తెలంగాణ కథల సింగిడి

తెలంగాణ సొంత అస్తిత్వాన్ని నిలబెట్టేందుకు, కళారంగాల్లో తనదైన ముద్రను నిలిపేందుకు, ఇక్కడి రచయితలు, కళాకారులు ఎప్పుడూ సచేతనంగానే ఉన్నారు. 1950 దశకంలోనే తెలంగాణ జనజీవితాల్ని సొంత పదాలతో విప్పి చెప్పిన గూడూరి సీతారాం, సురమౌళిల కథలు తొలి అడుగుజాడల్ని చూపిస్తాయి. భాష, యాస వివక్షకు గురికాకముందు మన కథలు మన మాటల్లోనే వర్థిల్లినాయనడానికి ఈ మహాకథకుల అక్షరాలే సాక్షం. తెలంగాణ సోయి తిరిగి కథకులను సొంత నేలపై కాలు మోపేలా చేసింది. దాంతో ఇక్కడి బతుకు, కష్టం, […]

తెలంగాణ సొంత అస్తిత్వాన్ని నిలబెట్టేందుకు, కళారంగాల్లో తనదైన ముద్రను నిలిపేందుకు, ఇక్కడి రచయితలు, కళాకారులు ఎప్పుడూ సచేతనంగానే ఉన్నారు. 1950 దశకంలోనే తెలంగాణ జనజీవితాల్ని సొంత పదాలతో విప్పి చెప్పిన గూడూరి సీతారాం, సురమౌళిల కథలు తొలి అడుగుజాడల్ని చూపిస్తాయి. భాష, యాస వివక్షకు గురికాకముందు మన కథలు మన మాటల్లోనే వర్థిల్లినాయనడానికి ఈ మహాకథకుల అక్షరాలే సాక్షం.
తెలంగాణ సోయి తిరిగి కథకులను సొంత నేలపై కాలు మోపేలా చేసింది. దాంతో ఇక్కడి బతుకు, కష్టం, సుఖం, పండుగ, దండుగ అన్నీ కథల్లోకి తర్జుమా అవుతున్నాయి. మట్టి భాష పరిమళాన్ని వెదజల్లే ఈ కథలను పాఠకులు గుండెలకు హత్తుకుంటున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ పాఠకులకు ఏరికోరి తమ కథలు వినిపించాలనే దృష్టి తో సాహితీ సంస్థలు ముందు కొస్తున్నాయి. ఏటేటా వస్తున్న కథల ను పుస్తక రూపంలో సంగ్రహించి కాలం తాడుకు వేలాడదీస్తున్నాయి. ‘తెలుగు’ కథా సంపుటాలుగా వెలువడే పుస్తకాల్లో తెలంగాణ కథకు ఎప్పుడైనా కడపటి స్థానమే దక్కుతున్నది. అందుకే తెలంగాణ కథను సొంత కాళ్ల మీద నిలబెట్టే ప్రయత్నంలో ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం మూడో అడుగు కూడా వేసింది.
2013 నుండి ఏటేటా వస్తున్న తెలంగాణ కథల్లోంచి మన్నికయిన వాటిని పుస్తక రూపంలో తేవడం పనిగా పెట్టుకున్న ‘సింగిడి’ 2015లో వచ్చిన కథలను ‘అలుగు’ పేరిట సంపుటీకరించింది. ఆ సంవత్సరం వచ్చిన కథల్లో 12 కథలకు ఈ సంపుటిలో స్థానం దక్కింది.
పాత కొత్త రచయితల మేలి కలయికతో నేటి కథల్లో ఓ వైవిధ్యం కనబడుతోంది. తల పండిన కథకులతో పాటు ఎంట్రీ దొరికిన కొత్త కథకుల రచనాశైలి, నవీనధోరణులను కథనంలో జోడించిన తీరు తెలంగాణ కథా మొగ్గలు తొడుగుతున్న క్రమాన్ని కనబరుస్తున్నాయి.
ఇందులో- తెలంగాణ కథకులుగా ఉండి సార్వజనీన కథాంశంతో రాసిన కథలు కొన్ని కాగా కేవలం తెలంగాణ జీవనాన్ని వ్యక్తీకరించిన కథలు కొన్ని, కథాంశం కన్నా తెలంగాణ ప్రాంతానికి చెందిన కథారచయిత(త్రి)గా ఎదిగి వస్తున్న వారికి ప్రోత్సాహక రూపంలో స్థానమీయక తప్పదు.
