డిఎంకెలో ఇక స్టాలిన్ శకం

DMK president is stalin

ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) వ్యవస్థాపకుడు సి.ఎన్. అన్నాదురై మరణానంతరం దాదాపు ఐదు దశాబ్దాలపాటు పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగిన ద్రవిడ ఉద్యమ నేత ఎం.కె. కరుణానిధి మరణంతో ఖాళీ అయిన పార్టీ అత్యున్నత స్థానంలోకి ఆయన కుమారుడు ఎం.కె. స్టాలిన్ నేడు లాంఛనంగా అడుగుపెడుతున్నారు. కరుణానిధి జీవించ ఉండగానే స్టాలిన్‌కు వారసత్వాన్ని ఖరారు చేసినందున ఈ ఎన్నిక పార్టీ నిబంధనావళిని సంతృప్తి పరిచే లాంఛనం. మొత్తం 65 పార్టీ జిల్లా కమిటీల కార్యదర్శులు స్టాలిన్ నామినేషన్‌ను ప్రతిపాదించారు. సోమవారం సాయంత్రం 4 గంటలతో ఉపసంహరణ గడువు ముగియటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. మంగళవారం జరిగే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టాలిన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి పార్టీకి దిశానిర్దేశ ప్రసంగం చేస్తారు. 2008 నుంచి స్టాలిన్ నిర్వహిస్తున్న కోశాధికారి పదవికి అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నాయకుడు దురై మురుగన్ ఎన్నికైనారు. స్టాలిన్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమించబడిన తదుపరి కూడా కోశాధికారిగా కొనసాగారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని సుమారు 41 సంవత్సరాలుగా అంబాలగన్ నిర్వహిస్తున్నారు.

స్టాలిన్ ముందు రెండు తక్షణ సమస్యలున్నాయి. అన్న అళగిరి నుంచి పార్టీకి ఎదురుకాగల నష్టాన్ని తటస్థీకరించటం. కరుణానిధి జీవించి ఉండగానే అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించినందున టెక్నికల్‌గా అతడు పార్టీకి వెలుపల ఉన్నాడు. అయితే రాజకీయ శక్తిగా ఎదిగేందుకు అతను ప్రయత్నాలు చేస్తున్నందున, ఒకే వంశవారసత్వం కారణంగా డిఎంకెకి కొంత నష్టం కలుగజేయవచ్చు. రెండు, 2019 ఏప్రిల్ మే లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయటం, బిజెపికి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష అలయెన్స్‌ను కూర్పు చేయటం. జయలలిత మరణానంతరం పాలక ఎఐఎడిఎంకె నాయకత్వ లోపం, అంతర్గత కలహాలతో బలహీనపడిన రాజకీయ వాతావరణంలో డిఎంకె అవకాశాలు మెరుగుపడినట్లు భావించబడుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జూనియర్ భాగస్వామిగా డిఎంకె అలయెన్స్ దాదాపు 100 స్థానాలు సాధించింది.

కరుణానిధి కొన్ని దశాబ్దాలుగా స్టాలిన్ రాజకీయ వారసత్వాన్ని సిద్ధం చేసి డిఎంకెని కుటుంబ పాలన పార్టీగా తయారు చేశారు. కరుణానిధి అనేక ఆటుపోట్ల నుంచి ఎంజిఆర్ పరిపాలన, వైగో నిష్క్రమణ, 2 జి స్పెక్ట్రం అవినీతి ఆరోపణలు వగైరా పార్టీని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఐదుస్లారు ముఖ్యమంత్రి అయిన కరుణానిధి ఆగస్టు 7న మరణించిన తదుపరి పార్టీ కార్యకర్తల దృష్టి స్టాలిన్‌పై కేంద్రీకరించింది. అయితే కరుణానిధిలేని లోటును పూడ్చగలడా అన్న సందేహం వారిని పీడిస్తోంది. డిఎంకె ప్రధాన ప్రత్యర్థి ఎఐఎడిఎంకె అధికారం చేతిలో ఉన్నప్పటికీ ప్రజల్లో పలచన కావటమే వారికి సంతృప్తి. ఏమైనా, పరీక్ష ఎదురైనప్పుడు ప్రజా కార్యక్షేత్రమే ఎవరి భవిష్యత్ ఏమిటో నిర్ణయిస్తుంది.

ద్రవిడియన్ పరిపాలన అనేది రాష్ట్రాన్ని అభివృద్ధిపరచటం, ప్రజలకు ఎంతోకొంత సంక్షేమం చేకూర్చటమేకాదు. దానికొక సిద్ధాంత నిబద్ధత ఉంది. బ్రాహ్మణీక ఆధిపత్య భావజాలంపై అట్టడుగు వర్గాల తిరుగుబాటు, సామాజిక న్యాయం ద్రవిడ రాజకీయాలకు ప్రాతిపదిక. ద్రవిడియన్ ప్రభుత్వాలు, ముఖ్యంగా కరుణానిధి పరిపాలన మహిళలకు ఆస్తి హక్కులు, పీడిత తరగతులకు రిజర్వేషన్‌లు, ఆత్మగౌరవ వివాహాలు, లింగమార్పిడి వ్యక్తులకు ప్రభుత్వ గుర్తింపు వంటి చర్యల ద్వారా గుర్తింపును చిరస్థాయి చేసుకుంది. అయితే దళితులకు సామాజిక న్యాయంలో తొలినాళ్ల పట్టుదలను కోల్పోయింది. మధ్యంతర కులాల, అనగా ఒబిసిల ప్రాబల్యం పార్టీలో పెరగటమే ఇందుకు కారణమనవచ్చు. పోటీ రాజకీయాల్లో కరుణానిధి ఉద్దేశపూర్వకంగానే దీన్ని అనుమతించారు. అయితే తండ్రికి ఎంత సన్నిహితంగా మెలిగినప్పటికీ స్టాలిన్ కరుణానిధి కాలేరు. తనేమిటో నిరూపించుకోవటానికి అతను ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. చెన్నై మేయరుగా పనిచేయటం, ప్రస్తుతం ప్రతిపక్ష నాయక పాత్ర ప్రజాస్వామ్య క్షేత్రంలో రాజకీయ తర్ఫీదు లాంటివి. వచ్చే లోక్‌సభ ఎన్నికలు 65 ఏళ్ల స్టాలిన్ నాయకత్వ లక్షణాలకు, ప్రజల నుంచి ఆమోద యోగ్యతకు ప్రథమ పరీక్ష.