తలంబ్రాలతోనే అనంతలోకాలకు

ph

మన తెలంగాణ/ అచ్చంపేట: పెళ్లి పందిరిలో తాళి కట్టించుకొని తలంబ్రాలు పోసుకుంటూ వరుడి కాళ్లపై పడి అక్కడికక్కడే వధువుమృతి చెందిన హృదయ విదారకర ఘటన శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సభవించింది. అచ్చంపేట పట్టణంలోని మహింద్ర నగర్ కాలనీకి చెందిన నిరంజన్ , శంకరమ్మల కుమార్తె కొండి నీరంజనమ్మ(లక్ష్మి 20) ని వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన శేఖర్ , పద్మల కుమారుడు వెంకటేశ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు శనివారం ముహుర్తాన్ని ఖరారు చేశారు. కుటుంబ సభ్యులు, బందువుల సమక్షంలో వేద మంత్రోచ్ఛరణ మధ్య వివాహం జరిపించారు. తాళి కట్టిన అనంతరం వరుడు తలంబ్రాలు పోస్తుండగానే ఒక్క సారిగా నీరంజనమ్మ కుప్పకూలి వరుణి కాళ్ల వద్ద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తేరుకున్న బంధువులు చూసి వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి గుండె పోటే కారణమని పలువురు చర్చించుకున్నారు. పెళ్లి పందిరిలోనే వధువు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నీరంజనమ్మ కు ఐదుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెల్లు ఉండగా ఇద్దరు సోదరులు, తండ్రి గతంలోనే మరణించారు. వదువు మృత దేహానికి అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు శవాన్ని అప్పగించారు. మృతురాలి కుటుంబ సభ్యులను అచ్చంపేట మున్సిపల్ ఛైర్మెన్ తులసీరాం, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ్మ గౌడ్ పరామార్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు అచ్చంపేట ఎస్‌ఐ పరుషరామ్ తెలిపారు.