ఆధునిక జీవితాల్లో వస్తున్న ఎత్తు పల్లాలను, తిరిగి సర్దుబాటులను ఆధునిక మహిళా ప్రతినిధిగా రచయిత్రి సరస్వతి రమ ‘ఆవలితీరం’ కథలో నిలబెట్టారు. తెలంగాణ కథ అంటే గ్రామీణ జీవిత చిత్రణ మాత్రమే కాదనేది గమనించాల్సిన అంశం. పట్టణ, నగర జీవన అంశాలు కూడా తెలంగాణ కథల్లో ప్రతిఫలించాలి. వీలైనట్లు భాష, సంస్కృతిని అందులో జోడించి తెలంగాణతనాన్ని గుబాళింపజేయాలి. రవి వీరెల్లి ‘గంధపుదండ’ కూడా నగర జీవన అంశానికి చెందినదే అయినా మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది.
25ఏళ్ల యువ రచయిత మేడి చైతన్య కథ ‘ప్రయాణం ఆగింది’ ఖమ్మం పలుకుబడితో కొత్త పరిమళాల్ని జల్లింది. చిన్న రైతును కామంధులు ఎలా ఇబ్బందులపాలు జేస్తారో చివరకు రైతు ప్రయాణం అర్ధాంతరంగా ఎలా ఆగిపోతుందో ఇందులో చూడవచ్చు. ‘కష్టాలన్నీ తీరిపోయి నాన్న తేలికవుతానని అనుకున్నాడేమో కాని నిన్న ఇప్పుడే బరువుగా అనిపించాడు’ అనే వాక్యంలో పెద్ద దిక్కు కోల్పోయిన రైతు కుటుంబం యాతనను తెలియజేస్తుంది.
సాంఘిక దురాచారాలపై కలం ఎక్కుపెట్టే చందు తులసి కథ ‘బుక్కెడు బువ్వ’ సమకాలీన సమస్యలపై తిరుగుబాటును చెబుతుంది. కాల్పనిక సన్నివేశాలలో సమాజ రుగ్మతలను ఎప్పటికప్పుడు కథలుగా మలిచే పనిలో ముందున్నాడు చందు.
షార్ట్ ఫిల్మ్‌లుగా వస్తున్న కొత్తతరం కథల్లో గుర్రం ఆనంద్ ‘యుద్ధం’ ఒకటిగా చెప్పవచ్చు. సమస్యతో పాటు కథనంలో జీవగుణం ఉండడం, సంక్షిప్తంగా మరిపించడం ‘కొత్త’ కథల్లోని సుగుణాలు.
ఏడుపదులు దాటిన కథకుడు దేవులపల్లి కృష్ణమూర్తి. ఆయన ‘వలస పక్షులు’ కథ పాఠకులను పక్కన కూచోబెట్టుకొని చిన్న చిన్న వాక్యాల్లో సీమాంధ్రుల రాకను విశదీకరిస్తుంది. భౌగోళిక, సామాజిక బదలాయింపు ఏ క్రమంలో, ఎంత పకడ్బందీగా జరిగిందో పూసగుచ్చినట్లు చెబుతాడు రచయిత.
తాను చూసిన కాలాన్ని, రచయిత ఒక చరిత్ర పాఠంగా నేటితరా నికి తన సహజ భాష, శైలీ వివరించడం ఇందులో ఆకట్టుకునే అంశం. పెద్దింటి అశోక్‌కుమార్ ‘చీమా చీమా ఎందుకు పుట్టావ్?’, కె.పి.నరేందర్ ‘బక్కడు’ తమ సహజధోరణిలో ఉన్న కథలు.
పుస్తకం చివరలో 2015లో వెలువడ్డ మరిన్ని మంచి కథలు అంటూ 28 కథల పేర్లు, రచయిత పేర్లు ప్రచురించడం బాగుంది. వీటితో మొత్తం 40 కథలకు ‘సింగిడి’ పూలదండలేసినట్లు.
ఒక సంవత్సరం అన్ని రకాల పత్రికల్లో అచ్చయిన కథలను పరిశీలించడం, వాటిని జల్లెడ పట్టడం ఎంతో శ్రమతో కూడుకున్న పని.
ఈ విశేష కృషి వెనుక ఎందరున్నారోగాని ‘అలుగు’ సంపాదకులుగా సుపరిచిత సాహితీవేత్తలు సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్ వ్యవహరించారు. కేవలం రూ.60/-కే ఈ పుస్తకాన్ని అందిస్తున్న ‘సింగిడి’ని అభినందించాలి.

బి.నర్సన్
9440128169

Comments

comments

Related Stories: