డబుల్ ధమాకా

On the eleventh day, India will have two more gold medals

అర్పిందర్, స్వప్నలకు స్వర్ణాలు, హాకీ ఫైనల్లో మహిళా జట్టు
ద్యుతికు రజతం, టిటిలో మరో కాంస్యం
ఆసియా క్రీడల్లో భారత్ జోరు

జకార్తా: ఆసియా క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతోంది. బుధవారం పదకొండో రోజు భారత్ మరో రెండు స్వర్ణ పతకాలు గెలుచుకుంది. పురుషుల ట్రిపుల్ జంప్‌లో అర్పిందర్ సింగ్, మహిళల హెప్టాథ్లాన్ విభాగంలో స్వప్నా బర్మన్ పసిడి పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య పదకొండుకు చేరింది. మరోవైపు మహిళల 200 మీటర్ల పరుగులో సంచలన అథ్లెట్ ద్యుతి చంద్ రజతం సాధించింది. ఈ క్రీడల్లో ద్యుతికు ఇది రెండో పతకం కావడం విశేషం. ఇదే సమయంలో ఈ ఘనత సాధించిన రెండో అథ్లెట్‌గా ద్యుతి రికార్డు సృష్టించింది. గతంలో అథ్లెటిక్స్ విభాగంలో దిగ్గజ అథ్లెట్ పి.టి.ఉష మాత్రమే ఒకటి కంటే ఎక్కువ పతకాలు గెలుచుకుంది. తాజాగా ద్యుతి ఈ ఘనతను అందుకుంది. ఇక, మహిళల హాకీలో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో భారత్ 10తో చైనాను ఓడించింది. పురుషుల బాక్సింగ్‌లో అమిత్ పంగల్, వికాస్ కృష్ణన్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో బాక్సింగ్స్‌లో రెండు కాంస్యాలు ఖాయమయ్యాయి. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ విభాగంలో శరత్ కమల్, మనికా బాత్రా జోడీ కాంస్యం గెలుచుకుంది. మహిళల స్కాష్ టీమ్ చాంపియన్‌షిప్ విభాగంలో భారత్ సెమీస్‌కు చేరింది. దీంతో మరో పతకం ఖాయమైంది. పురుషుల 1500 మీటర్ల పరుగులో జిన్సన్ జాన్సన్, మంజీత్ సింగ్‌లు ఫైనల్‌కు అర్హత సాధించారు.

స్వప్న సంచలనం..
మహిళల హెప్టాథ్లాన్‌లో భారత స్టార్ అథ్లెట్ స్వప్నా బర్మన్ సంచలనం సృష్టించింది. క్లిష్టమైన ఈ విభాగంలో స్వప్న 6,026 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. హెప్టాథ్లాన్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు, హైజంప్, షాట్‌పుట్, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్ల పరుగు ఉంటాయి. ఈ అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణిస్తేనే హెప్టాథ్లాన్ స్వర్ణం లభిస్తుంది. మరోవైపు దవడ నొప్పితో బాధపడిన స్వప్న అసాధారణ పోరాట పటిమతో రాణించి పసిడి పతకాన్ని అందుకుంది. లాంగ్ జంప్ చేస్తున్నప్పుడు తల కిందకు తాకింది. దీంతో ఆమె దవడకు తీవ్ర గాయమైంది. అయినా నొప్పిని సైతం ఓర్చుకుంటూ ముందుకు సాగింది. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచిన స్వప్న చివరికి 6026 పాయింట్లు సాధించి తన స్వర్ణ కలను నెరవేర్చుకుంది.

చరిత్ర సృష్టించిన అర్పిందర్..
మరోవైపు పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో అర్పిందర్ సింగ్ స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఈ విభాగంలో 48 ఏళ్లుగా ఊరిస్తున్న పసిడి కలను అర్పిందర్ నెరవేర్చాడు. ప్రారంభం నుంచే నిలకడైన ఆటను కనబరిచిన అర్పిందర్ 16.77 మీటర్లు దూకి పెను సంచలనం సృష్టించాడు. ఇదే క్రమంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన అర్పిందర్ రెండో ప్రయత్నంలో 16.58 మీటర్లు దూకాడు. ఇక, మూడో ప్రయత్నంలో ఏకంగా 16.77 మీటర్లు దూకి పెను సంచలనం సృష్టించాడు. అప్పటి నుంచి చివరి వరకు అర్పిందర్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుని స్వర్ణం సొంతం చేసుకున్నాడు. కాగా, ట్రిపుల్ జంప్‌లో భారత్‌కు స్వర్ణం లభించడం 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. గతంలో 1970లో మోహిందర్ సింగ్ 16.11 మీటర్ల దూరంతో పసిడి పతకం సాధించాడు. ఆ తర్వాత ఈ విభాగంలో భారత్‌కు పసిడి అందించిన ఘనత అర్పిందర్ దక్కించుకున్నాడు.

ద్యుతికు మరో రజతం..
మహిళల అథ్లెటిక్స్‌లో ద్యుతి చంద్ వరుసగా రెండో రజతం గెలుచుకుంది. బుధవారం జరిగిన మహిళల 200 మీటర్ల పరుగులో ద్యుతి రెండో స్థానంలో నిలిచింది. ఈ తరం పిటి ఉషగా పేరు తెచ్చుకున్న ద్యుతి ఈ క్రీడల్లో రెండో పతకాన్ని దక్కించుకుంది. 200 మీటర్ల పరుగులో ద్యుతి సత్తా చాటింది. 23.20 సెకన్లలో గమ్యాన్ని చేరి తన ఖాతాలో రజతం జమ చేసుకుంది. కాగా, బహ్రెయిన్‌కు చెందిన ఎడిడియాంగ్ ఓడియాంగ్ 22.96 సెకన్లలో పరుగును పూర్తి చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. అంతకుముందు 100 మీటర్ల విభాగంలోనూ ద్యుతిచంద్ రజతం సాధించింది. ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్న ద్యుతి ఈ ఆసియా క్రీడల్లో ఏకంగా రెండు పతకాలు గెలుచుకుని దిగ్గజాల సరసన నిలిచింది. ఇంతకుముందు పిటి.ఉష, జ్మోతిర్మయి సిక్టార్, సునితా రాణిలు మాత్రమే రెండు అంతకంటే ఎక్కువ పతకాలు గెలుచుకున్నారు. తాజాగా ద్యుతి కూడా ఈ రికార్డును అందుకుంది.

హాకీ ఫైనల్లో భారత్…
ఇక, హాకీలో భారత మహిళా జట్టు ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 10 తేడాతో చైనాను ఓడించి పసిడి పోరుకు దూసుకెళ్లింది. ఈ విజయంతో భారత్ హాకీలో రజతం ఖాయం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్ పోరులో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ప్రారంభం నుంచే ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. అయితే రెండు జట్లు రక్షణాత్మక ఆటకే ప్రాధాన్యత ఇవ్వడంతో పోరు నత్తనడకన సాగింది. ప్రథమార్ధంలో రెండు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేక పోయాయి. ద్వితీయార్ధంలో భారత్ కాస్త దూకుడును పెంచింది. చైనా కూడా గోల్ కోసం తీవ్రంగా శ్రమించింది. ఎట్టకేలకు భారత్ శ్రమ ఫలించింది. 52వ నిమిషంలో స్టార్ క్రీడాకారిణి గుర్జిత్ కౌర్ భారత్‌కు ఏకైక గోల్‌ను అందించింది. పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచిన గుర్జిత్ భారత్ విజయంలో ముఖ్య భూమిక పోషించింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ ఫైనల్‌కు చేరుకుంది. స్వర్ణం కోసం జరిగే పోరులో జపాన్‌తో భారత్ తలపడుతుంది.

సెమీస్‌లో వికాస్, అమిత్
పురుషుల బాక్సింగ్‌లో వికాస్ కృష్ణన్, అమిత్ పంగల్‌లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో బాక్సింగ్‌లో భారత్‌కు కనీసం రెండు కాంస్యా పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం జరిగిన పురుషుల 49 కిలోల లైట్ ఫ్లై విభాగం క్వార్టర్ ఫైనల్లో అమిత్ పంగల్ విజయం సాధించాడు. దక్షిణ కొరియా బాక్సర్ కిమ్ జంగ్ యాంగ్‌తో జరిగిన పోరులో అమిత్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. చివరి వరకు జోరుకు కనబరిచిన అమిత్ 50తో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. మరో పోటీలో దిగ్గజ బాక్సర్ వికాస్ కృష్ణన్ విజయం సాధించాడు. బుధవారం జరిగిన 75 కిలోల మిడిల్ వెయిట్ విభాగం క్వార్టర్ ఫైనల్ పోరులో వికాస్ 32తో చైనా బాక్సర్ తంగ్లతియాన్‌ను ఓడించాడు. హోరాహోరీగా సాగిన పోరులో వికాస్ చివరి వరకు నిలకడైన ప్రదర్శన ఇస్తూ సెమీస్‌కు చేరుకున్నాడు. మరోవైపు టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు కాంస్యం లభించింది.

శరత్ కమల్, మనికా బాత్రా జోడీ సెమీస్‌లో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో చైనా జంట చేతిలో శరత్ జోడీ పరాజయం చవిచూసింది. దీంతో టిటిలో భారత్ పోరు ముగిసింది. ఈ విభాగంలో భారత్ రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. ఇదిలావుండగా స్కాష్‌లో కూడా భారత్‌కు మరో పతకం ఖాయమైంది. మహిళల టీమ్ చాంపియన్‌షిప్ విభాగంలో భారత్ సెమీస్‌కు చేరుకుంది. జోష్న చినప్ప, దీపికా పల్లికల్, సునయనా కురువిల్లా, తన్వీ ఖన్నాలతో కూడిన భారత బృందం 30తో చైనాను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. దీంతో భారత్‌కు ఈ విభాగంలో కాంస్యం ఖాయమైంది.