డాక్యుమెంట్ రైటర్లే బినామీలు

సబ్ రిజిస్ట్రార్ ఇళ్ళపై దాడులలో గుర్తించిన ఎసిబి

registration1

హైదరాబాద్ : భూ రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు పాల్పడ్డ సబ్ రిజిస్ట్రార్‌లు తమ కార్యాలయాల వద్ద పని చేసే డాక్యుమెంట్ రైటర్లను బినామీలు గా పెట్టుకుని భారీ ఎత్తున ఆస్తులను కూడగట్టినట్లు ఎసిబి దాడుల లో తేలింది. మియాపూర్ భూకుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అక్రమార్కుల అంతు తేల్చేందుకు ఎసిబిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గడచిన 15 రోజులుగా సబ్ రిజిస్ట్రార్‌ల బాగోతాలను తెలుసుకున్న ఎసిబి అధికారులు వేర్వేరు బృందాలుగా విడిపోయి పలు చోట్ల దాడులను నిర్వహిస్తున్నారు. ఈ దాడులలో అధికారులకు కళ్ళు చెదిరే ఆస్తుల చిట్టాలు లభించాయి. అక్రమాలకు పాల్పడి అందినంత దోచుకున్న సబ్ రిజిస్ట్రార్లు తెలివిగా తమ వద్ద పని చేసే డాక్యుమెంట్ రైటర్ల పేరిట దాచారు. ఇలా దాచిన వాటి డాక్యుమెంట్లను తమ ఇంట్లోనే పెట్టుకున్నారు.

మిత్రులనో, సన్నిహితులనో బినామీలుగా పెట్టుకున్న వైనాన్ని ఎసిబి అధికారులు చాలా చూశారు. కానీ డాక్యుమెంట్ రైటర్లనే బినామీలుగా పెట్టుకున్న వైనాన్ని చూసి వారు విస్తుపోతున్నారు. మంగళవారం ఎసిబి అధికారులు శ్రీనివాసరావుకు చెందిన ఇళ్ళపై., బుధవారం యూసుఫ్‌కు చెందిన ఇళ్ళపై దాడులు జరిపారు. ఈ ఇద్దరూ తాము సంపాదించిన డబ్బుతో నగరంతో పాటు వేర్వేరు ప్రాంతాలలో ప్లాట్లు, భవనాలు, ఇళ్ళు, వ్యవసాయ పొలాలను కొనుగోలు చేశారు. తమ కుటుంబసభ్యులతో పాటు డాక్యుమెంట్ రైటర్ల పేర్లతో వీటిని కొనుగోలు చేసినట్లు రిజిస్టర్ చేయించారు. బంధువులు, మిత్రులైతే ఎప్పుడైనా ఎదురు తిరిగే ప్రమాదం ఉందనుకున్న వీరు తమ కార్యాలయాల వద్ద పని చేసే డాక్యుమెంట్ రైటర్లను బినామీలుగా పెట్టుకున్నారన్న విషయం స్పష్టమవుతుందని ఎసిబి అధికారులు అంటున్నారు.

శ్రీనివాసరావు స్థిరాస్తులను బినామీలుగా డాక్యుమెంట్ రైటర్లను పెట్టుకున్న ఈయన కోట్ల కొద్దీ డబ్బులు తెలివిగా వైట్ చేసుకున్నట్లు, ఈ సొమ్ముతో తన కుమారుడి పేరుతో కొన్ని కంపెనీలను ప్రారంభించినట్లు అధికారులు తెలుసుకున్నారు. మరికొన్ని కంపెనీలలో కుమారుడు కనిష్క్‌ను డైరెక్టర్‌గా చేర్చారని అధికారులు చెప్పారు. తన రోజువారీ సంపాదనను కుమారుడి పెట్టుబడుల కింద కంపెనీలకు మళ్ళించినట్లు అధికారులు వివరించారు. ఇలా కేవలం రెండేళ్ళలోనే రూ. 12 కోట్ల నగదును కంపెనీలలో పెట్టుబడులుగా చూపించారని పేర్కొన్నారు.

శ్రీనివాసరావు బినామీల్లో కళ్ళెం ప్రభాకర్‌రెడ్డి ఒకరు. ఇతడి పేరిట 150 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయినట్లు ఎసిబి గుర్తించింది. ప్రభాకర్‌రెడ్డి సోదరుడు కూడా బినామీగా వ్యవహరించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న సమయంలో స్నేహితులైన మంజులా రెడ్డి, దురగపూడి కిషోర్, రంజిత్‌లను కూడా శ్రీనివాసరావు బినామిలుగా పెట్టుకున్నాడని ఎసిబి గుర్తించింది. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసిన యూసుఎఫ్ తన మామ ఇమాముద్దీన్‌ను ప్రధాన బినామిగా మార్చుకున్నాడని తేలింది. ఇమాముద్దీన్ గతంలో ఎఫ్‌సిఐలో పని చేసి 2001లో పదవీ విరమణ పొందిన తర్వాత బినామీగా మారాడు. మామతో పాటు యూసుఫ్ మరికొంత మంది బంధువులను బినామిలుగా మార్చుకునాడు. వీరిలో అర్షద్ హుసేన్, అత్తర్ షరీఫ్, బాబా తదితరులు కీలకులని ఎసిబి సోదాలలో తేలింది.

Comments

comments