డ్రిల్లు నకిలీ.. ట్రైనర్ నకిలీ.. సర్టిఫికెట్లు మకిలీ

విద్యార్థిని విషాదాంతంలో మోసపు కోణాలు

Mock drill

కోయంబత్తూరు: తమిళనాడులో ఒక కాలేజీలో మాక్‌డ్రిల్ సందర్భంగా విద్యార్థిని మృతి ఘటనలో పలు కీలక కోణాలు వెలుగులోకి వచ్చాయి. విపత్కర పరిస్థితులలో తప్పించుకోవడం గురించి వచ్చిన శిక్షకుడు ఆర్ అర్ముగంకు  అసలు ఈ మాక్‌డ్రిల్‌పై సరైన అవగావహన కూడా లేదని వెల్లడైంది. పైగా ట్రైనర్ ఉద్యోగం పొందేందుకు నకిలీ సర్టిఫికెట్లు పొందినట్లు దర్యాప్తులో తేలింది. అధికారుల బృందం శనివారం ఈ ట్రైనర్‌కు సర్టిఫికెట్లు సమకూర్చిన అశోక్ అనే వ్యక్తిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కోయంబత్తూరులోని కొవాయి కలైమగల్ ఆర్ట్ సైన్స్ కళాశాలలో డిగ్రీ విద్యార్థిని ఎన్ లోకేశ్వరి కాలేజీ మొదటి అంతస్తు నుంచి కిందకు దూకుతుండగా కింద ఉండే  గోడ అంచులు తగిలి దుర్మరణం చెందింది. అయితే ట్రైనీగా వచ్చిన అర్ముగమే ఆమెను కిందికి తోసేసినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. అయితే కేవలం డ్రిల్‌లో భాగంగానే ఆమెను కిందికి దూకాలని ప్రేరేపించినట్లు అర్ముగం చెపుతున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథార్టీ (ఎన్‌డిఎంఎ) తరఫున ఈ డ్రిల్‌ను ఈ శిక్షకుడు నిర్వహించారు. అయితే అసలు అర్ముగం అనే వ్యక్తికి మాక్ డ్రిల్‌కు తాము అనుమతిని ఇవ్వలేదని అధికారులు తెలిపారు. దీనితో పూర్తి స్థాయిలో జరిపిన దర్యాప్తు నివేదిక ఇప్పుడు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు అం దింది. ఇందులో అర్ముగం తిరునల్వేలికి చెందిన వ్యక్తి అని వెల్లడైంది.

ఆ వ్యక్తి గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అనేక కళాశాలలకు చెందిన 1200 మందికి పైగా విద్యార్థులకు మాక్‌డ్రిల్ సందర్భంగా శిక్షణ ఇస్తున్నట్లు, ఒక్కో విద్యార్థి నుంచి రూ 50 చొప్పున వసూలు చేస్తున్నట్లు నిర్థారణ అయింది. ఎన్‌డిఎంఎ నుంచి ఆర్ముగానికి అశోక్ అనే వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లు సమకూర్చడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. అశోక్ వీటిని ఏ విధంగా పొందాడు? నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ ఏ స్థాయిలో ఉంది? వంటి అనేక అంశాలపై ఆరాతీస్తున్నారని వెల్లడైంది. ఇక ఈ కాలేజీ దుర్మరణంపై కాలేజీ విద్యా విభాగం ప్రాంతీయ డైరెక్టర్ ఎస్ కళా శనివారం జిల్లా కలెక్టర్ టిఎన్ హరిహరన్‌కు నివేదిక అందించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్రస్థాయిలో స్పందించారు. మొత్తం వ్యవహారంపై సత్వర దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. పోలీసు, విద్యా విభాగాల నుంచి సమగ్ర దర్యాప్తులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలనకు అందించనున్నారు. భారతీయార్ విశ్వవిద్యాలయం పరిధిలోకి  కొవాయ్ కళైమాగల్ కాలేజీ ఉండటంతో, అక్కడి ఘటన గురించి విశ్వవిద్యాలయ అధికారులు నివేదికలు కోరారు.