంటారు. ఇలా సంతోషంగా పనిచేస్తు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారెందరో ఉన్నారు.

ఇబ్బందులు తప్పవు: కొందరు నిద్రలేవగానే న్యూస్ పేపర్ కోసం తాపత్రయ పడతారు. ఇలాంటి వారితోనే పేపర్‌బాయ్స్‌కు అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురౌతాయి. పేపర్ కాస్త ఆలస్యమైనా ఒక పేపర్ కు బదులు మరొక పేపర్ వేసినా చీవాట్లు చికాకులు తప్పవు. కొంతమంది బాయ్స్ అయితే ఇవేమి పట్టించుకోకుండా పని చేస్తుండగా మరికొందరు మా సమయం వృథా కాకుండా సమయానికి వేస్తున్నావు అంటూ ప్రశంసిస్తారు.

బిల్లు ఇవ్వకుంటే : పాఠకులు సకాలంలో బిల్లు ఇస్తేనే ఏజెంట్లు మాకు జీతాలు ఇస్తారని అయితే బిల్లు వసూళ్లు చేయడం కొంతమంది కస్టమర్ల వద్ద కత్తిమీద సామే అంటున్నారు పేపర్‌బాయ్స్. రేపు, మాపు అంటూ తిప్పుకుంటుంటే మా తిరుగుడు చూసి మా నేస్తం సైకిల్ కూడా నవ్వుకుంటుందని చెబుతున్నారు. అదే పనిగా ఆ ఇంటికి తిరిగితే బిల్లు చెల్లించి వేరే పేపర్ వేయించుకునే వాళ్లు కొందరుంటే మరి కొందరేమో మా కష్టాన్ని అర్థం చేసుకొని బిల్లుతో పాటు అదనంగా రూ.10, 20లు ఎక్కువ ఇస్తారని చెబుతున్నారు.

బి. కొండన్న యాదవ్
మన తెలంగాణ వనపర్తి ప్రతినిధి

Comments

comments