తెలంగాణ విద్యాతేజం రాజాబహద్దూర్ వెంకట్రామా రెడ్డి

Venkatram Reddy believes that human education is very important

వెంకట్రామారెడ్డి హైదరాబాద్‌లో జరిగే అల్లర్లను అరికట్టి మత సామరస్యాన్ని పెంపొందించడంలో ఎంతో కీలక పాత్ర వహించినారు. అంతేగాకుండా నిజాం రాజు కుమారులు వివాహం చేసుకొని యూరప్ నుండి తిరిగి వచ్చినప్పుడు హైదరాబాద్‌లో వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించి నిజాం రాజు దృష్టిని ఆకర్షించారు. నాడు ట్రేడ్ యూనియన్ వాళ్లు సమ్మెకు దిగితే వెంకట్రామారెడ్డి ఎంతో చాకచక్యంగా కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేశారు. ఇట్లా ఆయన శక్తి సామర్థాలు గుర్తించి ‘రాజాబహద్దూర్’ బిరుదుతో నిజాం రాజు సత్కరించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే బ్రిటిష్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ బిరుదును ఇచ్చి గౌరవించింది. దాదాపు 14 సం॥ రాలు 1920 నుండి 1934 వరకు కొత్వాల్ పదవిలో కొనసాగి నిజాం రాజుకు అతి సన్నిహితంగా మెలిగినారు. 

రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి గొప్ప సంఘ సేవకులు, విద్యాదాత. మనిషి చదువు చాలా అవసరమని నమ్మినవారు. అందుకే ఎన్నో బడులకు, కళాశాలలకు, వసతి గృహాలకు డబ్బును దానం చేసిన దాత. పల్లెటూర్ల నుండి హైదరాబాద్‌కు రావడమే కష్టమైనటువంటి నాటి రోజుల్లో అబిడ్స్, నారాయణగూడ వంటి ప్రాంతాలలో విద్యా సంస్థలను, వసతి గృహాలను నిర్మించారు. కుల మతాలకు అతీతంగా విద్యార్థులకు హాస్టల్లలో ఆశ్రయం కల్పించిన గొప్ప వ్యక్తి.

వెంకట్రామారెడ్డి 1869 ఆగస్టు 22న వనపర్తి సంస్థానంలోని రాయనిపేట అనే గ్రామంలో భారతమ్మా, కేశవరెడ్డి దంపతులకు జన్మించాడు. గద్వాల సంస్థానంలో ఎనిమిది గ్రామాలకు మక్తేదారుగా ఉండేవారు. వెంకట్రామారెడ్డి ఇంటిపేరు పాశం. అయితే నాటి నిజాం రాజు ‘రాజా బహద్దూర్‌” అనే బిరుడు ఇవ్వడంతో రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డిగానే ప్రసిద్ధి కెక్కినారు. అతి పిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన అతను మేనమామ అయిన మేడవల్లి విలియం వహబ్ రెడ్డి ఇంట్లో పెరిగారు. వీరి విద్యాభ్యాసం రాయనిపేట, వనపర్తిలో కొనసాగింది.

వీరి మేనమామ మహబ్ రెడ్డి రాయచూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా పని చేసేవారు. కొంత కాలానికే మేనమామ చనిపోయినందున రాజబహద్దూర్ తన 17వ యేట పోలీస్ శాఖలో అమీన్‌గా నెలకు రూ. 60 వేతనానికి ఉద్యోగం చేసినారు. ఆ తర్వాత రాజాబహద్దూర్ వివిధ హోదాల్లో నిజామాబాద్, బీదర్, ఎలగందల్, వరంగల్, మెదక్ ప్రాంతాలలో పని చేశారు. వెంకట్రామారెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ సహాయ కొత్వాల్ పదవిలో చేరి అప్పటి హైదరాబాద్ సంస్థాన కొత్వాల్ ఇమాద్ జంగుతో కలసి పనిచేశారు. కొంత కాలానికి ఇమాద్ జంగు మరణించగా నిజాం రాజు ఇతన్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్‌కు 13వ కొత్వాల్‌గా నియమించినారు.

వెంకట్రామారెడ్డి హైదరాబాద్‌లో జరిగే అల్లర్లను అరికట్టి మత సామరస్యాన్ని పెంపొందించడంలో ఎంతో కీలక పాత్ర వహించినారు. అంతేగాకుండా నిజాం రాజు కుమారులు వివాహం చేసుకొని యూరప్ నుండి తిరిగి వచ్చినప్పుడు హైదరాబాద్‌లో వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించి నిజాం రాజు దృష్టిని ఆకర్షించారు. నాడు ట్రేడ్ యూనియన్ వాళ్లు సమ్మెకు దిగితే వెంకట్రామారెడ్డి ఎంతో చాకచక్యంగా కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేశారు. ఇట్లా ఆయన శక్తి సామర్థాలు గుర్తించి ‘రాజాబహద్దూర్’ బిరుదుతో నిజాం రాజు సత్కరించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే బ్రిటిష్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ బిరుదును ఇచ్చి గౌరవించింది. దాదాపు 14 సం॥ రాలు 1920 నుండి 1934 వరకు కొత్వాల్ పదవిలో కొనసాగి నిజాం రాజుకు అతి సన్నిహితంగా మెలిగినారు. కొత్వాల్ పదవీ విరమణ అనంతరం కూడా రెడ్డి గారిని సర్ఫ్ ఇకాస్‌కు ప్రత్యేక అధికారిగా నియమించినారు.

రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి తన మొదటి భార్యకు రంగారెడ్డి అనే కుమారుడు జన్మించినారు. మొదటి భార్య చనిపోయినంక రెండవ వివాహం చేసుకోగా లకా్ష్మరెడ్డి అనే కొడుకు, నరసమ్మ అనే బిడ్డ జన్మించారు. రంగారెడ్డి నిజాం ప్రభుత్వంలో అబ్కారీ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేశారు. వీరికి సంతానం లేదు. మరో కుమారుడైన లకా్ష్మరెడ్డి లండన్ వెళ్లి బారిష్టర్ చదివారు. వీరు మెదక్ సెషన్స్ జడ్జిగా, ఆ తర్వాత హైదరాబాద్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు.
రెడ్డి హాస్టల్ ప్రారంభం: 1916లో వనపర్తి రాజాగారి కుమార్తె వివాహ సందర్భంలో హాజరైన రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి అక్కడకు విచ్ఛేసిన ప్రముఖులతో మాట్లాడి గ్రామీణ విద్యార్థుల కోసం ఒక హాస్టల్ నిర్మిస్తే బాగుంటుందని చర్చించి చందాలు సేకరించి తన ఆధ్వర్యంలో 1918లో అబిడ్స్‌లో రెడ్డి హాస్టల్‌ను గ్రామాల నుండి వచ్చే విద్యార్థుల కోసం స్థాపించి చరిత్రలో నిలిచిపోయారు. కుల మతాలకు అతీతంగా ఎందరో వేలాది మంది విద్యార్థులకు రెడ్డి హాస్టల్ వంద సంవత్సరాలు చదువుకోవడానికి వసతి కల్పించింది. ఇదే హాస్టల్‌కు ఎలాంటి వేతనం తీసుకోకుండా సురవరం ప్రతాపరెడ్డి కార్యదర్శిగా 10 సం॥ రాలు సేవలందించారు. 1933లో ఆరుట్ల కమలా దేవి ప్రోత్సాహంతో బాలికల కోసం నారాయణ గూడలో బాలికల హాస్టల్‌ను రాజా బహద్దూర్ ప్రారంభించారు.

ఆ రోజుల్లో రెడ్డి హాస్టల్ ఒక రాజకీయ శిక్షణ సంస్థగా పని చేసిందని చెప్పవచ్చు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభను నిర్వహించిన వారు గానీ, తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వారు గాని అందరూ కూడా ఈ హాస్టల్‌లో ఉండి విద్యను అభ్యసించిన వారే కావడం గమనార్హం. ఇంకా రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలాదేవి, పి.వి. నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, యుజిసి ఛైర్మన్ రాంరెడ్డి, జస్టిస్ కుమరయ్య, కొండా మాధవ రెడ్డి, జస్టిస్ సీతారాం రెడ్డి, చిత్రకారులు తిరుపాల్ రెడ్డి వంటి ఎందరో ప్రముఖులు రెడ్డి హాస్టల్‌ల్లో ఉండి చదువుకుని జాతీయ స్థాయికి ఎదిగినారు.

రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి ఎన్నో సంస్థలకు డబ్బు సహాయం చేసి తాను చనిపోయే నాటికి జేబులో కేవలం 50/ రూపాయలు మాత్రమే ఉంచుకుని సాధారణ జీవితం గడిపిన గొప్ప మానవతావాది. తన 83వ యేట నారాయణ గూడలోని స్వగృహంలో 2 మే, 1953లో స్వర్గస్తులైనారు. రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి చేసిన సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రెడ్డి హాస్టల్‌కు 10 ఎకరాల స్థలం, భవన నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు, రెడ్డి మహిళ హాస్టల్‌కు 1500 గజాల స్థలం ప్రకటించారు. తెలంగాణ పోలీస్ అకాడమీకి రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి పేరు పెట్టనున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో మరుగునపడ్డ తెలంగాణ మహనీయుడైన వెంకట్రామారెడ్డిని గుర్తించడం మనందరికీ గర్వకారణం.